న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఓ వైపు పాక్ దాడులను తిప్పికొడుతూనే.. మరోవైపు, ఉగ్రవాదులను భారత ఆర్మీ వేటాడుతోంది. సరిహద్దు సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యం దాడి చేసి.. వాటిని ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
“ఆపరేషన్ సిందూర్.. భారత సైన్యం ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను పేల్చేసింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్‌లోని అనేక నగరాల్లో మే 8, 9 తేదీలలో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా.. భారత సైన్యం ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై కాల్పులు జరిపి, వాటిని ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు గతంలో భారత పౌరులు, భద్రతా దళాలపై దాడులను ప్లాన్ చేయడానికి కేంద్రంగా పనిచేస్తున్నాయి. భారత సైన్యం వాటిని ధ్వంసం చేయడంతో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలకు గట్టి దెబ్బ తగిలింది” అని భారత ఆర్మీ పేర్కొంటూ వీడియోను పంచుకుంది.