Sunday, December 3, 2023

జానారెడ్డి కుమారుడి నివాసంలో ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఐటి దాడులపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. గురువారం ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు కెఎల్‌ఆర్, బడంగ్‌పేట మేయర్ పారిజాత ఇళ్లలో సోదాలు నిర్వహించగా, శుక్రవారం మాజీ మంత్రి జానారెడ్డి, రఘువీర్ నివాసాల్లో ఐటీ సోదాలు చేపడుతున్నారు. బృందాలుగా విడిపోయిన ఐటి అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంట ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి వరకు తుక్కుగూడలో మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కెఎల్‌ఆర్) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. శుక్ర వారం ఉదయం మరోసారి సోదాలు చేపట్టారు. నార్సింగ్‌లోని ఇంటితో పాటు మాదాపూర్‌లోని కెఎల్‌ఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో తనిఖీలు నిర్వహిం చారు. బడంగ్ పేట్ మేయర్ పారిజాత ఇంట గురువారం అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. గురువారం ఉదయం ఐటి దాడులు ప్రారంభించే సమయానికి ఆమె తిరుపతిలో భర్త నరసింహ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. పారిజాత నివాసం నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడా ఐటి శాఖ సోదాలు నిర్వహించారు. చిగురింత పారిజాత ను ఐటీ అధికారులు గురువారం తిరుపతిలో అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి రెడ్డిభవన్‌కు వచ్చిన ఆమెను గురువారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న కక్షతోనే తమ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేశారని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News