Thursday, September 4, 2025

పాత్రికేయ పోరాట వీరుడు వరదరాజులు నాయుడు

- Advertisement -
- Advertisement -

అది 1932 సెప్టెంబర్ 5. ఆ రోజు మదరాసు నుండి 12 పేజీలతో డమ్మీ సైజులో ఒక కొత్త ఆంగ్ల దినపత్రిక వెలువడింది. విలక్షణమైన దృష్టితో ఆకర్షించి, సమగ్రమైన దినపత్రిక అది. ఈ దినపత్రికలో 3, 4 పేజీలు జాతీయ దృక్పథంతో అందించబడిన ప్రాంతీయ వార్తలు ఆక్రమించాయి. ఐదవ పేజీ ఆర్థిక, వాణిజ్య విషయాల వార్తలకూ, ఏడు, ఎనిమిది పేజీలు దేశ, విదేశ వార్తలకూ కేటాయించబడ్డాయి. పదవ పేజీ క్రీడా వార్తలకూ, 1, 2, 11 పేజీలు ప్రకటనలకు నిర్దేశించబడ్డాయి. ఆరవ పేజీ సంపాదకీయం, సంపాదకీయ వ్యాఖ్య వగైరాలకు ప్రత్యేకం ఆ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్! పత్రిక పేరులో ఉండే ఎగురుతున్న పతాకం, కరవాలాలు స్వాతంత్య్ర కాంక్షకూ, పోరాట శీలానికీ ప్రతీకలు. ఆ పత్రికను ప్రారంభించిన ఘనుడు డా॥ పి. వరదరాజులు నాయుడు! అప్పటికి ఆయనకు ప్రపంచ మిత్రన్’, ‘తమిళనాడు’ అనే తమిళ దిన పత్రికలూ, ‘ఆంధ్రప్రజ’ అనే తెలుగు పత్రికను నిర్వహించిన అనుభవం ఉంది.

రెండు నెలలకు మించి ఈ ఇంగ్లీషు దినపత్రిక కొనసాగించలేకపోయినా ఈ పత్రిక దక్షిణాది ఇంగ్లీషు జర్నలిజానికి వేసిన దారులు మహా గొప్పవి. తెలుగు ప్రాంతాలల్లో చరిత్ర సృష్టించిన మహానుభావులను మరచిపోతున్న వేళ సేలం, కోయంబత్తూరు ప్రాంతాల్లో నుంచి వచ్చిన కులాలకు అతీతంగా, సమాజ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసిన తెలుగు వ్యక్తిని ఎవరు స్మరించుకుంటారు? తమకు తెలియదని తెలుగువారూ, తమ భాషవాడు కాదని తమిళులూ- ఇలాంటి విశిష్టమైన వ్యక్తిని మరచిపోయే అవకాశం చాలా ఉంది. మహాత్మాగాంధీ, వీరసావర్కర్, రాజాజీ, కట్టమంచి రామలింగారెడ్డి, అంబేద్కర్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, రామస్వామి నాయకర్ వంటి హేమాహేమీలతో మిత్రత్వం, అవసరమైనచోట విభేదాలు గల మేధావి డా॥ పి. వరదరాజులు నాయుడు. 1887 జూన్ 4వ తేదీన సేలం దగ్గర ఉండే రాశిపురంలో పెరుమాళ్నాయుడు, కుప్పమ్మ దంపతులకు వరదరాజులు నాయుడు జన్మించాడు.

కృష్ణదేవరాయలు ఆదేశంతో తండ్రి మీద మధురకు దండెత్తి విజయం సాధించిన విశ్వనాథ నాయకుడి సైన్యంలో పనిచేసిన వారు వీరి పూర్వీకులు, బలిజ నాయుళ్ళ తెగకు చెందిన వీరు తొలుత తంజావూరులోనూ, పిమ్మట తిరుమలనాయకుని కాలం లో సేలం ప్రాంతంలో స్థిరపడ్డారు. ఏడేళ్ళ వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన వరదరాజులును మేనత్త, నాన్నమ్మలు పెంచారు. కోయంబత్తూరు లండన్ మిషన్ హైస్కూలులో మొదలైన వీరి చదువు చురుకుగా సాగి, బెంగాల్ విభజన సంఘటనతో ఆగిపోయింది. స్వదేశీ ఉద్యమం వైపు ఆకర్షితులై, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అతివాదులవైపు ఆకర్షితులై 1908లో పాండిచ్చేరిలో సుబ్రహ్మణ్య భారతి ముందు స్వరాజ్య పోరాటం చేశారు. ఇలా మొదలైన ప్రజాజీవితం సుమారు అరశతాబ్దం సాగింది.

వీరు పాల్గొనకుండా ఏ ప్రధాన ఉద్యమం మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో జరగలేదని అనడం అతిశయోక్తి కాదు. 1906- 07 ప్రాంతంలో కోయంబత్తూరు దగ్గర ఉండే ఉడుములపేటలో వరదరాజులు మద్రాసు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ప్రారంభించి అక్కడ ఒక పఠన మందిరాన్ని, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 1908లో మద్రాసులోని బర్మా మెడికల్ స్కూలులో భారతీయ వైద్యం గురించి అభ్యసించి, పిమ్మట కలకత్తాలోని దేశీయ వైద్య సంస్థలో స్థానిక వైద్య విధానాల గురించి నైపుణ్యం గడించాడు. తర్వాత తిరిగి వచ్చి కోయంబత్తూరు జిల్లా తిరుప్పూరులో వైద్యాన్ని ప్రారంభించారు. ఆయన వైద్యం ఎంత బాగా సాగేదంటే అప్పట్లోనే నెలకు రెండు వేల రూపాయలు సులువుగా సంపాదించేవారట. పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరి రుగ్మతలను నయం చేసే ‘మిన్సర రసం’ బహుళ ప్రసిద్ధి చెందింది. ఇది వారి కృషే, వేదాలు, భారత రామాయణాలు బాగా అధ్యయనం చేసిన వరదరాజులు మంచి వక్త.

చక్కని పత్రికా రచయిత. వీరు ప్రసంగిస్తే పదివేలకు మించి జనం వచ్చేవారట. 1911లో రుక్మిణమ్మతో వీరి వివాహం జరిగింది. మహిళల కోసం ఉద్యమించిన భర్త జైలుకెళ్లినపుడు ఉద్యమాన్ని నడిపారు ఈ మహిళామణి. బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వివక్షకు వ్యతిరేకంగా పనిచేసి ఫలితం సాధించిన వరదరాజులు 1935 అక్టోబరు 22న అంబేద్కర్‌తో విభేదిస్తూ, తన వాదనను వివరించి ఆయనను సమ్మతింపచేసిన సంఘటన విశేషమైనది. తెలుగు మాతృభాష అయినా తమిళం, ఇంగ్లీషు భాషలలో వరదరాజులుకి గల పట్టు గొప్పది. తమిళ, ఇంగ్లీషు జర్నలిజం రంగాలలో స్వదేశీ మిత్రన్, హిందూ పత్రికలను నిర్వహించిన జి. సుబ్రమణ్య అయ్యర్ సరసన నిలబడిన పాత్రికేయ సంపాదకుడు వరదరాజులు, 1916లో ‘ప్రపంచ మిత్రన్’ పత్రిక ప్రారంభించి, బ్రిటిష్ రాజ్యాన్ని దుయ్యబట్టి, వెయ్యి రూపాయల జరిమానా ఎదుర్కొన్న వ్యక్తి కూడా ఈయన. బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిడితో ఈ పత్రికను ఆపివేశారు.

1919లో ‘తమిళనాడు’ పేరున మరో తమిళ దినపత్రికను కొంతకాలం నడిపారు. ‘ఆంధ్రప్రజ’ పేరున ఒక తెలుగు పత్రికను కూడా డా॥ పి. వరదరాజులు నాయుడు నిర్వహించారు. అయితే ఆ తెలుగు ప్రతులు కానీ, వివరాలు కానీ అందుబాటులో లేవు. అప్పట్లో దినపత్రికలు సాయంకాలం వెలువడేవి. వీటికి భిన్నంగా ఉదయం పూట దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ను వెలువరించిన వ్యక్తి వరదరాజులు. ఆర్. వెంకటరాజులు నాయుడు ప్రచురణ కర్తగా, ఏ. రామశేష అయ్యర్ సంయుక్త సంపాదకుడుగా వరదరాజులు నాయుడు వెలువరించిన పత్రిక ప్రారంభ కాలంలో వెల ఒక అణా! అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాని మునుస్వామినాయుడుతో సహా పి. సుబ్బరాయన్, కె.ఎమ్. పణిక్కర్, కె. నటరాజన్, రాజాజీ, కె. విజయ రాఘవాచార్ గార్ల శుభాకాంక్షలతో తొలిరోజు ప్రతిలో అభినందన ప్రకటనలు రెండు పేజీలు (తొమ్మిది, పది పేజీలు) వెలువడడం వారి పలుకుబడికి చిహ్నం.జర్నలిజంలో ప్రకటనల ప్రాధాన్యత తొలుత గుర్తించిన వ్యక్తి వరదరాజులు నాయుడు.

1930లో పత్రికలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం తెస్తే, దీన్ని ఖండిస్తూ ఉద్యమం నడిపిన పాత్రికేయ పోరాటవీరుడు వరదరాజుల నాయుడు. డా॥ టి.ఎన్. నాయర్, పి. త్యాగరాయ శెట్టిగార్ల సౌత్ ఇండియన్ లిబరేషన్ అసోసియేషన్, అనిబిసెంట్ హెూమూల్ ఉద్యమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పక్షం చేరారు వరదరాజులు. ఈ ఉద్దేశ సాధన కోసం జర్నలిజంలో ప్రవేశించారు. రాజాజీ మంత్రివర్గంలో పని చేసిన వరదరాజులు నాయుడు 1957 జులై 23న గతించారు. 1944 నవంబర్ 14న ప్రఖ్యాత సంపాదకులు కుందుర్తి ఈశ్వరదత్ జైపూర్ నుంచి డా॥ పి. వరదరాజులు నాయుడికి ఉత్తరం రాశాడు. అందులో ఢిల్లీనుంచి పత్రిక నడపాలనే వరదరాజులు కోరికను ప్రస్తావిస్తూ, అది తలకు మించిన భారం కాగలదని హెచ్చరించారు. జాతీయవాదం, సంఘ సంస్కరణ, కార్మిక సంక్షేమం వంటి లక్ష్యాలతో చివరికంటూ పనిచేసిన వరదరాజులు నాయుడు ఇంట్లో అందరూ తెలుగునే మాట్లాడాలని గట్టిగా కోరేవారట. ఈ విషయాలను ఇష్టంగా ఆయన వారసులు చెప్పుకుంటారు. డా॥ పి. వరదరాజులు నాయుడి గురించి తెలుగువారికి మరిన్ని విషయాలు తెలియాలి!

Also Read : హరీశ్, సంతోష్ జలగలు

  • డా. నాగసూరి వేణుగోపాల్
    94407 32392
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News