Friday, July 19, 2024

కశ్మీర్‌లో ఎన్నికలు?

- Advertisement -
- Advertisement -

2018 డిసెంబర్ నుంచి రాష్ట్రపతి పాలనలో మగ్గుతున్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిపించడానికి సిద్ధంగా వున్నామని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేయడం ఒక మంచి పరిణామం. ఎన్నికల నిర్వహణ ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల పరిధిలోనిదేనని కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దేశ అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి (రాజ్యాంగ అధికరణ 370) రద్దు చర్యపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని విన్నవించింది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని కూడా కేంద్రం తెలియజేసింది. రాష్ట్ర హోదాను తిరిగి ఇవ్వకుండానే ఎన్నికలు జరిపించదలచినట్టు దీనిని బట్టి అర్థమవుతున్నది.

అలాగే పంచాయత్, మునిసిపల్ ఎన్నికలు పూర్తి చేసిన పిమ్మటనే శాసన సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కూడా బోధపడుతున్నది. అన్ని రకాలుగా కేంద్ర పాలక పక్షం బిజెపికి కలిసి వచ్చేటట్టయితే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చు. కశ్మీర్‌లో నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణను కూడా బిజెపికి అనుకూలంగా జరిపించారు. మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా అక్కడ ప్రవేశపెట్టినందున ముందుగా ఆ ఎన్నికలు జరిపించి తీరాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మూడంచెల్లో ఒకటి అయిన జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ళకు ఇంతకు ముందే ఎన్నికలు జరిగిపోయాయి.

ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి గుప్కార్ డిక్లరేషన్ పార్టీల అలయెన్స్ 110 స్థానాలను, ఒక్క బిజెపి 75 స్థానాలను గెలుచుకొన్నాయి. అప్పటి వరకు ప్రతిపక్షంలో భాగంగా వుండిన మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకొన్నారు. 2019 లో బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370ని, రాష్ట్ర హోదాను కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. సరిహద్దులకు ఆవలి నుంచి అంటే పాకిస్థాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదుల బెడదను తొలగించడానికే ఈ చర్యలు తీసుకొన్నట్టు బిజెపి చెప్పుకొన్నది.

కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి దానిని మిగతా రాష్ట్రాల మాదిరిగానే మార్చి భారత భూభాగంలో పూర్తిగా విలీనం చేయాలన్న బిజెపి విధానానికి అనుగుణంగా ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. దీని వల్ల అక్కడ మానవ హక్కుల హననం అదే పనిగా సాగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఆర్టికల్ 370పై విచారణ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అత్యంత ముఖ్యమైనదని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలియజేయడం గమనించవలసిన విషయం. ఇది మన జాతి మనుగడలో భాగమని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. అలాగే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను కల్పించవలసిన అవసరాన్ని నొక్కి పలికింది. కేంద్ర పాలిత ప్రాంతంగా దానిని ఎల్లకాలం కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ప్రధాని మోడీ పాలనలో దేశంలో మానవ హక్కులకు, ప్రజాస్వామ్య సత్సంప్రదాయాలకు వాటిల్లుతున్న ముప్పు గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. మణిపూర్‌లో మెజారిటీ మెయితీల నిరంకుశత్వాన్ని నెలకొల్పడానికి మైనారిటీలైన గిరిజన కుకీ తెగపై జరుగుతున్న దాడి తెలిసిందే. కేంద్రంలోనూ, మణిపూర్‌లో కూడా బిజెపి ప్రభుత్వం వున్నప్పటికీ నాలుగు నెలలుగా అక్కడ జాతుల ఘర్షణ నిర్విరామంగా కొనసాగుతున్నది. అలాగే దేశ వ్యాప్తంగా మైనారిటీలను అణచివేసి, సెక్యులర్ ఇండియాకు శాశ్వతంగా తెర దించి, మెజారిటీ పాలనను నెలకొల్పే యత్నాలు సాగుతున్నాయి.

ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిపోతున్నట్టు భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. తనకు అమితంగా లాభాలు తెచ్చిపెట్టే వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే అమెరికా మొక్కుబడిగా మానవ హక్కులను గురించి, ప్రజాస్వామిక స్వేచ్ఛల గురించి కూడా మాట్లాడుతుంది. న్యూఢిల్లీ జి 20 శిఖరాగ్ర సదస్సు ముగించుకొని తిరుగు ముఖం పట్టిన ప్రెసిడెంట్ బైడెన్ మార్గమధ్యంలో వియత్నాంలో మీడియాతో మాట్లాడుతూ మానవ హక్కులను గౌరవించడం ఎంత ముఖ్యమో భారత ప్రధానితో తాను ప్రస్తావించానని ప్రముఖంగా పేర్కొన్నారు.

బలమైన సంపన్న దేశాన్ని నిర్మించడంలో పౌర సమాజం, పత్రికా స్వేచ్ఛ కీలక పాత్ర పోషిస్తాయని కూడా తాను ప్రధాని మోడీకి వివరించినట్టు వెల్లడించారు. మరి ఆయన ఇండియాలో వుండగా మీడియాను సమావేశపరిచి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారో అర్థం కాని అంశం. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సెక్యులర్ ఇండియాకు శాశ్వతంగా తెర దించే దుస్సాహసానికి స్వస్తి చెప్పడం దేశ ప్రజల హితానికి ఎంతైనా దోహదం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News