ఐటీ కంపెనీల నుంచి సమిష్టిగా రూ.14,865 కోట్ల టర్నోవర్
ఎగుమతుల్లో దూసుకు వెళుతున్న తెలంగాణ
జిల్లాకో ఎక్స్ పోర్ట్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు
స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రణాళికలు
గత 6 సంవత్సరాలలో తెలంగాణలో 10,189 ఐటీ సంస్థలు
హైదరాబాద్‌లో విప్రో విస్తరణతో మరో 5000 మందికి ఉద్యోగాలు
గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్
5000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర అవసరం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు, ఐటీ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అననుకూల వాతావరణం వల్ల విసిగిపోయిన ఐటీ పరిశ్రమల యజమానులు తమ తదుపరి విస్తరణ కార్యక్రమాలకు హైదరాబాద్ అనువైనదిగా ఎంచుకుంటున్నారు.
ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఏ రాష్ట్రంలోనైనా ఎగుమతులు అధికంగా ఉంటేనే రాష్ట్ర ఆదాయం మెరుగవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల్లో దూసుకెళ్తోంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచలంచెలుగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఐటీ వ్యవస్థ వృద్థి పథంలో నడుస్తోంది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతుల విలువ రూ. 2.68 లక్షల కోట్లకు చేరింది. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ సెక్టార్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. అంతేకాక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.16 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఎగుమతి చేయడంతో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది.
జిల్లాలో ఎక్స్ పోర్ట్ హబ్ ఏర్పాటు : ఎగుమతులను కొనసాగించి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో ఎక్స్ పోర్ట్ హబ్ ఏర్పాటు చేసి స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాక ఆర్థిక ప్రగతిలో గ్రామీణ ప్రాంతాలూ బలోపేతం అవుతాయని ఆశిస్తోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్ లో 9.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
అత్యాధునిక వ్యవస్థలైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, విజూవల్ ఎఫెకట్స్, యానిమేషన్ తదితర రంగాలనూ ప్రోత్సహిస్తోంది. ఈ అత్యాధునిక రంగాల్లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలను భవిష్యత్తులో లక్ష వరకు తీసుకెళ్లాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరో వైపు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఏఐ సీటీ ఇప్పటికే రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలంగాణ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ లాంటి పలు పాలసీలనూ తీసుకొచ్చింది. అంతేకాక రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్టార్టప్ ఇంక్యూబేటర్లు, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తోంది.
ఆరేళ్లలో తెలంగాణలో 10,189 ఐటీ సంస్థలు : గత 6 సంవత్సరాలలో తెలంగాణలో 10,189 ఐటీ సంస్థలు తెరిచాయి. అయితే అదే కాలంలో 3,369 కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను నిలిపివేసాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ వృద్ధిలో ముందంజలో ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మరియు ఆపిల్ వంటి ప్రధాన ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఆతిథ్యం ఇస్తోంది. గత ఐదు సంవత్సరాలలో ఈ ఐటీ కంపెనీలు సమిష్టిగా రూ.14,865 కోట్ల టర్నోవర్‌కు దోహదపడ్డాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ సెజ్ వంటి ప్రాంతాలలో గణనీయమైన ఐటి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. హైదరాబాద్ దాటి, తెలంగాణ తన ఐటీ పాదముద్రను వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి టైర్-2 నగరాలకు విస్తరించింది. భారతదేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, ఉపాధికి తెలంగాణ ఐటీ రంగం గణనీయంగా దోహదపడుతోంది. ఇది భారతదేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 31 శాతం వాటా కలిగి ఉంది. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో 9 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించింది.
హైదరాబాద్‌లో విప్రో విస్తరణ : విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా ఉంది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుందన్నారు. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తి కానుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర అవసరం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర అవసరమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ సాంకేతికంగా, వాణిజ్య, వ్యాపార పరంగానే కాకుండా ప్రజల జీవన నైపుణ్యాలను సైతం పెంపొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మంచి పనులు గత ప్రభుత్వాలు చేస్తే దానికి రెట్టింపుతో మంచి చేసేందుకు ఆలోచన చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ అని ప్రస్తావించిందని, అయినా దానికి తగ్గట్టుగా అడుగులు వేయలేదన్నారు.
ఫోర్త్‌సిటీ అభివృద్ధి దిశగా:గత ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో, రాజకీయాలలోకి పోకుండా ఆస్తుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పన్నుల విషయంలో మినహాయింపులు, మూసీనది పక్కన వేలంలో కొన్న స్థలాల విషయాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నాణ్యమైన నిర్మాణం జరిగితే దానికి తగ్గట్లుగా ధరలు ఉండాలని పేర్కొన్నారు. ఫోర్త్‌సిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.