Monday, May 6, 2024

సస్పెన్షన్‌కు నిరసనగా గాంధీలో వైద్యుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Doctor suicide

 

మన తెలంగాణ / సికింద్రాబాద్ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ వైద్యుడు హల్‌చల్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. గాంధీ ఆసుపత్రిలో పని చేస్తూ సస్పెండ్ అయిన ఓ వైద్యుడు మంగళవారం గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో హల్‌చల్ చేశారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేశారు. చిలకలగూడ పోలీసులు సకాలంలో స్పందించి వైద్యుడిని కాపాడి ఆయన నివాసం వద్ద విడిచిపెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు ఉన్నాయని మీడియాకు తప్పుడు సమాచారమందించారు. వాస్తవానికి గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి పాజిటీవ్ కేసులు నమోదు కాలేదు.

ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డాక్టర్ వసంత్‌కుమార్ వ్యవహరిస్తూ మీడియాకు తప్పుడు సమాచారమందించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్న కారణంతో ఆసుపత్రి యాజమాన్యం ఆయన్ను విధుల నుంచి తప్పించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కు అటాచ్ చేసింది. అయితే డాక్టర్ వసంత్ కుమార్ మంగళవారం తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ పెట్రోల్ డబ్బాతో ఆసుపత్రికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వసంత్‌కుమార్‌ను అడ్డుకుని మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి తరలించి డాక్టర్ వసంత్ కుమార్ సతీమణికి అప్పగించారు. వైద్య వృత్తిలో ఉండి ఈ విధంగా ఆత్మహత్యాయత్నం చేయడం పట్ల అక్కడ ఉన్న రోగులు, వారి సహాయకులు , ఆసుపత్రి సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు.

డాక్టర్ వసంత్ కుమార్ ప్రవర్తన సరిగా లేనందువల్లనే చర్యలు తీసుకున్నట్టు యాజమాన్యం తెలిపింది. డాక్టర్ ఆత్మహత్యాయత్నాన్ని చాకచక్యంగా విఫలం చేసి సురక్షితంగా ఇంటి వద్ద వదిలిపెట్టిన చిలకలగూడ సిఐ బాలగంగిరెడ్డి, సిబ్బందిని కమిషనర్ అంజనీకుమార్ అభినందిందిచారు. డాక్టర్‌ను రక్షించినందుకు వారికి నగర కమిషనర్ పది వేల రివార్డును ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఆత్మహత్యాయత్నం చేసిన వసంత్‌కుమార్‌పై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Doctor suicide attempt in Gandhi hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News