Sunday, April 28, 2024

కేంద్రంపై జిఎస్’ఢీ’

- Advertisement -
- Advertisement -

KTR Post Card to PM Modi over GST on Handloom

ప్రధానమంత్రికి తన స్వదస్తూరీతో పోస్ట్‌కార్డ్ రాసిన కెటిఆర్
చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టి రద్దు చేయాలని డిమాండ్
సమస్యలపై సమగ్రంగా కార్డులో ప్రస్తావన
నేతన్నలతో పాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలని పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమ, చేనేత శాఖ మంత్రి కె. తారకరామారావు శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డుని రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను ఆ పోస్ట్ కార్డులో ఆయన సమగ్రంగా వివరించారు. ప్రధానంగా చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి రాసిన కార్డులో ఆయన మరోసారి డిమాండ్ చేశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న కెటిఆర్, వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇప్పటికే కేంద్రం రద్దు చేశారన్నారు. అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మీరే (మోడీ)నని ఎద్దేవా చేశారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే మీ ప్రభుత్వం… తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు.

ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్స్ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక సాంస్కృతి సారథులుగా పరిగణించాలని సూచించారు. ఈ నేపథ్యంలో చేనేతపైన విధించిన పన్నును వెంటనే రద్దు చేయాలని పేర్కొంటూ ప్రగతి భవన్ నుంచి చేనేత కార్మికుల పక్షాన పోస్ట్ కార్డును రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని తద్వారా నోరులేని నేత కార్మికుల బాధల్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

KTR Post Card to PM Modi over GST on Handloom

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News