Monday, June 17, 2024

మే చివరినాటికి అందుబాటులో బిజి-2 విత్తనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈనెల చివరి నాటికి పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచనున్నామని విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన సరఫరా, రాయితీలు తదతర అంశాలపై మంత్రి తుమ్మల శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యని ప్రభుత్వం సహించబోదని తేల్చిచెప్పారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకొని విత్తన అమ్మకాలు పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. విత్తన ప్యాకెట్ గరిష్ట ధర రూ.846గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రంలో ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతాంగం ప్రయోజనాల కోసం 2024 ఖరీఫ్‌లో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అంచనా వేసినట్లు చెప్పిన తుమ్మల అందుకు సరిపడా బోల్‌గార్డ్ బీజీ-2 పత్తి విత్తనాలు మే చివరి నాటికి రైతులకి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రత్తి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అన్నారు. గత ఏడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా ఈసారి 120 లక్షల ప్యాకెట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేలలో సేంద్రీయతను పెంచేందుకు పచ్చిరొట్టె ఎరువుల సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ రకం ఎరువులను అందించే విత్తనాలను రాయితీ ధరలకే రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు.50942 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 11616 క్వింటాళ్ల జనుము విత్తనాలు , 236క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచగా ,

ఇప్పటివరకూ రైతులు 20518క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఖరీఫ్‌లో సాగు చేసే విత్తనాలు ఎవరైనా నిర్ణీత ధరలకు మించి ఎక్కువకి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మే చివరినాటికి రైతులకు బీజీ-2 విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి -తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News