Monday, April 29, 2024

నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు : జో బైడెన్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆయన మరణం తనను ఆశ్చర్య పర్చలేదు కానీ ఆ వార్త విన్న తరవాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని పేర్కొన్నారు. “ పుతిన్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా గళం వినిపించారు. ఆయన మృతికి పుతినే బాధ్యుడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు. ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్ కాలనీలో నావల్నీ మృతి చెందారు. రెండు నెలల క్రితమే జైలు అధికారులు ఆయనను అక్కడకు తరలించడం గమనార్హం. ఇదిలా ఉండగా నావల్నీ మరణం పుతిన్‌కు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్నేళ్ల క్రితమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. 2021లో జెనీవాలో జరిగిన బైడెన్ పుతిన్ భేటీ తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసే బరితెగింపు : కెనడా ప్రధాని ట్రూడో
స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసేందుకు రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ఈ సంఘటన తెలియజేస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు పుతిన్ అంటే ఏమిటో ఇది గుర్తు చేస్తుందన్నారు.
పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరు : నావల్నీ సతీమణి
నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నయా అనుమానం వ్యక్తం చేశారు. అవే గనుక నిజమైతే , పుతిన్, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పుతిన్ ప్రభుత్వాన్ని నమ్మలేమని, వారెప్పుడూ అవాస్తవాలే చెబుతారని వ్యాఖ్యానించారు. వారు చెప్పింది నిజమైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి , పుతిన్, ఆయన పరివారం బాధ్యత వహించాలని, ఆరోజు త్వరలోనే వస్తుందని ఆమె గద్గత స్వరంతో హెచ్చరించారు. రష్యాలో ప్రస్తుతం సాగుతున్న భయంకర పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని “మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌” వేదికగా పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News