Saturday, July 27, 2024

ఎపి హైకోర్టులో ఏబీ వెంకటేశ్వర రావుకు ఊరట

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపిఎస్ అధికారి, డిజి హోదాలో ఉన్న ఎబి వెంకటేశ్వరరావుకు ఎపి హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులు నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎబి వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎబివికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. టిడిపి హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఎబి వెంకటేశ్వరరావుకు వైసిపి హయాంలో పోస్టింగ్ దక్కలేదు.

మొదట ఆరు నెలలు ఆయన ఖాళీగా ఉన్నారు. తర్వాత ఆయనపై రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు. హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఎబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే గత ఐదేళ్ల కాలంలో ఆయన పధ్నాలుగు రోజులు మాత్రం పోస్టింగ్‌లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు కూడా దక్కలేదు. అయితే క్యాట్ ఆదేశించినా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. అధికారికంగా ఆయన ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్నారు.

పోస్టింగ్ ఇవ్వండి ..సిఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఎబివి
సచివాలయంలో సిఎస్ జవహర్ రెడ్డిని సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావు కలిశారు. ఎపి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని సిఎస్‌ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. సిఇఒ కార్యాలయంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఎబివి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News