Wednesday, December 4, 2024

తెలంగాణ చరిత్రకు వీరోచిత సంతకం

- Advertisement -
- Advertisement -

‘తెలంగాణ’ ఉమ్మడి రాష్ట్రంలో హద్దు నుండి సరిహద్దు వరకు నిలువు దోపిడీ, అనునిత్యం అవమానం, అణచివేతకు గురికాబడిన ప్రాంతం, తన తనువంతా పౌరుషం కలిగి ఉన్న ప్రాంతం. ఆది నుండి అంతం వరకు 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, ఒడిదుడుకులను తట్టుకుని ఆంధ్రా పెత్తందారి పాలకులను ఎదిరించి, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెగనరికి అఖండ భారత దేశంలో తన ఉనికిని చాటుకున్నది మన తెలంగాణ తల్లి. తన తల్లికి విముక్తిని కల్పించే గొప్ప పోరులో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన బిడ్డలెందరో. తమ సర్వస్వాన్ని ఉద్యమానికి అంకితం చేసిన మహానుభావులెందరో.

తెలంగాణ కోసం తమ శాసనసభ సభ్యత్వాలకు అనేక మార్లు రాజీనామా చేసిన తెలంగాణ వాదులు ఒకవైపు ఉండగా, మరోవైపు పదవులపై ఆశతో రాజీనామాల పర్వం నుండి పారిపోయి ఆంధ్ర పాలకుల చెంతన చేరిన తెలంగాణ ద్రోహులను కూడా చూసింది ఈ విముక్తి ఉద్యమం. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని తమ రాజకీయ పార్టీల మనుగడకు, వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న వ్యక్తులను సైతం మోసింది మన ఉద్యమం. అట్లాంటి ఉద్యమాన్ని తన ఆమరణ దీక్షతో మలుపు తిప్పిన నాయకుడు కేసిఆర్. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మన తెలంగాణ ప్రాంతం పేరును కూడా వినపడనీయని కర్కశ పాలకుల తీరుకు, నమ్మించి నయవంచన చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దల విధానాలకు విసిగివేసారి పోయిన కెసిఆర్ అనేక వేదికల మీద మన ప్రాంతానికి జరుగుతున్న అవమానాల పట్ల ఉద్వేగానికిలోనై స్వరాష్ట్ర సాధన కోసం 2001లో బిఆర్‌ఎస్ (నాటి టిఆర్‌ఎస్) పార్టీ ద్వారా పిడికెడు మందితో మొదలై పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చేసిన పోరాటంలో పిడికిలెత్తిన నాలుగు కోట్ల మంది ప్రజలను తన బలంగా మార్చుకుని నాటి పాలకుల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టి తన నాయకత్వంలో చేసిన 14 ఏండ్ల సుదీర్ఘ మలిదశ ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు మన కెసిఆర్.

అందుకే ఆయనకు ఈ నేలతో ఉన్నది తల్లిబిడ్డల బంధం -కన్న తల్లి పేగు బంధం. ఆ బంధాన్ని ఎవరో చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, తుంచేస్తే విరిగిపోయేది కాదు, పెకిలిస్తే పెకిలిపోయేది కాదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కదా..! సకల జనుల మహోద్యమం ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ సారథ్యంలో పరాయి పాలకుల శాపనార్థాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ అవహేళన చేసినోడి నోటి నుండే ప్రశంసలు అందుకుని పదేండ్ల కాలంలో ఎన్నో అసాధ్యమైన విజయాలను అందుకుని దేశానికి దిక్సూచిగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను సాకారం చేసేందుకు తన ప్రాణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన కెసిఆర్ పోరాట పటిమను, ఉద్యమ గతిని మలుపు తిప్పిన దీక్ష దివస్ తెలంగాణ అజరామర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ మానవాళిపై అణచివేత అధికమై అన్యాయమే అధికారం పరమావధి అయినప్పుడు ఆ దాస్యశృంఖలాల నుండి విముక్తి కలిగించడానికి ఆ పోరాటానికి దీక్ష దివస్ దిక్సూచిగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలకు ఆ తిరుగుబాటు స్ఫూర్తి, వారసత్వ సంపద వంటిది. అట్లాంటి ఈ రోజును మననం చేసుకోవడం అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అట్లాంటి ప్రక్రియలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్న కెసిఆర్.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మాత్రం అనునిత్యం ఒక రక్షణ కవచంలా నిలిచారు.

పిన్నింటి విజయ్ కుమార్
9052039109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News