Sunday, April 28, 2024

రాజ్యాంగ రక్షణే దేశభక్తి

- Advertisement -
- Advertisement -

ప్రాచీన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలతో నిండి వున్నదే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అనేది ఒక రివల్యూషనరీ డాక్యుమెంట్, కౌంటర్ ఐడియాలజీ, డాక్యుమెంట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్, నేషనల్ రీకన్‌స్ట్రక్షన్ పోగ్రామ్. దేశమంటే ఒక సామాజిక సమ్మేళనం. మన రాజ్యాంగం కూర్పు మనం గమనిస్తే రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది అని అందరికీ తెలుసు. కానీ రాజ్యాంగానికి ఒక రూపురేఖల రావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు, పుస్తక పఠనం కోసం, రాయడానికి ఖర్చు చేశారో తెలియదు. రాజ్యాంగ రచనా కాలంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం ప్రాణంగా పెట్టి దేశం కోసం, దేశ సేవ కోసం ముందున్నారు. వాటికి ఇప్పటికీ విలువ కట్టలేము. గుండెల్లో దేశభక్తిని నింపుకుని ఒక బాధ్యత గల పౌరుడిగా దేశం కోసం కఠోర శ్రమ చేసి దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమ న్యాయం ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి సొంత ఆస్తి అంటూ ఏమీ లేకుండా భారత దేశం కోసమే మరణించారు.

భారత రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్ 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు) 22 భాగాలతో ప్రపంచ దేశలలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా రూపొందించడానికి 11 సమావేశాలు 165 రోజులు జరిగాయి. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నారు. 9 డిసెంబర్ 1946 నా మొట్టమొదటి సమావేశం జరిగితే, 29 ఆగస్టు 1947న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకున్నారు. 7635 ఆర్టికల్స్ సవరణ గూర్చి సభ ముందు ఉంచగా, 2473 ఆర్టికల్స్ చర్చించారు. ప్రపంచంలో ఏదీ ఇది శాశ్వతం కాదని, ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుందని ముందే గమనించి మారుతున్న దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వేసులుబాటు కల్పించారు. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగినాయి. కెనడా లాంటి దేశాలలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మార్పు చేసే అధికారం లేదు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల ఐదు నెలలు పట్టింది. అదే విధంగా ఆస్ట్రేలియాలో 128 ఆర్టికల్స్‌తో రూపొందించుకున్న రాజ్యాంగం తొమ్మిది సంవత్సరాలు పట్టింది. దక్షిణాఫ్రికాలో 153 ఆర్టికల్స్‌తో ఒక సంవత్సర కాలం పట్టింది. అమెరికా అయితే థామస్ జఫర్సన్ నాయకత్వంలో కేవలం 7 ఆర్టికల్స్ నాలుగు నెలల్లో పూర్తి చేశారు.

మన దేశంలో రాజ్యాంగానికి ముందు మెజారిటీ మానవులకు అంటే బహుజనులకు కనీస మానవహక్కులైన కూడు, గుడ్డ, నివాసం, చదువు సంపద లేని మనువాద ఆప్రజాస్వామ్యంలో సాటి మనుషులను జంతువుల కంటే హీనంగా, అంటరానివారిగా, ముట్టరానివారిగా, వారు పీల్చిన గాలి, వారి నీడ సైతం అంటరానిదిగా, నోటికి ముంత, ముడ్డికి తాటాకు కట్టి దీనికి కులం అనే కంపును అంటకట్టి భారతదేశ ఆత్మగౌరవాన్ని నడిబజారుకు ఈడ్చి ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేశారు. 1925 డిసెంబర్ 25న ఈ మను ధర్మాన్ని బూడిద చేసి యావత్ భారతీయులకు స్వేచ్ఛా వాయువులను అందిస్తూ మనిషి మనిషిగా బతికే హక్కు రాజ్యాంగం ద్వారా మనకు అందించి ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేలా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక రూపంగానే కాక ఒక వాస్తవంగా కూడా ఉండాలంటే మొదటిగా సాంఘిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే మనం రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలి. రక్తపాత పద్ధతులను వదిలివేయాలి. జాన్ స్టువర్ట్ మిల్ చెప్పినట్లు తన స్వతంత్రాన్ని ఎటువంటి గొప్ప వ్యక్తి పాదాల వద్ద ఉంచకూడదు, అదే విధంగా నమ్మకూడదు, అధికారం ఇవ్వకూడదు అందువల్ల ఆ వ్యక్తి సంస్థలను/ వ్యవస్థలను మార్చి వేసే అవకాశం ఉంది అని అంటాడు.

అదే విధంగా ఐరిష్ దేశ భక్తి పరుడు డానియల్ కనేల్ మాట్లాడుతూ ఏ వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోయి, ఏ స్త్రీ తన శీలాన్ని కోల్పోయి, ఏ దేశం తన స్వతంత్రాన్ని కోల్పోయి కృతజ్ఞతలు చెల్లించకూడదు అంటారు. బాబాసాహెబ్ అయితే రాజకీయభక్తి నాయక రాధన దిగజారుడు తనానికి నియంతృత్వానికి దారి తీస్తుంది అంటూ ప్రజలు రాజకీయ ప్రజాస్వామ్యంతోనే సంతృప్తి చెందరు. అది సామాజిక ప్రజాస్వామ్యంగా పరివర్తన చెందాలి. సామాజిక ప్రజాస్వామ్య పునాదులు లేకుండా రాజకీయ ప్రజాస్వామ్య మనజాలదు అంటారు. సామాజిక ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి జీవన విధానంగా మార్చుకోవాలి. కులాలు జాతికి వ్యతిరేకం. అవి అసూయ పరస్పర విద్వేషాన్ని కలిగిస్తాయి. ఒక జాతి ఏర్పడినప్పుడే సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది. సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ సమానత్వం గోడకు వేసిన సున్నం లాంటిది అని దేశంలో ఆర్థిక, సాంఘిక, న్యాయం ఉండాలి. అంటే పరిశ్రమలను భూమిని జాతీయం చేయాలనీ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 17 డిసెంబర్ 1946లో రాజ్యాంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రజాస్వామ్యం అనే ఒక పచ్చని చెట్టు ఎక్కడపడితే అక్కడ ఎదగదు. ఇంగ్లాండ్, అమెరికాలో అది పరిఢవిల్లింది. ఫ్రాన్స్‌లో ఒక మేరకు అభివృద్ధి చెందింది. ఎన్నో దేశాలలో బహిరంగంగా ఖూనీ అయింది. సైనిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే సమాజంలో ఎటువంటి అసమానతలు లేకపోవడం, ప్రతిపక్షాల ఉనికిని గుర్తించడం, మైనారిటీల మీద మెజారిటీ పెత్తనం ఉండకూడదు. సమాజంలో నైతిక విలువలను పెంపొందిస్తూ అన్యాయానికి స్పందించే లక్షణాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలి. అందుకే లాస్కీ మహనీయుడు ప్రజాస్వామ్యానికి నైతిక విలువలు అనేవి ఆయువుపట్టు, విలువలు చెదిరిపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటాడు. ఒకప్పుడు ధనిక రాష్ట్రాలుగా ఉన్నవి ఇప్పుడు అప్పుల రాష్ట్రాలుగా మారుతున్నవి అంటే దానికి నైతిక విలువలు లేని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులే కారణం. దెయ్యాలు హితం బోధించినట్లు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చలి అంటాడు ఒక రాజకీయ నాయకుడు. మరొక రాజకీయ నాయకుడు భారత దేశపు మువెన్నెల జెండా మార్చాలి అంటాడు. మరొక్కడొచ్చి దేశం పేరు మార్చాలి అంటాడు.

దేశంలో రాజకీయ అధికారం చాలా కాలం అల్పజనుల గుత్తాధిపత్యంలో ఉండడం వల్ల సమాజానికి విఘాతం కలిగించే విధంగా తయారయ్యారు. వీళ్ళందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సమ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి బద్ధ వ్యతిరేకులు. దేశానికి శత్రువులు, వీళ్లు అప్రజాస్వామిక నిరంకుశవాదులు. వీరికి దేశంలో స్థానం లేదు, తిరిగి ప్రజలే సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెబుతారు. భారత దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదన్నది వాస్తవం. రాజ్యాంగం మార్పు అయినట్లయితే దేశం సార్వభౌమత్వం కోల్పోయి స్వాతంత్య్రం ప్రమాదంలోనికి నెట్టివేయబడివచ్చు. రాజ్యాంగాన్ని సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు మధ్య భేదాభిప్రాయాలు వచ్చి దేశ విభజనకు దారి తీసి రెండు మూడు దేశాలుగా విడిపోయే అవకాశం ఉండవచ్చు, భారత దేశ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి బీటలుపడి సమైక్యతను దెబ్బతీయవచ్చు. మానవ మనుగడకే ప్రమాదకరంగా మారిపోతుంది. యావత్ భారతీయులందరూ ఇంతకన్నా గొప్ప రాజ్యాంగాన్ని మనం ఎవరి నుంచీ కూడా ఆశించలేము.

నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి. అంతేకానీ వెనుక మాత్రం లాగవద్దు అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడు మొదటిగా, చివరిగా బాధ్యత కలిగిన భారతీయుడవలే రాజ్యాంగాన్ని యధార్థంగా అమలుచేసే విధంగా చైత్యనం చెంది భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే బాధ్యతగా, ఈ మార్గంలో ఎదురయ్యే దుష్టశక్తులను ఎదుర్కోవడమే దేశ సేవ, ఇంతకంటే వేరే మార్గమే లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News