Monday, June 17, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

టాప్ సీడ్‌లుగా జకోవిచ్, స్వియాటెక్
రేపటి నుంచి మెగా టోర్నమెంట్

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఆదివారం నుంచి ఈ టోర్నీ జరుగనుంది. పురుషులు, మహిళల విభాగంలో జరిగే ఈ మెగా టోర్నమెంట్ అభిమానులను కనువిందు చేయనుంది. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ టోర్నమెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా అతను ఈసారి బరిలోకి దిగనుంది. అయితే తొలి రౌండ్‌లోనే నాదల్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. తొలి పోరులో అతను జర్మనీకి చెందిన నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్‌తో తలపడనున్నాడు. వరుస గాయాలతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న నాదల్ ఇటీవలే తిరిగి మైదానంలోకి దిగాడు. ఇక తనకు ఎంతో కలిసి వచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలాగైన టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ తొలి రౌండ్‌లో జ్వరేవ్‌ను ఓడించడం నాదల్‌కు అంత తేలిక కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫేవరెట్‌లుగా ఇగా, నొవాక్

మరోవైపు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఇగా స్వియాటెక్ (పోలండ్)లు టాప్‌సీడ్‌లుగా బరిలోకి దిగనున్నారు. కిందటి సీజన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో నొవాక్, మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ ఛాంపియన్‌లుగా నిలిచారు. ఈసారి కూడా వీరే ఫేవరెట్‌లుగా కనిపిస్తున్నారు. అయితే కొంతకాలంగా జకోవిచ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇటీవల జరిగిన జెనివా ఓపెన్‌లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టాడు. అయితే తనకు ఎంతో కలిసి వచ్చే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు.

ఈసారి జకోవిచ్‌కు గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జ్వరేవ్, అల్కరాజ్, జన్నిక్ సిన్నర్, సిట్సిపాస్, రుబ్లేవ్, పాల్, ఫ్రిట్జ్, రూడ్, రూనె, షెల్టన్, దిమిత్రోవ్ తదితరులు పురుషుల విభాగంలో టైటిల్స్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు 14 సార్లు విజేతగా ఉన్న నాదల్ (స్పెయిన్) కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక మహిళల విభాగంలో ప్రస్తుతం ఛాంపియన్ స్వియాటెక్ భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఇగా ఈసారి కూడా టైటిల్‌పై కన్నేసింది. ఇందులోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. రెండో సీడ్ అరినా సబలెంక (బెలారస్), మూడో సీడ్ గాఫ్ (అమెరికా). ఐదో సీడ్ వొండ్రొసొవా (చెక్), ఆరో సీడ్ మారియ సక్కారి (గ్రీస్), 9వ సీడ్ ఒస్టాపెంకొ (ఇస్టోనియా), ఏడో సీడ్ సింగ్ జెంగ్ (చైనా), 15వ సీడ్ స్విటోలినా (ఉక్రెయిన్) తదితరులు కూడా టైటిల్‌పై కన్నేశారు. అయితే సబలెంక, స్వియాటెక్‌ల మధ్య టైటిల్ కోసం గట్టి పోటీ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News