Friday, April 26, 2024

అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి

- Advertisement -
- Advertisement -

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో, సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం, నేను అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ గవర్నర్ స్వర్గీయ కుముద్ బెన్ జోషి అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న చేతన అనే స్వచ్ఛంద సంస్థలో పాలనాధికారిగా పని చేస్తున్నప్పుడు, గవర్నర్ కార్యదర్శిగా పని చేస్తున్న ప్రముఖ ఐఎఎస్ అధికారి స్వర్గీయ డాక్టర్ వి. చంద్రమౌళి ఆంగ్లంలో రాసిన బిఆర్ అంబేడ్కర్ సంక్షిప్త జీవిత చరిత్రను తెలుగులోకి అనువాదం చేసే అవకాశం కలిగింది. ఆ పుస్తకం ముద్రించిన సంవత్సరం 1990లో భారత ప్రభుత్వం అంబేడ్కర్‌కు ఆయన మరణానంతరం, భారత దేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం, భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆ గౌరవాన్ని అందుకున్న 22 వ వ్యక్తి ఆయన.

ఆ పుస్తకాన్ని ఆంగ్లంలో రాసే నాటికి రచయిత స్వర్గీయ డాక్టర్ వి. చంద్రమౌళి, అప్పటికే విద్యా పరిపాలనా రంగాలలో సుమారు 30 సంవత్సరాల జీవితానుభవంలో సమాజంలోని బలహీన వర్గాల వారికి చెందినవారితో, అందులోనూ ప్రత్యేకించి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారితో స్వేచ్ఛగా, కలిమిడిగా తిరిగే సదవకాశం విరివిగా లభించింది. అలా పరిచయం కలిగి, క్రమేపీ ఆయనకు వ్యక్తిగత స్నేహితులుగా, వివిధ రంగాలకు చెందిన పలువురు, చంద్రమౌళికి చాలా విషయాలలో స్ఫూర్తిని కలిగించారు. ఇదే విషయాన్ని తన ముందు మాటలో వ్యక్తం చేసిన చంద్రమౌళి, తన ఉద్యోగ రీత్యా ఎందరో నిరుద్యోగ విద్యావేత్తల ను, నిరక్షరాస్యులను, మారుమూల కుగ్రామాలలో జీవిస్తున్న భూమిలేని పేదవారిని, అనేక సందర్భాలలో కలిసిన వందలాది సన్నివేశాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అలా, పల్లె ప్రాంతాలలోని షెడ్యూల్డ్ కులాలవారితో తనకున్న 30 సంవత్సరాల అనుబంధం వల్ల కలిగిన అనుభవంతో ఆయన నిష్కర్షగా చెప్పిన ఒకేఒక్క మాట ‘ఈ కులాల వారందరినీ ఐక్యంగా వుంచే ఒకే ఒక భాతృత్వ బంధం, కులం, భాష, మతం కాదు…. బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్మించిన ఉద్యమానికి, సంస్కృతికి, చెందిన వారిమనే భావన మాత్రమే వారిలో సోదరభావం పెంపొందించింది’. సర్వమానవ సౌభ్రాతృత్వం, లక్షలాది మంది శ్రామికులకు, బలహీన వర్గాల వారికి, ఆర్ధిక స్వాతంత్య్రం లభించాలన్న అంబేడ్కర్ మహాశయుడి ఆశయం నెరవేరాలని చంద్రమౌళి తన ముందుమాట ముగించారు.

Also Read: కర్ణాటక కాంగ్రెస్‌లో ఉత్సాహం!

అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, తదనంతరం పార్లమెంటు సభ్యులు, స్వర్గీయ కెఎస్‌ఆర్ మూర్తి, పుస్తక పరిచయం చేస్తూ, అంబేడ్కర్ సిద్ధాంతాలను, ఆలోచనలను, సరళమైన భాషలో గ్రంధస్థం చేయడం ద్వారా చంద్రమౌళి ఒక మహత్తర కార్యాన్ని నేరవేర్చాడని అన్నారు. అలాగే, అంబేడ్కర్ వెలిబుచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. ఉదాహరణకు, బ్యూరోక్రసీ (ఆయన మాటల్లో పెత్తందారీతనం), దాని పాత్ర గురించి అంబేడ్కర్ అభిప్రాయాలను తెలియ చేస్తూ, ‘బలహీన వర్గాల వారికి రాజ్యాంగపరంగా నిర్దేశించిన సౌకర్యాలను అందించడానికి అంకితభావంకల అధికారులు అవసరం’ అన్నారు. ‘అంబేడ్కర్ జాతీయవాది కాదని, కేవలం షెడ్యూల్డ్ కులాల వారి సమస్యలకే తన సమయాన్ని వెచ్చించారని’ తరచుగా కొందరు విమర్శిస్తారని, అది నిజం కాదని, ‘అస్పృశ్యతా నిర్మూలన, దారిద్య్ర నివారణ, స్వేచ్ఛా సమానతలు, భ్రాతృత్వ స్థాపన లాంటివి తన ప్రధాన అంశాలు ఐనప్పటికీ, మహిళా సమస్యలు, దేశంలో వారు నిర్వహించాల్సిన పాత్ర, కేంద్ర ప్రభుత్వ పాత్ర, మెజారిటీ వర్గాలు, మైనార్టీల విషయంలో నిర్వర్తించాల్సిన పాత్ర పట్ల కూడా ఆయన ఎనలేని కృషి చేశారు’ అని మూర్తి అన్నారు.

షెడ్యూల్డ్ కులాల రాజకీయ అధికారాలు భారత చరిత్రలో ప్రప్రథమంగా వర్తింప చేసిన ఒప్పందానికి రూపకల్పన చేసిన ఘనుడు అంబేడ్కర్ అనీ, దేశాపరిపాలనా యంత్రాంగంలో అంటరానివారని పిలువబడిన వారికి ఒక ఉన్నత స్థానాన్ని, విలువను కలిగించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కిందని, తాను పడిన శ్రమ, సలిపిన పోరాటాల వల్ల లభించిన ఫలితాలకు పరిపూర్ణమైన రూపురేఖలను దిద్దే అవకాశం లేకుండానే అంబేడ్కర్ అస్తమించడం దురదృష్టకరమనే విషయం పుస్తకం చదివితే తెలుస్తుంది. ‘అంబేడ్కర్ ఏ విధమైన నిరంకుశత్వాన్ని కూడా సహించలేదు. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి అంబేడ్కర్ పూర్తి వ్యతిరేకి’ అన్నారు కెఎస్‌ఆర్ మూర్తి.
చంద్రమౌళి పుస్తకంలో అంబేడ్కర్ మహాశయుడిని గురించి ఆయన విశ్లేషణ అధ్యయనపరంగా, ఆసక్తికరంగా వుంటుంది. ఆర్త్య సమాజ స్థాపకుడు స్వామీ దయానంద సరస్వతి; సంస్కరణల ఉద్యమానికి తలమానికమైన బ్రహ్మసమాజ స్థాపకుడు రాజారామ్మోహన్ రాయ్; ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, మానవతా ధర్మాలను సమ్మిళితం చేసి చాటి చెప్పిన మహోద్యమకర్త స్వామీ వివేకానంద; వివేకానందుడి బోధనల వల్ల ప్రభావితులైన తిలక్, గాంధీ లాంటి వారి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇనుమడింప చేసే భావమే అంబేడ్కర్ జీవితానికి ఆదర్శవంతమైంది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ప్రపంచ నాయకుల కోవకు చెందిన అంబేడ్కర్ భారతీయులకు పూజ్యనీయుడు, ఆదర్శప్రాయుడు, గౌరవనీయుడు.

చంద్రమౌళి పుస్తకంలో మరో ఆసక్తికరమైన విషయం, భీమారావ్ రామ్ జీ ఎలా తన పేరు పక్కన అంబేడ్కర్ చేర్చుకున్నాడనే విషయం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత అంబేడ్కర్ సతారాలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు, సాంఘికంగా వెనుకబడిన కులాలవారిని మిగతా విద్యార్థుల నుండి వేరు చేసి దూరంగా కూర్చోబెట్టేవారు. వీరి పెన్నులు, పుస్తకాలు కూడా అగ్రకులాలవారు తాకేవారు కాదు. బాలుడైన అంబేడ్కర్ కు (భీమారావ్ రామ్ జీ) ఈ చెడు అనుభవాలు నిరాశామేఘాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో బ్రాహ్మణ కులానికి చెందిన ఒక అధ్యాపకుడు ఆయనకు అండగా నిలిచాడు. అతడి వల్ల ప్రభావితుడైన భీమారావ్ రామ్‌జీ, ఆ అధ్యాపకుడి పట్ల తనకు గల ప్రేమకు, కృతజ్ఞతకు, ఆయన ఇంటి పేరైన అంబేడ్కర్‌ను తనపేరులో చేర్చుకున్నారు. అంబేడ్కర్ చదువు విషయంలో ఆ అధ్యాపకుడు ఎంతగానో తోడ్పడమే కాకుండా, అంబేడ్కర్ ఒక సంఘ సంస్కర్తగా రూపుదిద్దుకోవడానికి తన వంతు పునాదులు వేశాడు.

Also Read: మహిళా నేతలకూ తప్పని వేధింపులు

సామాజిక బహిష్కరణ, సాంఘిక వివక్ష అనే భూతాలు, ఒకసారి తన సోదరుడితో కలిసి తండ్రి ఉద్యోగం చేస్తున్న గ్రామానికి రైలుదిగి ఎద్దులబండి ఎక్కి పోయేటప్పుడు అంబేడ్కర్‌కు ప్రస్ఫుటంగా అనుభవంలోకి వచ్చాయి. తీవ్రంగా మనసు గాయపడ్డది. పిన్నవయస్కుడైన అంబేడ్కర్, ఆ క్షణంలోనే అంటరానితనం అనే భూతాన్ని రూపుమాపాలనీ, అణగతొక్కబడిన వర్గాల ప్రజల ఉద్ధరణకు తన జీవితం అంకితం చేయాలనీ, నిర్ణయించుకున్నారు. ఫలితంగా అంబేడ్కర్ తన అంటరానితన నిర్మూలనా పోరాటాన్ని గ్రామాల నుండి పట్టణాలకు, ఆ తరువాత రాజ్యాంగ నిర్మాణంలో చొప్పించేలా కృషి చేసేంత వరకూ కొనసాగింది. అంబేడ్కర్ కుటుంబం బొంబాయికి తరలి వెళ్లిన తరువాత అక్కడి ఉన్నత పాఠశాలలో చేరినప్పుడు, సెలవు దినాలలో ఇంటి పక్కన వున్న తోటకు పోయేవారు. సాంఘిక విప్లవకారుడు, మరాఠీ రచయిత, తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టిన వ్యక్తి, క్రిష్ణజీ అర్జున్ కెలూస్కర్ అనే అధ్యాపకుడు కూడా ఆ తోటలోకి తరచు వచ్చేవాడు. అతడు కులానికి బ్రాహ్మణుడైనా, అట్టడుగున నలిగిపోతున్న వర్గాల ప్రజలకు చేయూతనిచ్చి, తన శక్తిమేరకు పైకి లేవనెత్తాలని, దీక్షబూనిన మనసున్న మంచి వ్యక్తి.

క్రిష్ణజీ అర్జున్ కెలూస్కర్ తో పరిచయం అయిన తరువాత అంబేడ్కర్‌కు ఆయన ఒక మంచి మిత్రుడిగా, తత్వజ్ఞుడిగా తోడ్పడ్డాడు. అతడిచ్చిన గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను చదివిన అంబేడ్కర్ బౌద్ధమతం వైపు ఆకర్షితుడయ్యారు. పాఠశాల విద్యను అభ్యసించే రోజుల్లోనే ఒక సంస్కృత భాషా బోధకుడి ద్వారా ఆ భాషను, అంతకు ముందే పర్షియన్ భాషను నేర్చుకున్నారు అంబేడ్కర్. బరోడా మహారాజైన సాయాజీరావు, అర్హతకల షెడ్యూల్డ్ కులాల విద్యార్థి ఉన్నత విద్యకు ఆర్ధిక సహాయం చేస్తామని చేసిన ప్రకటనకు స్పందించిన క్రిష్ణజీ అర్జున్ కెలూస్కర్, అంబేడ్కర్ గురించి సిఫార్సు చేస్తూ ఆయనకు లేఖ రాయడం, 1921వ సంవత్సరంలో పట్టా తీసుకోగానే మహారాజు ఆయన్ను రాష్ట్ర సాయుధ బలగాలకు సంబంధించిన వ్యవహారాలు చూసే పౌర ఉద్యోగంలో నియమించడం జరిగింది. తండ్రి మరణించిన తరువాత అంబేడ్కర్ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. కొంతకాలం నిరుద్యోగిగా వున్న అంబేడ్కర్ మళ్లీ బరోడా మహారాజు సహాయంతో, తిరిగి రాగానే బరోడా రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేయాలన్న నిబంధనతో, 1913వ సంవత్సరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి, సముద్ర మార్గాన న్యూయార్క్ నగరానికి బయల్దేరారు.

1915వ సంవత్సరంలో కొలంబియా విశ్వ విద్యాలయం అంబేడ్కర్ కు ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్’ పట్టాను ప్రదానం చేసింది. అతడి పరిశోధనలో భాగంగా ‘పురాతన జాతీయ వాణిజ్యం’ అనే పరిశోధనాత్మక వ్యాసం, ఆ తరువాత ‘భారత దేశంలో కులాలు’ అనే మరో పరిశోధనాత్మక వ్యాసం రాశారు అంబేడ్కర్. 1916వ సంవత్సరంలో అంబేడ్కర్ రాసిన ‘భారత జాతీయ ఆదాయం’ అనే పరిశోధనాత్మక వ్యాసానికి కొలంబియా విశ్వ విద్యాలయం ఆయనకు డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు. అదే సంవత్సరం అంబేడ్కర్ ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ లో చేరారు. బ్రిటీష్ మ్యూజియంలో కూర్చుని నిరంతరం పుస్తక పఠనం చేసేవారు. ‘రూపాయి సమస్య’ అనే అతడి పరిశోధనాత్మక వ్యాసానికి ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ నుండి కూడా డాక్టరేట్ సంపాదించారు. భారత దేశానికి తిరిగొచ్చిన అంబేడ్కర్ ను బరోడా మహారాజు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిగా నియమించడం ఎందరినో అప్పట్లో ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే బరోడాలో అంబేడ్కర్ బహిరంగంగానే ఎదుర్కోవాల్సి వచ్చిన అవమానాలకు, వివక్షకు, అప్పట్లో చేసేదేమీలేక, వేరే మార్గం లేక, తనకు బరోడా మహారాజు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, తన పదవికి రాజీనామా చేసి, అజ్ఞాతంగా బొంబాయికి చేరుకున్నారు.

ఇక ఆ క్షణమే అంబేడ్కర్ ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. తన పాశ్చాత్య విద్య వల్ల, ఉన్నత పట్టాల వల్ల, తనకు కాని, దేశానికి కాని, ఎలాంటి ప్రయోజనం లేదని, సామాజిక సమస్యలకు రాజకీయ పరిష్కారం ఒక్కటే సాధనం అనీ గ్రహించారు.ఆ దిశగా అడుగు వేసే ముందర, పాశ్చాత్య విద్యతో కష్టపడి సంపాదించుకున్న ఉన్నత అర్హతలను విస్మరించి, న్యూయార్క్ నగరంలో స్నేహితులైన పారశీ స్నేహితుడి సంస్థలో గుమాస్తాగా పని చేశారు కొంత కాలం. అదే సమయంలో, తనకు లభించిన ఒక అవకాశం వల్ల ‘డిస్దేన్ హోమ్ కాలేజ్ ఆఫ్ బాంబే’ లో ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడుగా ఉద్యోగంలో చేరారు. అక్కడ పని చేస్తున్న రోజుల్లో, యువతలో మార్పును సాధించాలన్న అంబేడ్కర్ ఆకాంక్షను గురించి తెలుసుకున్న కొల్కార్ మహారాజా, ‘లీడర్ ఆఫ్ ద డంబ్’ అనే మాస పత్రికను నడపడానికి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి సంచిక అణగారిన తరగతులవారి సమస్యల గురించి, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వాన్ని గురించి, వాటిని సాధించే మార్గాల గురించి, అంటరానితనం నిర్మూలన గురించి, పౌర హక్కుల పరిరక్షణలతో అంశాల గురించి చర్చించేది.

ఆ తరువాత అంబేడ్కర్ ఉన్నత విద్య కోసం మళ్లీ లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పట్టా, రెండు సంవత్సరాల తరువాత న్యాయ శాస్త్రం చదివి బారిష్టర్ అయ్యారు అంబేద్కర్. న్యాయవాద వృత్తి అంబేడ్కర్ జీవితంలో ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లకు లండన్‌లో జరిగే రౌండ్ టేండ్ సమావేశానికి పాల్గొనడానికి ఎంపిక కాబడ్డ భారతీయుల్లో అంబేడ్కర్ ఒకరు. ఆ సమావేశం అనంతరం గాంధీ, అంబేడ్కర్ స్నేహితులయ్యారు. ఇక ఆ తరువాత స్వాతంత్య్రోద్యంలో పాల్గొన్న అంబేడ్కర్ అంచెలంచెలుగా ముందుకు సాగుతూ, భారత దేశం ఎదుర్కొంటున్న అనేక న్యాయమైన, చట్టపరమైన, రాజ్యాంగ సంబంధమైన విషయాలలో దిక్సూచిగా వుంటూ, తనదైన ప్రత్యేకత సంతరించుకున్న ఆలోచనా ధోరణితో, ‘భారత రాజ్యాంగ నిర్మాణ పితగా’ విశ్వ విఖ్యాతి గాంచారు. అంతటి మహనీయుడి 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ రోజు సిఎం కెసిఆర్ ఆవిష్కరించడం అంబేడ్కర్‌కు ఘనమైన నివాళి.

వనం జ్వాలా నరసింహారావు
8008137012

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News