Monday, November 11, 2024

చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్‌లో కేశవరావు మృతి..?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ ఎంఎల్ (మావోయిస్టు) పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం. కేశవరావు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాలి మండలంలోని జియ్యన్నపేట గ్రామం. ఆయన వరంగల్‌లో బి.టెక్ చదువుకున్న రోజుల్లోనే ఆర్‌ఎస్‌యులో చేరి, ఎం.టెక్ కూడా పూర్తి చేసిన తర్వాత పీపుల్స్‌వార్‌లో చేరారు. కేశవరావు బి.టెక్ పూర్తయిన తర్వాత, 1980లో ఒకసారి అరెస్టు అయ్యారు.

1984లో ఎం.టెక్ పూర్తి చేసిన తర్వాత ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విద్యార్థిగా ఉండగానే ఓసారి తన స్వగ్రామం వచ్చి, తనకు రావలసిన వాటాగా ఆస్తి ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగారు. అన్నదమ్ముల చదువులకే ఆస్తి సరిపోయిందని ఉపాధ్యాయుడు అయిన ఆయన తండ్రి వాసుదేవరావు చెప్పిన తరువాత ఇల్లు విడిచి వెళ్లిపోయారు. స్వగ్రామం రావడం అదే చివరిసారి. సోదరుడు ఢిల్లీశ్వరరావు వివిధ పోర్టుల్లో ఉన్నతాధికారిగా పని చేశారు. ఆయనకు ముగ్గురు అక్కాచెల్లెలు ఉన్నారు. గెరిల్లా, మిలటరీ, సాంకేతిక వ్యూహాలు, నైపుణ్యాలలో దిట్టగా పేరుపొందిన కేశవరావు పార్టీలో అంచలంచలుగా ఎదిగారు.

తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని అడుగుపెట్టిన తొలి కమాండర్ అతడే. ఎల్‌టిటిఇ మాజీ యోధుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన మావోయిస్టు ప్రముఖుల్లో కేశవరావు ఒకరు. అనేక కీలకమైన ఆపరేషన్ల వెనుక అతని వ్యూహం, పాత్ర ఉందని వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నత అధికారుల అనుమానం. పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. 2018లో కేంద్ర ప్రధాన కార్యదర్శి పదవికి అనారోగ్య కారణాలతో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత, కేశవరావు ఎన్నికైనట్టు సమాచారం. ఆయన తలపై వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం కోటి రూపాయలు అని తెలుస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News