Thursday, June 13, 2024

మోడీ, అమిత్‌షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal

 

హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్‌షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్‌అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో కేజ్రీవాల్ హవాను ఆపలేక పోయారు. ఆయన వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రజల నిజసమస్యలను గాలికి వదిలి జాతీయవాదమే అండగా రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలనుకున్న మోడీ, అమిత్‌షాల ఆశలను ఢిల్లీ కూడా అడియాశలు చేసింది. మహారాష్ట్ర. జార్ఖండ్ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కూడా బిజెపి ఓడిపోయింది. 2018 ఎన్నికల తరువాత జరిగిన 6 రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఆ పార్టీకి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురౌతున్న ఛేదు అనుభవాలుగా చెప్పవచ్చు.

దేశ వ్యాప్తంగా కాషాయ ప్రభంజనాన్ని సృషించాలనుకున్న మోడీ, అమిత్‌షాల వ్యూహాలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2018 మార్చిలో 22 రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రాలు ఉంటే ఆ సంఖ్య 16కు పడిపోగా ఆ మేరకు బిజెపియేతర పాలిత ప్రభుత్వాలు 12కు పెరిగాయి. 370 అధికరణం రద్దు, తాజా ‘కా’ ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిలు బిజెపిని రక్షించలేకపోతున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ తాజాగా ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు బిజెపిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించగలుగుతున్నాయి. బిజెపి జాతీయవాదంపై తన విధానాన్ని పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితిని ఢిల్లీ ఫలితాలు సృష్టించాయి. ఢిల్లీలో పాగా వేయడానికి బిజెపి జాతీయవాద సెంటిమెంట్‌ను పెద్దఎత్తున రగిల్చినా అది కేజ్రీవాల్ అభివృద్ధి,

సంక్షేమ కార్యక్రమాల విజయవంత అమలుముందు దిగదుడుపే
కేజ్రీవాల్ హిందుత్వ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజల నిజసమస్యలైన విద్య, ఆరోగ్యం, విద్యుత్ మహిళల భద్రతపై దృష్టి సారించి వారి విశ్వాసాన్ని తిరుగులేని రీతిలో పొందగలిగారు. కేజ్రీవాల్‌ను హిందూ వ్యతిరేకిగా, టెర్రరిస్టుగా బిజెపి ప్రచారం చేసినా, దానిని కేజ్రీవాల్ ముందు హనుమాన్ దేవాలయాన్ని సందర్శించడమేకాక నుదిటిపై తిలకంతో హిందూవర్గాల సానుభూతిని సాధించడంలో కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవనవ్యయాన్ని తగ్గించడం ద్వారా మెజారిటీ ప్రజానీకం ఆదరణను పొందగలిగారు. గడిచిన ఐదేళ్లలో ఆయన అంబానీలతో పోరాడి ఇండ్లకువాడే విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించారు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడే పేద వర్గాలకు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి ఆపైన 400 యూనిట్ల వరకు 50 సబ్సిడీని ఇచ్చి ఆ వర్గాలకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటును కల్పించారు.

ఆ తర్వాత ప్రైవేటు స్కూళ్ల లాబీలను ఎదుర్కొని ఐదేళ్లలో విద్యార్థుల ఫీజులు పెంచకుండా యాజమాన్యాలను కట్టడి చేయగలిగారు. ఫీజుల భారంతో ఆర్థికంగా సతమతమయ్యే పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ చర్య వరంలా మారి ఆ వర్గాలు గుండు గుత్తగా కేజ్రీవాల్‌కు జై కొట్టాయి. ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లను మౌలిక సదుపాయాల పరంగా మెరుగుగా తీర్చిదిద్ది చివరకు ప్రైవేటు స్కూళ్లకు పంపే విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లకు మళ్లించే విధంగా దేశంలో ఎక్కడాలేని విప్లవాత్మక సంస్కరణలను విజయవంతంగా చేపట్టారు. 20000 అదనపు తరగతి గదులను నిర్మించి అధునాతన లైబ్రరీలు, డెస్కులను ఏర్పాటు చేయడమేగాక ఇక్కడ బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా మెరుగైన శిక్షణను ఇప్పించారు. ప్రజల దైనందిన జీవనంలో జీవనంలో ప్రధానమైన విద్యుత్తు, విద్యా భారాన్ని తగ్గించడమే గాకుండా ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని తగ్గించడానికి 300కు పైగా మొహల్లా క్లీనిక్‌లను ఏర్పాటు చేశారు.

ఇక్కడ వందలాది పరీక్షలను, చికిత్సను ఉచితం చేయడంతో ఇక్కడ పేద వర్గాలు ఆరోగ్య వ్యయాన్ని గరిష్ఠంగా తగ్గించుకోగలిగాయి. జనాభాలో కీలకమైన మహిళలకు రక్షణ కరువకావడంతో బస్సుల్లో మహిళా మార్షల్స్‌ను నియమించి ఆ వర్గాలను అమితంగా ఆకట్టుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా బస్సుల్లో పింక్ పాస్‌లు ఇచ్చి చిరు మహిళా ఉద్యోగులకు నెలవారీ ఖర్చులను మిగిల్చారు. నీటి బిల్లును సగానికి తగ్గించి కుటుంబానికి అవసరమైన నీటిని అందించగలిగారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఐదు ప్రాంతాలకు ఆధ్యాత్మిక యాత్రలను అందించి ఆ వర్గాలను ఆకట్టుకోగలిగారు.

ఢిల్లీ ఎన్నికల్లో 25 నియోజక వర్గాల్లో కీలకమైన పూర్వాంచల్‌లోని పంజాబి, జాట్‌లను కూడా ఆయన తనదైన విధానాలతో ఆకర్షించగలిగారు. ఒకవైపు పేద మధ్య తరగతి ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడమేగాకుండా తనపాలనపై అవినీతి మరకలు పడకుండా సుపరిపాలనను సాగించారు. కాని జాతీయ పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్‌లు ప్రజల నిజ సమస్యలను గాలికి వదిలి సెంటిమెంట్లను నమ్ముకొని దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యం గా కాంగ్రెస్ 63 సీట్లలో డిపాజిట్ కూడా దక్కకపోడం ఆ పార్టీ చరిత్రలో విషాద అధ్యాయంగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలతోనైనా బిజెపి గుణపాఠం నేర్చుకొని సరికొత్త ప్రజానుకూల విధానాలకు శ్రీకారం చుట్టకపోతే మున్ముందుకూడా ఢిల్లీ ఫలితాలే ఎదురు కావచు.

Kejriwal has break to Modi and Amit Shah
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News