Monday, May 6, 2024

కర్ణాటక కాంగ్రెస్‌లో ఉత్సాహం!

- Advertisement -
- Advertisement -

అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు వెలువడిన వార్తలను చూస్తే కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం, బిజెపి దొడ్లో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు తమ జాబితాను ప్రకటిస్తామని సిఎం బసవరాజు బొమ్మై చెప్పారు. బిజెపి నేతలంతా ఢిల్లీలో జాబితా గురించి మల్లగుల్లాలు పడుతున్నారు.సోమవారం లేదా మంగళ వారం గానీ జాబితా వెలువడవచ్చని బొమ్మై చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల నామినేషన్లు ప్రారంభమైన తరువాత జాబితాలను ప్రకటించిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 142 మందితో జాబితాను ప్రకటించింది. బిజెపి జాబితాను బట్టి మిగతా సీట్లకు ప్రకటిస్తారని వార్తలు. బిజెపి అసంతృప్త నేతల కోసం కూడా ఎదురు చూస్తుండవచ్చు. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకుంటున్న బిజెపి ఇంత వరకు జాబితాను తేల్చుకోలేకపోవటం బలహీనత, కుమ్ములాటలకు చిహ్నం.

మొత్తం 224 స్థానాలున్న అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు, 13వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈనెల 13న నోటిఫికేషన్, 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం సభలో బిజెపికి 117, కాంగ్రెస్‌కు 75, జెడి(ఎస్)కు 27 స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24వ తేదీ వరకు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.14 శాతం ఓట్లు 80 సీట్లు, బిజెపికి 36.85 శాతం ఓట్లు 104 సీట్లు, జెడి(ఎస్)కు 18.35 శాతం ఓట్లు 37 సీట్లు వచ్చాయి. జెడి(ఎస్) నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది గడచిన తరువాత 2019 జూలైలో కాంగ్రెస్, జెడిఎస్‌ల నుంచి కొంత మందిని ఆకర్షించి వారితో రాజీనామాలు ఇప్పించిన బిజెపి సభలో తమకే మెజారిటీ ఉందంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి బిఎస్ యెడియూరప్పను సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లతో పూర్తి మెజారిటీ సాధించింది. తరువాత బిజెపిలో కుమ్ములాటల కారణంగా 2021 జూలై 26న యెడియూరప్పతో రాజీనామా చేయించి కొత్త సిఎంగా బసవరాజ్ బొమ్మైని గద్దె నెక్కించారు.

ఎన్నికల ప్రకటన వెలువడిన రోజునే బిజెపి ఓడిపోనుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కర్ణాటకలో 1985 తరువాత ఇప్పటి వరకు ఒకసారి నెగ్గిన పార్టీ మరొకసారి వెంటనే అధికారానికి రాలేదు. ఈసారి ఆ చరిత్రను తిరగరాసి తమ పట్టును శాశ్వతం చేసుకోవాలని బిజెపి చూస్తున్నది. తిరిగి అధికారానికి రావటం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు దేశమంతటా ఊపు తేవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. దక్షిణాదిన హిందూత్వ ప్రయోగశాలగా పరిగణిస్తున్న కర్ణాటకలో మత ప్రాతిపాదికన ఓటర్లను చీల్చి లబ్ధి పొందాలని బిజెపి, సంఘ్‌పరివారం అనేక వివాదాలను ముందుకు తెచ్చి చిచ్చుపెట్టింది. చిత్రం ఏమిటంటే అధికారం వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండి అసంతృప్తి తలెత్తటం సహజం కానీ ఓడిపోతుందని భావిస్తున్న బిజెపిలో కుమ్ములాటలు అంతకంటేఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు బిజెపి అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్, జెడిఎస్ ఎంతో ముందుగానే ఎక్కువ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాయి.

అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయకముందే దాదాపు 40 సీట్లలో బిజెపి తిరుగుబాటును ఎదుర్కోనుందని డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఏప్రిల్ 8 వ తేదీన రాసింది. అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర వత్తిడి ఉన్న మాట నిజమేనని, తాము గెలిచే సీట్లలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆశావహులు ఉన్నారని, ఆ సంఖ్యను రెండు నుంచి మూడుకు తగ్గించి ఒక జాబితాను రూపొందించామని, గెలిచే అవకాశాలు, అధిష్టానం సలహాను బట్టి జాబితాను ఖరారు చేస్తామని యెడియూరప్ప చెప్పారు.తమను ఎంపిక చేయకుంటే తిరుగుబాటు చేస్తామని అనేక మంది బాహాటంగానే చెబుతున్నారు. సిద్ధాంతాలు తప్ప తమకు అధికారం ముఖ్యం కాదని, ఇతర పార్టీలతో పోలిస్తే తమది ఎంతో భిన్నమైనది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకొనే బిజెపిలో ఇలాంటి ధోరణులు వెల్లడికావటం ఇదే ప్రథమం కాదు. కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలలో అధికారం కోసం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుతెన్నులను చూస్తున్న తరువాత తమకు దక్కని అధికారం ఇతరులకూ దక్కనివ్వం అనే ధోరణి పెరిగి బిజెపి మరో కాంగ్రెస్‌గా మారటం కర్ణాటకలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం ఎలా ఉండేది చూడాల్సి ఉంది.

2019 ఫిరాయింపుల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి రమేష్ జర్కి హోలీ తాను కోరిన మూడు సీట్లను తన అనుచరులకు ఇవ్వకుంటే తాను పోటీలో ఉండనని బెదిరించారు. వారసత్వ రాజకీయాలంటూ ఇతర పార్టీల మీద ధ్వజమెత్తిన బిజెపి ఇప్పుడు కర్ణాటకలో అదే సమస్యతో సతమతం అవుతోంది. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించిన ఉదంతం కాంగ్రెస్‌కు ఒక ప్రచార అస్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు.ఒబిసిలను అవమానించిందంటూ ప్రచారం చేస్తున్న బిజెపి కూడా దాన్నే ఇక్కడా కొనసాగించవచ్చు. కన్నడిగుల ఓట్ల కోసం మతాన్ని జోడించి ఎంతో ముందుగానే సమీకరణకు పూనుకుంది. ముఠా కుమ్ములాటలకు తోడు 40% కమిషన్ ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. అవినీతి పట్ల కఠినంగా ఉండటంలో విఫలమైనట్లు, బలహీనమైన సింఎంగా బసవరాజ్ బొమ్మైని పరిగణిస్తున్నారు. గతంలో సామాజిక సమీకరణలను రెచ్చగొట్టి లబ్ధి పొందిన బిజెపికి ఇప్పుడు అవే గుదిబండలుగా మారుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు యెడియూరప్ప బిఎల్ సంతోష్ వర్గాలుగా బిజెపి ఉంది.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడిగా ఉన్న బిఎల్ సంతోష్ వర్గనేతలు విద్వేష ప్రచారానికి పెట్టింది పేరని అనేక ఉదంతాల్లో వెల్లడైంది. రాష్ర్ట అధ్యక్షుడు నళిని కుమార్ కటీల్, రాష్ర్ట మంత్రి సిటి రవి, కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే వంటి వారు హిందూత్వ రాజకీయాలకు కేంద్రంగా ఉండగా యెడియూరప్ప వర్గం కుల సమీకరణల మీద కేంద్రీకరిస్తుంది. బొమ్మై ఈ రెండు గ్రూపుల్లో యెడియూరప్ప వర్గానికి చెందినట్లు చెబుతారు. హిజాబ్, టిప్పు సుల్తాన్ వివాదాన్ని ముందుకు తెచ్చిన హిందూత్వ శక్తుల అజెండాను అమలు జరిపి వారిని సంతుష్టీకరించినట్లు విమర్శలున్నాయి.

ముస్లిం వ్యతిరేకతలో భాగంగా ఇప్పటివరకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేశారు. వక్కళిగ లింగాయత్ కులాలకు రిజర్వేషన్లను సమం చేసి వారిని సంతుష్టీకరించేందుకు చూశారు. బిజెపి కుమ్ములాటలతో ఉండగా అధికారం కళ్ల ముందు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌లోని ప్రధాన వర్గాలు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నట్లు వార్తలు. వక్కళిగ సామాజిక తరగతి మద్దతు ప్రధానంగా ఉన్న జెడి(ఎస్) కూడా పోటీ చేస్తున్నది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకున్నా తన బలంతో ఒక నిర్ణాయక శక్తిగా ఉంటున్నది. అటు బిజెపి ఇటు కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ నేత కుమారస్వామి సిఎంగా పని చేశారు. త్రిముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ మూడు పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలం గా ఉండటంతో ఆచరణలో రెండు ప్రధాన పక్షాల సమీకరణే ఎక్కువగా ఉంటున్నది. గత అనుభవాలను చూసిన తరువాత ఈ సారి దానిలో మార్పు వస్తుందా అన్నది ప్రశ్న. క్రైస్తవుల మీద విద్వేషపూరిత ప్రసంగం చేసి రెచ్చగొట్టినందుకు రాష్ర్ట మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మార్చి నెల 31న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మురికివాడల్లో ఉన్న వారిని మతమార్పిడి చేస్తున్న క్రైస్తవులను తన్నితరిమి కొట్టాలని పిలుపు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం బృంద అధికారి మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునిరత్న బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు. కన్నడిగులు తమిళుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న హనుమంతరాయప్ప కూడా మునిరత్న మీద కేసు దాఖలు చేశా రు. ఈ ప్రాంతంలో ఎవరైనా అడుగుపెడితే తన్ని పంపండి, నేను చూసుకుంటాను అన్న మంత్రి వీడియోను కూడా పోలీసులకు అందచేశారు. ఇతగాడు సినిమా నిర్మాత కూడా.“ఉరి గౌడ నంజె గౌడ”అనే పేరుతో ఒక సినిమా పేరు నమోదు చేశారు. వక్కళిగ సామాజిక తరగతికి చెందిన ఆ పేర్లు గల వారు పద్దెనిమిదవ శతాబ్దిలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ను హత్య చేశారన్నది ఒక కథ. దాన్ని చరిత్రకారులు కొట్టిపార వేశారు. తరువాత అంతటితో నిలిపివేశారు. ప్రభుత్వరంగ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విక్రయించే ‘నందిని’ పాలను దెబ్బ తీస్తూ రాష్ర్ట బిజెపి ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌ను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

నందిని మీద ప్రేమ కంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మీద ఉన్న ద్వేషాన్ని ఇది సూచిస్తున్నదని బిజెపి ఎంపి తేజస్వి సూర్య ఆరోపించారు. వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ఇదొక అడ్డదారి అని విమర్శకులవాదన. రాష్ర్టంలో తమిళనాడుకు చెందిన ఆరోగ్య, హెరిటేజ్, ఆంధ్రప్రదేశ్ నుంచి దాడ్ల, తిరుమల పాలు విక్రయిస్తున్నపుడు అమూల్‌ను ఎందుకు వ్యతిరేకించాలని సూర్య ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు చెందినవి. కర్ణాటక ప్రభుత్వ సంస్థను దెబ్బతీస్తూ మరో ప్రభుత్వ కంపెనీకి ఎర్ర తీవాచీ పరవటం ఏమిటన్నది ప్రశ్న. దేశంలో అన్ని ప్రభుత్వరంగ సంస్థలనూ దెబ్బ తీస్తున్న నరేంద్ర మోడీ గుజరాత్ సంస్థల జోలికి పోకుండా వాటిని రక్షిస్తున్నారన్న విమర్శ ఇప్పటికే ఉంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బిజెపి తరఫున ప్రచారానికి దిగనున్నారు. దీని మీద మరో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.

ఒక కళాకారుడిగా అందరి అభిమానం పొందే మీరు ప్రజల వాణిగా ఉంటారనుకున్నాను. కానీ స్వయంగా ఒక పార్టీ రంగు వేసుకున్నారు. మంచిది, ప్రతి పౌరుడు మిమ్మల్ని, మీ పార్టీని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఆదాయపన్ను శాఖ దాడుల బెదిరింపుతోనే సుదీప్ బిజెపికి ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తం మీద కన్నడ ఎన్నికల్లో సినిమా స్టార్ల ప్రచారం ఒక ఆకర్షణగా మారనుంది. జనం ఏదైనా ఒక పార్టీని ఓడించదలచుకున్నపుడు ఎంత పెద్ద స్టార్లు ప్రచారం చేసినా సదరు పార్టీని రక్షించలేదని గతంలో అనేక చోట్ల రుజువైంది. కర్ణాటక దానికి మినహాయింపుగా ఉంటుందా?.

ఎం కోటేశ్వరరావు, 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News