ముర్షిదాబాద్ అల్లర్లపై న్యాయ విచారణ
సిపిఐ (ఎం) డిమాండ్
‘హింసాకాండ’లో టిఎంసి, బిజెపి ‘కుమ్మక్కు’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో ఇటీవలి మత కల్లోలాలపై న్యాయ విచారణ నిర్వహించాలని సిపిఐ (ఎం) కోరింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార టిఎంసి, ప్రతిపక్ష బిజెపి హింసాకాండ జరిపించేందుకు కుమ్మక్కు అయ్యాయని పార్టీ ఆరోపించింది. కోల్‌కతాలో బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సిపిఐ (ఎం) అనుబంధ సంస్థల మెగా ర్యాలీని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మొహమ్మద్ సలీమ్ ప్రసంగిస్తూ, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, అవినీతి వంటి తీవ్ర సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆ రెండు పార్టీలు ‘పోటీ మతతత్వం’లో నిమగ్నమయ్యాయని ఆరోపించారు.
‘వాస్తవాన్ని వెలుగులోకి తేవడానికి ముర్షిదాబాద్ అల్లర్లపై న్యాయ విచారణను కోరుతున్నాం. టిఎంసి, బిజెపి పోటాపోటీగా మతతత్వం ప్రచారంలో నిమగ్నమయ్యాయి. సామాన్య ప్రజలను వేధిస్తున్న సిసలైన సమస్యలసపై నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్దేశపూర్వక ఎత్తుగడే తప్ప మరేమీ కాదు’ అని సలీమ్ అన్నార. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం గురించి సలీమ్ ప్రస్తావిస్తూ, బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అది ప్రజలకు నమ్మకద్రోహం చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘ఆ చట్టాన్ని (వక్ఫ్ సవరణ చట్టాన్ని) దేశవ్యాప్తంగా సవరించారు. దానిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. కానీ అల్లర్లు ముర్షిదాబాద్‌లో మినహా మరి ఎక్కడా జరగలేదు. అది తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. 2026 ఎన్నికలకు ముందు వోటర్లను మతపరంగా విభజించేందుకు బిజెపి, టిఎంసి ‘పరస్పరం సాయంచేసుకుంటున్నాయి’ అని సలీమ్ ఆరోపించారు.