Wednesday, April 24, 2024

కమలం ఖేల్ ఖతం

- Advertisement -
- Advertisement -

కర్నాకట ఎన్నికల్లో ఘోర పరాజయం

136 స్థానాలతో కాంగ్రెస్ అధికారం కైవసం
పని చేయని మోడీ మంత్రం
65స్థానాలకే బిజెపి పరిమితం
స్పీకర్ సహా 14మంది మంత్రులు ఓటమి
31స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి
ఫలించిన కాంగ్రెస్ ‘పంచ’తంత్రం
నేడు కాంగ్రెస్ శాసనసభపక్షం భేటీ

బెంగళూరు: యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. హంగ్ అసెంబ్లీకే అవకాశముందంటూ ఎగిట్ పోల్స్ అంచనాలను తల్లకిందులు చేస్తూ తిరుగులేని ఆధిక్యతతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాల్లో అధికారానికి అవసరమైన 113 స్థానాలను మించి ఏకంగా 136 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ఎవరి మద్దతూ అక్కర లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో నిలిచింది. పార్టీ ముఖ్యనేతలు సిద్ధరామయ్య, డికె కుమారస్వామి సహా పలువురు నేతలు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ జోరు ముందు కమలదళం చతికిల పడిపోయింది. రెండో సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆశలు కలగానే మిగిలిపోయాయి.

క్రితం ఎన్నికల్లో సాధించిన స్థానాల్లో దాదాపు 40స్థానాలు కోల్పోయి కేవలం 64సీట్లకు పరిమితమైంది. అదే దారిలో కింగ్ మేకర్‌గా కాదు కింగ్‌గానే నిలుస్తామన్న ధీమాతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని జెడి(ఎస్) సైతం గతంలో ఉన్న స్థానాల్లో దాదాపు సగం సీట్లు కోల్పయి కేవలం 19 సీట్లకే పరిమితమైంది. కాగా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరులో భేటీ కానుంది. ముఖ్యమంత్రి పదవికోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు, బలమైన ఒక్కలిగ వర్గం నేత డికె శివకుమార్ పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. అయితే సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని, ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉండే అవకాశముందని పార్టీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

పని చేయని మత రాజకీయం
మతతత్వ రాజకీయ ప్రచారం, కేవలం కొన్నిసామాజిక వర్గాలపైనే ఆధారపడడం, అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం, ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదపడం వంటివి అధికార బిజెపి ఘోర పరాజయానికి ముఖ్య కారణాలని చెప్పవచ్చు. ప్రచారం చివర్లో మోడీ, షా, యోగి త్రయం ఎంతగా ప్రచారం చేసినా అప్పటికే బొమ్మై ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయానికి వచ్చేసిన కర్నాటక ఓటర్ల మసును అవేవీ మార్చలేక పోయాయి. వాస్తవానికి కర్నాటకలో గత కొంతకాలంగా బిజెపి ఏదో ఒక మత వివాదాన్ని లేవనెత్త్తుతూనే వస్తోంది. హిజాబ్, హలాల్, అజాన్‌తో పాటుగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత బజరంగ్ దళ్ అంశాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకొంది. మరో వైపు ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది.

అయితే ఈ అంశాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినప్పటికీ కర్నాటకలో మాత్రం బిజెపికి కలిసి రాలేదు. హిందుత్వ కార్డు ఇతర రాష్ట్రాల్లో బిజెపికి కలిసి వచ్చింది కానీ కర్నాటకలో ఏ మాత్రం పని చేయలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరో వైపు కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రం అయిన రాష్ట్రప్రభుత్వ అవినీతి సామాన్య ఓటర్లలో బలంగా నాటుకుంది. ‘40శాతం అవినీతి సర్కార్’ అంటూ హస్తం పార్టీ చేసిన ప్రచారం బాగా పని చేసింది. దీనికి తోడు కమలం పార్టీకి బలమైన మద్దతు వర్గంగా ఉండిన లింగాయత్‌లు ఆ పార్టీకి దూరం కావడం, కొత్త వాళ్లకు టికెట్లు ఇవ్వడం, మధ్యలో ముఖ్యమంత్రిని మార్చడం లాంటి గుజరాత్ ఫార్ములాను రాష్ట్రంలో కూడా అమలు చేయడం లాంటివన్నీ కూడా ఆ పార్టీ ఓటమికి కారణాలుగా మారాయి.

మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులున్నప్పటికీ అందరు కూడా పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేయడం ఆ పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడింది. అందుకే ఎవరూ ఊహించని విధంగా గత 36 ఏళ్లలో ఏ పార్టీకి దక్కనంత భారీ విజయాన్ని ఆ పార్టీ దక్కించుకోగలిగింది. ఒక్క కర్నాటక కోస్తాప్రాంతం మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోను కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. జెడి(ఎస్)కు కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంతో పాటుగా బిజెపికి గట్టి పట్టున్న బెంగళూరు నగర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు దీటుగా సీట్లు దక్కించుకోగలిగింది. ఈ జోరులో జెడి(ఎస్)కు తిరుగులేని ఎదురు దెబ్బలు తగిలాయి. కుమారస్వామి కుమారుడు సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పరాజయం పాలయ్యారు. ఫలితంగా ఆ పార్టీ బలం క్రితం ఎన్నికలతో పోలిస్తే సగానికి పడిపోయింది.

గాలి పార్టీకి ఎదురు గాలి
మరో వైపు బళ్లారి మైనింగ్ కింగ్ గాలిజనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేయడం కూడా బిజెపి బలం తగ్గడానికి కొంత కారణమయింది. రాష్ట్రంలో మొత్త 48 స్థానాల్లో ఆయన పార్టీ ‘కళ్యాణరాజ్య ప్రగతి పక్ష’ అభ్యర్థులను నిలబెట్టగా గంగావతిలో జనార్ధన్ రెడ్డి తప్ప మిగతా ఎవరూ గెలవలేదు. చివరికి బళ్లారి సిటీలో ఆయన సతీమణి లక్ష్మీ అరుణ సైతం ఓటమి పాలయ్యారు. విశేషమేమిటంటే ఆ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరోవైపు బిజెపి అభ్యర్థులు 31 స్థానాల్లో, జెడి(ఎస్) అభ్యర్థులు 139 స్థానా ల్లో, ఆప్ అభ్యర్థులు 209 చోట్ల డిపాజిట్లు కోల్పోయారు.

ప్రధాని అభినందనలు
కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బిజెపి కోసం కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.‘ కర్నాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో తాము కర్నాటకకు మరింత దృఢదీక్షతో సేవచేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News