Saturday, May 25, 2024

ఈ ప్రభుత్వం కొసముట్టదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ ళ్లు లేక హైదరాబాద్‌కు వచ్చి ఆటో రిక్షాలు నడిపి న బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిన లక్షలాది బాధితులు ఉండె. మంచి నీళ్లు లేవు. కరెంటు రా దు. సాగునీళ్లు లేవు. చాలా దుర్భరమైన పరిస్థితి. అసొంటి రాష్ట్రాన్ని ఒకటి ఒకటి చేసుకుంటూ పొ దరిల్లు నిర్మించినట్టు బ్రహ్మాండంగా చేసుకుంటు వచ్చిన’ అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా, వీణవంకలో ఎం ఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జ రిగిన పార్టీ బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెం ట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం గులాబీ దళపతి పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి వివరించా రు.

‘14, 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ చివరిదశలో ఒక మాట చెప్పిన, హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీకి పోతున్న..కేసీఆర్ మీరు ఢిల్లీకి వెళ్తున్నరు.. ఏం జరుగుతది అనుకుంటున్నరు..?’ అని మీడియా వాళ్లు అడిగిండ్రు, ఒకటే మాట చెప్పిన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్న మళ్ల తెలంగాణ రాష్ట్రంతోనే అడుగుపెడుత అని చెప్పిన’ అని గుర్తుచేశారు. ఆనాడు నేను ఒక్క మాట మాట్లాడితే ఆడుకుంటున్న ఆంధ్ర మీడియా వాళ్లతోనే ఆ మాట చెప్పిన. ఎంత ధైర్యం, నమ్మకం ఉంటే ఆ మాట చెప్పాలె అన్నారు. మీరందరూ ఇచ్చిన బలం, ధైర్యంతో ఢిల్లీకి పోయిన. నేను చెప్పిన మాట ప్రకారం మళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోనే అడుగుపెట్టిన’ అని కెసిఆర్ చెప్పారు.

ముసలోళ్ల గోస తీర్చాలని రూ.2 వేలకు పెంచినః
ముసలోళ్ల గోస తీర్చాలని రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.1000 చేసిన. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచిన’ అన్నారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ‘తెలం గాణ మళ్లీ మర్లవడ్డది. తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే. మొన్న ముఖ్యమంత్రి రైతుబంధు 9వ తారీఖు వరకు వేస్తా అంటున్న డు. పంటలు వచ్చి జోకుతున్నరు ఓ దిక్కు. నాటేసేటప్పుడు ఇస్తరా? జోకేటప్పుడు ఇస్తరా? ఎంతపాటి పరిపాలన’ అంటూ విమర్శించారు.

నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తుండేః
జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్రం గౌరవం పెంచినం. ఐటి, పరిశ్రమల రంగంలో బ్రహ్మాండంగా తెలంగాణకు పెట్టుబడులు వస్తుండే. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తుండే. ఇవాళ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతున్నది. రోజుకు ఐదారుసార్లు ట్రిప్ అవుతున్నది. మధ్యలో పని ఆగిపోయి పెదవి విరుస్తున్నరు. ఇగ తెలంగాణలో లాభంలో లేదు. వెళ్లిపోవాలనుకుంటున్నారని పేపర్లలో వార్త వచ్చింది. నాకు చాలా దుఃఖం కలిగింది. నాలుగైదు నెలల్లో దుర్మార్గులు ఎంత పని చేసిరి. ఎంతమంచిగున్న తెలంగాణ ఎట్ల ఆగమైపాయే. ఇది ఎట్లా అని చాలా బాధపడ్డ. ఈ బాధ నివారణ కావాలి’ అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందున్నదిః
‘2001లో తెలంగాణ జెండా ఎత్తిననాడు హుజూరాబాద్ గడ్డ. ఆ నాడు పెద్ద నాయకులు లేకపోయినా జడ్‌పిటిసిలు, ఎంపిపిలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. 2001 ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందున్నది. మన బాధ్యత పూర్తవలేదు. అందుకోసం అందరినీ కోరేది ఒకటే. నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం.. కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండోది వందశాతం నేను మీకు చెబుతున్నా.. నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్లీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా మధ్యలో వచ్చినా.. చివరకు వచ్చినా ఎప్పుడు వచ్చిన మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ గవర్నమెంటే. అందులో ఎవరికీ అనుమానం లేదు. వందశాతం వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది.
365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది’ అన్నారు.

తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు రావడం లేదుః
నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు రావడం లేదు. నడిచిన తొవ్వే కదా. మీరు కొత్తగా గడ్డపారలతో బా యిలు తవ్వేది లేదు. పూడికలు తీసేది లేదు. నడిచింది నడిచినట్లుగా నడిపిస్తే అయిపోతుంది కదా? కరెంటు కోతలు పడుతున్నయ్ కదా? మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు మాయమైనయ్? మళ్లీ బిందెలు పట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటదా? అంటూ మండి పడ్డారు.

కెసిఆర్ కిట్ లేదు. న్యూట్రిషన్ కిట్ లేదుః
దవాఖానలు ఫాస్టుక్లాస్‌గా చేసినం. కెసిఆర్ కిట్లను తెచ్చాం. వ్యాన్లలో అమ్మాయిలను తీసుకువెళ్లి ప్రసవం చేయించి.. పైసాఖర్చు లేకుండా ఇంటికాడ దించినం. ఆడిపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు చేతిలో పెట్టి, కెసిఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్నాం. ప్రైవేటు దోపిడీపోయి గవర్నమెంట్ దవాఖానాల్లో ప్రసవాలు బాగా అయ్యేవి. మళ్లీ ఇప్పుడు తార్మార్ అయిపోతుంది. కిందిమీద అయి పో తుంది. కెసిఆర్ కిట్ లేదు. న్యూట్రిషన్ కిట్ లేదు. ఆ కథ లేదు. ఇవాళ రెండు వార్తలు వచ్చినయ్. వరంగల్ ఎంజిఎంలో దుర్భమైన పరిస్థితులు ఉన్నయ్. ఎయిర్ కండిషనర్లు పనిచేస్తలేవు. కొత్తగా పుట్టిన చిన్న పిల్లలు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నరని పేపర్లలో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తున్నది. డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంత తొందరలోనే ట్రాక్ ఎలా తప్పుతుంది? అంటూ నిలదీశారు. ప్రజల కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి..

గెలిచినా.. ఓడినా.. నాయకుడు ప్రజల కోసమే పనిచేయాలె :
ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పనిచేయాలని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని, రైతులు జీవితాలను బాగుచేశామని చెప్పారు. రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండాయని అన్నారు. పంట దిగుబడిలో హర్యానా రాష్ట్రాన్నే తలదన్నే స్థాయికి చేరామని అన్నారు.

నిమిషం కూడా పోకుండా కరెంటు ఇచ్చినంః
‘వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, రైతు బాగుండాలని ఓ ఐదు కార్యక్రమాలు తీసుకున్నం. అందులో మొదటిది రైతుబంధు పథకం. ప్ర పంచంలో తొలిసారి రైతుబంధు అనే పథకాన్ని సృష్టించింది మనమే. రెండోది కరెంటు. నిమిషం కూడా పోకుండా కరెంటు ఇచ్చినం. మూడోది చెరువులు బాగు చేసి సాగు నీళ్లు ఇచ్చినం. నాలుగోది రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇచ్చే ఏర్పాటు చేసినం. ఇక ఐదోది రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినం. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడి పంటలు అక్కడే కొనుగోలు చేసినం. దాంతో 54 లక్షల టన్నుల పంట పండించే తెలంగాణ రాష్ట్రం మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగింది. హర్యానా రాష్ట్రాన్నే తలదన్నే స్థాయికి పోయినం. అట్ల బ్రహ్మాండంగా పంటలు పండినయ్. దాంతో రైతుల్లో ఒక ధీమా వచ్చింది’ అని కెసిఆర్ తెలిపారు.

అవుతలోడు ఓ రూపాయి ఎక్కువ ఇస్తనంటే ఆశ పడుడు మనకు అలవాటుః
ఇవుతలోని కంటే అవుతలోడు ఓ రూపాయి ఎక్కువ ఇస్తనంటే ఆశ పడుడు మనకు అలవాటు’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సంక్షేమం రంగంలో కూడా అందరినీ ఆదుకున్నం. అదేవిధంగా దళితబంధు పథకం పెట్టినం. హుజూరాబాద్లోనే పైలట్ ప్రాజెక్టుగా పెట్టి బ్రహ్మాం డంగా రైతుబంధు పథకాన్ని అమలు చేసినం. అది మీ నియోజకవర్గం అదృష్టం. ఇయ్యాల దళితబిడ్డలు బ్రహ్మాండంగా తలెత్తుకుని బతుకుతున్నరు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినం. అవుతలోని మాటలు నమ్మి మనం ఓట్లేసి గెలిపించినం. ఇప్పుడు అలా జరుగొద్దు మందేడు ఎవరు మనోడు ఎవరు ఆలోచించి ఓటు వేయండి’ అని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినం. గెలుపు, ఓటములు సహజం. ఓడినా గెలిచినా ప్రజల కోసం పనిచేయాలి. దటీజ్ పాలిటిక్స్. గెలిచినా ఓడినా నాయకుడు ప్రజల కోసమే పనిచేయలే’ అని కెసిఆర్ అన్నారు. కార్యక్రమంలో కరీనగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

మోడీ గోదావరిని తీసుకుపోతానంటే.. సిఎం కుయ్యిమంటలేడు.. కుటుక్కుమంటలేడుః
ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి నదిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించుకుపోతానంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుయ్యిమంటలేడు.. కుటుక్కుమంటలేడని మండిపడ్డారు. నరేంద్ర మోడీ.. ‘నేను మీ గోదావరిని తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు ఇస్తానని బాజాప్తా చెబుతున్నడు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిండు. కుయ్యిమంటలేడు. కుటుక్కుమంటలేడు ముఖ్యమంత్రి. మరి ఏం మతలబు? ఏం కారణం ? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతుకు ఏం కావాలి? మనకు వచ్చేది గోదావరి నీళ్లే కదా? అదిపోయిన తర్వాత మంచినీళ్లు, తాగునీళ్లు లేవి ? తెలంగాణ బతుకు ఏదీ? ఇంత ప్రధాన విషయంపై కూడా ఆయన మాట్లాడుతలేడు’ అంటూ మండిపడ్డారు.

వినోద్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
వినోద్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీంనగర్ ఎంపిగా గతంలో పనిచేసిండు. నడుమలో వచ్చిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. తంబాకు నములుడు. అడ్డంపొడువు మాట్లాడడం తప్ప.. తిట్ల పురాణం తప్ప ఇంకొటి లేదు. మనకు ఆ తిట్ల పురాణమెందుకు? ఆ పంచాంగమెందుకు? ఆ పంచాయితీ ఎందుకు? చదువుకున్నోడు.. విద్యావంతుడు.. అడ్వొకేట్ వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడుతడు. మన గోదావరిని కాపాడుతడు. మన నిధుల కోసం కొట్లాడుతడు. ఇవాళ నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా రావాల్సిన అక్కెర ఉండేది. కౌశిక్‌రెడ్డి తాను ఎంత పొడువుగా ఉన్నడో అంత భారీగా చేద్దామనుకున్నడు. ‘బస్ యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. ఇద్దరు బదులుకొని నాపై 48 గంటలు నిషేధం అన్నరు. నేనన్నా మంచిమాట కానీ.. దేవుడున్నడు. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తి పోచమ్మ గొట్టిందట.

ప్రజలు ఉంటరు న్యాయం చెబుతరు ఏం బాధ లేదు. అని 48 గంటలు ప్రచారం ఆపేశా’ అని అన్నారు. ‘దాంట్లో హుజూరాబాద్ ఎగిరిపోయింది. దానికి పాడి కౌశిక్ రెడ్డి ఆడికి రాకుండా… ఎట్ల పోతవ్.. పోతే పోయినవ్ గని ఏ తిప్పలన్నపడి మంచిర్యాల నుంచి ఏ రాత్రయినా ఇక్కడికే రా.. ఇక్కడే ఉండాలి.. నీ సంగతి ఎందో చూసి పంపిస్తా అన్నడు. నిన్న ఒక 200 మందితో బొట్టుపెట్టించిడు. కడుక్కునేందుకు నాకు గంట సమయం పట్టింది. నేను పడే బాధలు మీకు తెల్వది. ఫొటోలు దిగాలే అన్నడు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. ఒక రోజు 24 గంటలు ఇక్కడే ఉండేటట్టు హుజూరాబాద్‌కు వస్త. వెయ్యి కాదు నాలుగు వెయ్యిల ఫొటోలు దిగుదాం. దయచేసి నన్ను ఇప్పుడు ఆపొద్దు. నన్ను పంపియ్యాలే… జగిత్యాలలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడికి పోవాలి. హుజూరాబాద్లో నేను చెప్పేది ఒక్కటే. కరీంనగర్ పార్లమెంట్లో హుజూరాబాద్ అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే ఇంకో ఐదారు శాతం ఓట్లు పెంచగలుగుతరు. మీరు ముఖ్య నాయకులే ఉన్నరు. నేను చెప్పిన అంశాలపై చర్చ పెట్టి ఓటింగ్ శాతం పెంచండి. గెలిచిన తర్వాత మీ ఎంపిని తీసుకొని వచ్చి ఒకరోజంతా ఇక్కడే ఉంట. అందరం కలిసి పండుగ చేసుకుందాం’ అని కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News