Tuesday, May 14, 2024

ఇక ప్రయోగాలకు వేళాయె..

- Advertisement -
- Advertisement -

india-vs-new-zealand

ఆత్మవిశ్వాసంతో భారత్,  పరువు కోసం కివీస్
నేడు నాలుగో టి-20

వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన మూడో టి20లో టీమిండియా సూపర్ ఓవర్‌లో జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. దీంతో నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలకు దిగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు మిగిలిన రెండు మ్యాచుల్లోనైనా నెగ్గి కాస్తయినా పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. అయితే జోరుమీదున్న టీమిండియాను ఓడించడం కివీస్‌కు ఆనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో షమి, రోహిత్ అసాధారణ ఆటతో భారత్‌కు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టారు. రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. తాను నిలదొక్కుకుంటే ఎంత ప్రమాదమో కిందటి మ్యాచ్‌లో రోహిత్ ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. ఈసారి కూడా అలాంటి జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా దూకుడు మీదున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతో జట్టును ఆదుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. రోహిత్, రాహుల్ మరోసారి విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా కోహ్లిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు విజయం నల్లేరుపై నడకే.

ఓదార్పు కోసం

మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మిగిలిన రెండు టి20ల్లోనైనా గెలిచి రానున్న వన్డే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. కానీ, నిలకడలేమి కివీస్‌కు ప్రధాన సమస్యగా తయారైంది. ఓపెనర్లు మన్రో, గుప్టిల్ శుభారంభం అందిస్తున్నా కీలక సమయంలో పెవిలియన్ చేరి జట్టును ఒత్తిడిలోకి నెడుతున్నారు. గ్రాండోమ్ వైఫల్యం కూడా జట్టును వెంటాడుతోంది.

మిగిలిన రెండు వన్డేల్లో బ్యాట్స్‌మెన్ తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలోనూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ సాగిన అతని బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్‌లో కూడా విలియమ్సన్‌పైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రాస్, గుప్టిల్, సాంట్నర్, మన్రో తదితరులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే కివీస్ సమస్యాలు చాలా వరకు తీరి పోతాయి.

india vs new zealand 4th t20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News