Tuesday, September 10, 2024

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే సుంకిశాల ప్రమాదం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. పరిపాలన చేతగాక కెసిఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు. సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజి ఉన్నా హైదరాబాద్‌కు నీటికష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం సుంకిశాల ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు కె.పి.వివేకానంద, ముఠా గోపాల్‌తో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కృష్ణానదికి నాలుగేండ్లు నీళ్లు రాకపోయినా ప్రాజెక్టుతో ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్‌లో నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదని అన్నారు. హైదరాబాద్‌కు 50 ఏండ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ హయాంలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సుంకిశాల ఘటనను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని ప్రశ్నించారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా..? లేక విషయాన్ని కప్పిపెట్టారా..? అని నిలదీశారు. ఒకవేళ ఈ ఘటన ముఖ్యమంత్రికి తెలియకపోతే అంతకన్నా సిగ్గుచేటు లేదని మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం జరిగిందని, కానీ ఈ ఘటనపై శాసనసభలో ప్రకటన చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం, పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు.

త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే గోడ కూలిందని అన్నారు. ప్రభుత్వానకి చిత్తశుద్ది ఉంటే ఈ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ చేయాలని అన్నారు. మున్సిపల్ శాఖను తనవద్దే పెట్టుకున్న సిఎం రేవంత్ ఈ ఘటనకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం వెంటనే స్పందిస్తుందని,ఎన్‌డిఎస్‌ఎ హడావిడిగా రిపోర్టు ఇస్తుందని కానీ ఇప్పుడు కేంద్రం స్పందించడం లేదు..బిజెపి నాయకులు ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆ ఘటనను తాము దాచిపెట్టలేదని గుర్తుచేశారు.

కాంగ్రెస్ చిల్లర ప్రచారానికి ప్రకృతే సమాధానం చెబుతుంది
తమ ప్రభుత్వం సాగు, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చిందని కెటిఆర్ తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులు కూడా వేగంగా చేశామన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు మార్చడమేనా మార్పు అంటే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు సరుకు లేదు.. సబ్జెక్టు లేదని విమర్శించారు. బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదని చెప్పారు. కాళేశ్వరం ఫెయిలైతే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో కెసిఆర్‌కు పేరు వస్తుందనే ఆరోపణుల చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చేతగాని తనంతోనే ఈ అంశాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. మంచి జరిగితే వారి ఖాతాలో, చెడు జరిగితే తమ ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు. సుంకిశాలను త్వరలో బిఆర్‌ఎస్ బృందం సందర్శిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేతల చిల్లర ప్రచారానికి ప్రకృతే సమాధానం చెబుతుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News