Sunday, April 28, 2024

ఆసియాకప్‌ సూపర్-4: లంకపై భారత్ గెలుపు..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (6), కరుణరత్నె (2) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మెండిస్ (15) కూడా నిరాశ పరిచాడు. దీంతో లంక 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

అయితే చరిత్ అసలంక(22), సమరవిక్రమ(17), ధనంజయ డిసిల్వా (41) కాస్త రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దునిత్ వెల్లలాగే ఆల్‌రౌండ్‌షోతో రాణించాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన దునిత్ బ్యాట్‌తోనూ మెరిశాడు. ఒంటరి పోరాటం చేసిన దునిత్ 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. దునిత్ వల్లలాగే ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు. అసలంక కూడా నాలుగు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(53) టాప్ స్కారర్‌గా నిలిచాడు. మిగతా వారిలో ఇషాన్(33), రాహుల్(39), అక్షర్ పటేల్(26) రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News