Friday, March 29, 2024

మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం మరో అంతర్జాతీయ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ, జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ -నీటి వనరుల సంస్థ (ఎఎస్‌సిఇఇడబ్లూఆర్‌ఐ) ఆహ్వానించింది. అమెరికా హెండర్సన్‌లో వచ్చే నెల.. మే నెల 21-25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

అప్పుడు ముఖ్యోపన్యాసం చేసిన ఆయన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు,నీటి సంరక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ భారీ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్దేశించిన సాహసోపేతమైన, ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఆ నాటి సమావేశంలో ఆయన ఆవిష్కరించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్ తో పాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పరిధి- సామర్థ్యం తో పాటు నిర్మాణంలో చూపించిన అద్భుతమైన వేగానికి ఆ ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది. ఇంతేకాదు ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలుపెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది. మంత్రి కెటిఆర్ కలిసిన ఆ ప్రతినిధి బృందం, ఒక బృహత్ సంకల్పాన్ని అతి తక్కువ సమయంలోనే వాస్తవంగా మార్చినందుకు అభినందనలు తెలియచేశారు.

ఈ మెగా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలతో పాటు సస్యశ్యామల మాగాణంగా తెలంగాణ మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ కోరింది. 177 దేశాలకు చెందిన 150,000కంటే ఎక్కువ మంది సివిల్ ఇంజనీర్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఎఎస్‌సిఇ)లో సభ్యులుగా ఉన్నారు. 1852లో స్థాపించబడిన ఈ సంస్థ అమెరికాలోనే పురాతన ఇంజనీరింగ్ సొసైటీ ఇది. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతో పాటు నీటి వనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News