Monday, June 17, 2024

శ్రీధర్ రెడ్డి హత్యపై సిబిఐ లేదా జ్యుడీషియల్ విచారణకు సిద్దం:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గురువారం జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య కేసుపై సిబిఐ లేదా జ్యుడీషియల్ విచారణకు తాను సిద్దమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హత్యలను రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంతోనే తగాదాలు ఉన్నాయని, హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారన్నారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి ఈ ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ప్రవీణ్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జూపల్లి మాట్లాడుతూ తాను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనపై కక్ష గట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాని, అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

‘శ్రీధర్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని, అతడి వల్ల ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు బాధపడ్డాయని తెలిపారు. మృతుడి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న మంత్రి జూపల్లి ఈ హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. గతంలో తమ కార్యకర్తలు చనిపోతే తాను ఇలా ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో రెండు హత్యలపై వాస్తవాలు ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు. కెటిఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్మీపల్లికి రావాలని జూపల్లి సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ పార్టీ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, తనను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు వాళ్లను అధికారంలో నుంచి బర్తరఫ్ చేశారని జూపల్లి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అంశాలు లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేటీఆర్ ఓ యువరాజు అని, మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్‌ఎస్‌పి ఇప్పుడు కెసిఆర్ పంచన చేరారని ధ్వజమెత్తారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో భూముల వివాదం ఉందని, అన్నదమ్ముల పంచాయతీకి తనకేం సంబంధం లేదని మంత్రి జూపల్లి ఖండించారు. ఎఫ్‌ఐఆర్ కాపీలను ఆర్‌ఎస్‌పి, కెటిఆర్‌కు పంపిస్తానని అన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అని ఆయన గట్టిగా నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News