Wednesday, May 1, 2024

ఎస్‌సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?

- Advertisement -
- Advertisement -

రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ రక్షణతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. సమాజంలో సామాజికంగా విద్య, ఉద్యోగ, రాజకీయంగా అత్యంత వెనుకబడ్డ కులాలకు చెందిన వారిని అభివృద్ధి చెందే విధంగా, వారు సమాజంలో సమాన స్థాయికి చేరుకునేందుకు భారత రాజ్యాం గం దళిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన విషయం విదితమే. కానీ ఈ వర్గాల్లో నేటికీ అసమానతలు ఎదుర్కొంటున్నాయి.

రిజర్వేషన్ ఫలాలు కింది స్థాయి వరకు చేరడం లేదు. అందరం దళితులమేనన్న నెపంతో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాలలో షెడ్యూల్డ్ కులాల్లో మాల, మాదిగ ఈ రెండు కులాలే లబ్ధి పొంది మిగతా కులాలు అణగదొక్కబడ్డాయని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ఆ పరిస్థితిని నేటికీ కళ్లారా చూస్తున్నాము. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎస్‌సి రిజర్వేషన్ స్థానాల్లో ఇంతకాలం అన్యాయానికి గురై రాజ్యాధికారాన్ని పొందలేని ఉప కులాలను విస్మరించి ఇన్నేళ్లుగా అధికారాన్ని అనుభవించిన మాల, మాదిగ కులాలే మాకంటే మాకు అన్యాయం జరిగిందని మాకే మొత్తం ఎస్‌సి రిజర్వుడు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని పోరాడుతుండడాన్ని చూస్తే విస్మయం కలుగకమానదు.

మళ్ళీ వీరే బహుజన రాజ్యం, సామాజిక న్యాయంకోసం పోరాడుతున్నమంటారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 2011 అధికారిక లెక్కల ప్రకారం 3,63,37, 160 కోట్లు. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 63,60,158 లక్షలు అంటే రాష్ట్ర జనాభాలో 17.50% ఉంది. దళిత జనాభాలో మాదిగలు 25,09,99 2 లక్షలు అంటే దళితుల్లో 39%, రాష్ట్ర జనాభాలో 6.9% ఉండగా, మాల కులస్తుల జనాభా 17,05,448 లక్షలు అంటే దళితుల్లో 27%, రాష్ట్ర జనాభాలో 4.6% ఉన్నారు. ఇక దళితుల్లో అత్యంత వెనుకబడ్డ కులాల (ఉప కులాలు) జనాభా 21,44,718 లక్షలు అనగా దళిత జనాభాలో వీరు 34 శాతం. రాష్ట్ర జనాభాలో 5.9% ఉన్నారు.

మరొక అన్యాయం ఏమిటంటే మాల, మాదిగలకు కుల ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ఇస్తే ఉప కులాలకు మాత్రం ఆర్‌డివో ద్వారా ఇస్తారు. దీని వల్ల ఉపకులాల ప్రజలు అధికారుల ఇబ్బందులకు తాళలేక లక్షలాది మంది ఉప కులాల ప్రజలు మాల, మాదిగ కులపత్రాలు పొందడంవల్ల ఈ రెండు కులాల జనాభా అధికారిక లెక్కల్లో పెరిగింది. కానీ వాస్తవ జనాభా వీరికంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే దళితుల్లో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక రాజకీయ అవకాశాల విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 ఎంపి స్థానాలు ఉంటే అందులో 7 ఎస్‌సి రిజర్వుడు కాగా, 294 ఎమ్మెల్యే స్థానాలలో 48 స్థానాలు ఎస్‌సిలకు కేటాయించబడ్డాయి.

1956 నుండి 2014 వరకు దళితులకు కేటాయించబడ్డ స్థానాలలో అధిక శాతం మాలలకు దక్కగా, ద్వితీయ స్థానం మాదిగలు దక్కించుకున్నారు. ఇక ఆనాటికి ఉప కులాల ఊసేలేదు. రాష్ట్ర విభజన తరువాత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలలో 19 ఎస్‌సి రిజర్వుడు కాగా, 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 3 స్థానాలు దళితులకు కేటాయించబడ్డాయి. ఈ మూడు స్థానాలలో అనేక దశాబ్దాలుగా పెద్దపల్లి నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందిన గుడిసెల వెంకటస్వామి కుటుంబం, నాగర్‌కర్నూల్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుండి మంద జగన్నాథం, కంటోన్మెంట్ సికింద్రాబాద్ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో కంటోన్మెంట్ స్థానం బదులు వరంగల్ పార్లమెంటు ఎస్‌సి నియోజవర్గం ఏర్పడింది. ఇక్కడ నుండి కూడా మాదిగలే ప్రాతినిధ్యం వహించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో ఎస్‌సి ఉపకులాల సంఖ్య నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్‌సి జనాభా అధికంగా ఉన్న అందులోను ఉప కులాల సంఖ్య అధికంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో మొదటిసారిగా ఎస్‌సి ఉపకులమైన నేతకానీ కులానికి చెందిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పార్లమెంట్ సభ్యునిగా అవకాశం లభించింది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఈ మూడు ఎస్‌సి రిజర్వ్ స్థానాల్లో సామాజిక న్యాయ ప్రకారంగా ఒక స్థానం మాదిగలకు, రెండవ స్థానం మాలలకు, మూడవ స్థానం ఉప కులాలకు దక్కాలి. కానీ మాల, మాదిగ కులాలకు చెందిన వారే మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని వాదులాడుకుంటూ మా ఎస్‌సి ఉప కులాలకు అవకాశం రాకుండా గొంతు నొక్కుతున్నారు. ఇక దళితులకు రిజర్వు చేయబడ్డ 19 అసెంబ్లీ స్థానాల లో పది స్థానాల్లో మాదిగలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగతా తొమ్మిది స్థానాలలో మాలలు అధికారాన్ని అనుభవిస్తున్నారు.

కానీ సామాజిక న్యాయం, జనాభా దమాషా ప్రకారం వెనుకబడ్డ దళిత ఉప కులాలకు ఆరు స్థానాలు దక్కాల్సి ఉండగా ఎక్కడా అవకాశమివ్వ లేదు. మాలల వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మిగతా వెనుకబడ్డ దళిత కులాల కోసం వర్గీకరణ చేయాలని మాదిగ దండోర పేరుతో ఒక వర్గం ఉద్యమిస్తుంటే, ఎస్‌సిలను వర్గీకరించొద్దని మాల మహానాడు పేరుతో మరొక వర్గం ఉద్యమాలు చేస్తూ ఈ రెండు కులాలు ప్రభుత్వాల ఆధిపత్యం చెలాయిస్తూ మిగతా 57 కులాలను ఎదగనివ్వకుండా అణచివేస్తున్నారు. సర్పం చ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఈ రెండు కులాలే దళితుల ప్రయోజనాలు అనుభవిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు దళితుల్లో వెనుకబడేయబడ్డ ఈ కులాల పేర్లు బయటకు తెలియకుండా, ఈ కులాల సమస్యలు పరిష్కరించకుండా, వీరికి మాదిగ ఉప కులాలు, మాల ఉప కులాలనే ముద్ర వేసి వీరందరి ప్రయోజనాలు రెండు కులాలే పొందుతుండడం అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈనాటి వరకు ఉప కులాలకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదు.

ఉమ్మడి ఎస్‌సి కార్పొరేషన్‌లో, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌లో కూడా కనీసం సభ్యులుగా కూడా దళితుల్లో 34% ఉన్న ఉప కులాలకు స్థానం లేదు.నామినేటెడ్ ఎంఎల్‌సి ఎంపి (రాజ్యసభ) స్థానాలు ఒక్కరికి కూడా దక్కలేదు. కనీసం ప్రభుత్వ పథకాలలో ఒక్క శాతం కూడా మా కులాలకు అందలేదు. కేవలం ఈ కులాలన్నీ ఓటు బ్యాంకుగానే మిగిలిపోయాయి.దళితుల్లోనే ఇంత వివక్ష, ఆధిపత్యం ఉంటే ఇక రిజర్వేషన్లు ఎవరి కోసమో ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి ఈ వివక్షను కొనసాగించకుండా వెనుకబడ్డ దళిత కులాల వృత్తులు, సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పరచాలి.

ఈ కులాలను ఉప కులాలుగా కాకుండా ఎంబిఎస్‌సి (most backward scheduled castes ) గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, నామినేటెడ్ ఎంఎల్‌సి, ఎంపి స్థానాలను కేటాయించాలి. ఈ కులాలకు శాశ్వత న్యాయం చేకూర్చుట కోసం ఎస్‌సి వర్గీకరణ చేపట్టి మాల మాదిగ కులాలతో సంబంధం లేకుండా ఈ కులాలన్నిటినీ ‘ఎ’ వర్గం లో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఈ కులాలు బాగుపడతాయి. రాష్ట్రంలో దళిత జనాభా 17 శాతం నుంచి 25 శాతానికి పెరిగిందని ఒక అంచన. దీని ప్రకారం మాదిగల జనాభా 6 నుంచి 9 శాతానికి, మాల కులస్థుల జనాభా 4 నుంచి 6 శాతానికి మిగతా 57 ఉపకులాల జనాభా జనాభా 6 నుంచి 10 శాతానికి పెరిగిందన్నది వాస్తవం.

కానీ మాదిగలే 12 శాతానికి పైగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పెరిగిన జనాభా అనుగుణంగా దళితుల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జనాభా దామాషా ప్రకారం మాల, మాదిగ, ఉప కులాలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన కులాలు రిజర్వుడు స్థానాలను వదిలి, ఇంత వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించని కులాలకు అవకాశం కల్పించి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయం జరుగుతుంది.

బైరి వెంకటేశం మోచి
9491994090

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News