Saturday, April 20, 2024

రాజస్థాన్‌కు కీలకం.. నేడు గుజరాత్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇరు జట్లు కూడా కిందటి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమనే చెప్పాలి. అయితే గుజరాత్‌తో పోల్చితే రాజస్థాన్‌కు ఇది కీలకమైన పోరు. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ 200కి పైగా భారీ స్కోరును సాధించినా ఓటమి పాలైంది. ముంబై ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ విధించిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు సవాల్‌గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్నా రాజస్థాన్‌కు కీలక మ్యాచుల్లో ఓటములు తప్పడం లేదు. లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు రాజస్థాన్‌కు కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది.

జోరుమీదున్న యశస్వి
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యశస్వి కళ్లు చెదిరే సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన యశస్వి విజృంభిస్తే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు ఖాయం. ఇక జోస్ బట్లర్ కూడా జోరుమీదున్నాడు. ఈ సీజన్‌లో యశస్వితో కలిసి జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఇటు యశస్వి అటు బట్లర్ చెలరేగితే గుజరాత్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు కెప్టెన్ సంజూ శాంసన్, దేవ్‌దుత్ పడిక్కల్, జేసన్ హోల్డర్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురేల్, అశ్విన్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరూ రాణించినా రాయల్స్‌కు భారీ స్కోరు సాధించడం కష్టం కాదు. ఇక బౌల్ట్, అశ్విన్, హోల్డర్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు కూడా గెలుపు అవకాశాలు అధికంగానే ఉన్నాయి.

ఫేవరెట్‌గా టైటాన్స్
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో గుజరాత్ అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో విజయం సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. అయితే ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ విధించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా గుజరాత్ ఛేదించలేక పోయింది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తోంది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, డేవిమ్ మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, మనోహర్ తదితరులతో బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, మిల్లర్‌లు సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. రషీద్ ఖాన్, షమి, జోషువా లిటిల్, నూర్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో గుజరాత్‌కే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News