Friday, April 19, 2024

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

- Advertisement -
- Advertisement -

 Bathukamma

 

తెలంగాణ ప్రజల బతుకు పండుగ అయిన ’బతుకమ్మ’ను పూల రూపంలో ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే మొదటి మూడురోజుల పండుగలైన ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ముగిశాయి.

బతుకమ్మ పండుగలో నాలుగోరోజైన ఈరోజు ‘నానబియ్యం బతుకమ్మ’గా బతుకమ్మను కొలుస్తారు. తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. బతుకమ్మను నీళ్లలోకి సాగనంపే ముందు గౌరమ్మగా భావిస్తూ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటలో అలిసి పోయిన వారికి శక్తి, ఆనందం ఇచ్చేందుకు రుచితో పాటు బలానికీ ఉపయోగపడేలా ఈ ప్రసాదాలను తయారుచేసి పంచుతారు.

సాయంకాలం మహిళలంతా కొత్త బట్టలు కట్టుకుని ఆభరణాలు ధరించి బతుకమ్మ ల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా బంగారు బతుకమ్మ ఉయ్యాలా అని రక రకాల పాటలు పాడుతూ చివరిన బతుకమ్మను చెరువులో విడుస్తారు.

 Bathukamma

 

ఉత్సాహాన్ని కలిగించే బంతి

బతుకమ్మగా పేర్చే ప్రతి పుష్పానికీ ప్రాధాన్యత ఉంది. బతుకమ్మలో ఎన్ని రకాల పూలను పేర్చినా కొట్టొచ్చినట్లు కనిపించేవి బంతిపూలే. బంతిపూలు కళ్ల కలకలు, చర్మ సంబంధ వ్యాధులను దరిచేరనీయవు. కడుపులోని నులి పురుగుల వ్యాధి నివారణకు బంతి పూవు మంచి మందు. జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగించి ఉత్సాహంగా ఉండేలా చేస్తుందీ పుష్పం.

Bathukamma

 

నాన బియ్యం బతుకమ్మ

నాన బెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా చేస్తారు.

బతుకమ్మ పాట

చిత్తు చిత్తుల బొమ్మ ..

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
రాగ బిందె తీసుక రమణి నీళ్లకు పోతే
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే
వెంకటేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
బంగారు బిందె తీసుక భామ నీళ్లకు పోతే
భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
పసిడి బిందె తీసుకు పడతి నీళ్లకు పోతే
పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే
ముద్దుకృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

It is great Tradition to Worship Bathukamma with Flowers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News