Wednesday, May 1, 2024

విద్వేషులకు తీవ్ర హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Prime Minister Liz Truss has been in office for just 44 days

ఎడతెగని ఎడారిలో ఒక పెద్ద ఒయాసిస్సు ఎదురైనట్టయింది. విద్వేష ప్రసంగాలను అరికట్టకపోతే న్యాయస్థాన ధిక్కారంగా పరిగణించి తీవ్రంగా వ్యవహరించవలసి వుంటుందని, రాష్ట్రాలకు, వాటి పోలీసులకు సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక అటువంటిదే. తరచూ తీవ్రంగా గాయపడుతున్న దేశ లౌకిక (సెక్యులర్) వెన్నెముకకు ఇది ఊరట కలిగించి తగిన భరోసాను ఇస్తుందని ఆశించవచ్చు. ఈ ప్రసంగాలు చేసే వారు ఏ మతానికి చెందినవారైనప్పటికీ ఉపేక్షించకుండా అవసరమైన చర్యలు తీసుకోవలసిందేనని, ఫిర్యాదు లేకుండానే పోలీసులు తమంత తాముగా కఠినంగా స్పందించాలని జస్టిస్‌లు కెఎం జోసెఫ్, హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం ఆదేశించింది. దేశంలో రోజురోజుకీ అడుగంటిపోతున్న మత సామరస్య వాతావరణానికి అభయ హస్తం చాస్తున్న ఉత్తర్వుగా దీనిని భావించవచ్చు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లింలపై విద్వేష ప్రసంగాలు, దాడులు మితిమించిపోయాయని, వాటిని అరికట్టాలని కోరుతూ షహీన్ అబ్దుల్లా అనే వ్యక్తి తరపున దాఖలైన కేసులో ధర్మాసనం ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. ఈ మూడు రాష్ట్రాల పోలీసులకు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశమంతటికీ వర్తిస్తాయి. మామూలు వ్యక్తులే కాకుండా శాసన కర్తలు కూడా తమ ప్రసంగాల్లో ముస్లింలపై విద్వేష విషాన్ని చిమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న విషయం న్యాయమూర్తులను తీవ్రంగా కదిలించి వుండవచ్చు. ‘ఇది 21వ శతాబ్దం.. అయినా దేవుడిని, మతాన్ని మనం ఎంత అథమ స్థాయికి దిగజార్చామో తెలుస్తున్నది’ అని న్యాయమూర్తులు ఎత్తి చూపారు. శాస్త్రీయ చైతన్యంతో ప్రవర్తించాలంటూ రాజ్యాంగం 51వ అధికరణ దిశానిర్దేశం చేసినప్పటికీ మతం పేరిట మనం అందుకు విరుద్ధమైన స్థాయికి చేరుకున్నామని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడడం, ముఖ్యంగా దేశ సెక్యులర్ ప్రజాస్వామిక లక్షణాన్ని నిలబెట్టడం ఈ న్యాయస్థానం బాధ్యతగా భావిస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో విరాట్ హిందూ పరిషత్ నిర్వహించిన సభలో పశ్చిమ ఢిల్లీ ఎంపి పర్వేశ్ వర్మ మాట్లాడుతూ “వీరిని” పూర్తిగా బహిష్కరించండి. వారి దుకాణాల్లో ఏ వస్తువూ కొనవద్దు, వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దు అని అన్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ మాటల వీడియో క్లిప్పింగ్ కూడా బయటపడింది. మనిష్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటనకు నిరసనగా ఈ సభ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సాజిద్, ఆలం, బిలాల్, ఫైజాన్, మొహిసిన్, షాకిర్ అనే వారిని అరెస్టు చేశారు. అయితే ఇది కేవలం స్థానిక వివాదానికి సంబంధించి జరిగిన ఘటనేనని పోలీసులు చెబుతున్నారు. పర్వేశ్ వర్మతోనే ఈ విద్వేష ప్రసంగ ధోరణి ప్రారంభం కాలేదు. ఇంతకు ముందు బిజెపికి చెందిన పలువురు ఇలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వారిలో చట్ట సభల సభ్యులు కూడా వున్నారు.దేశంలో ప్రాంతాలకు, భాషలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలిసి బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేయడం క్షమించరానిది. అయితే దేశాన్ని పరిపాలిస్తున్న వారే ఇందుకు పాల్పడడం సెక్యులర్ నీతిని భయోత్పాతంలోకి నెట్టి వేస్తున్నది. పడగ నీడ వంటి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు బతుకుతుండడం కలలో కూడా ఆశించరానిది. ఈ విద్వేష దావానలంలో బలైపోయేది అల్ప సంఖ్యాకులే. గుజరాత్‌లో జరిగిన మాదిరి మారణకాండలే ఇందుకు నిదర్శనం. ఇటువంటి హతలకు పాల్పడే వారిని, వారి కుటుంబ సభ్యులను బహష్కరించాలని, ఒకవేళ ఆ కుటుంబాలు రెస్టారెంట్లనో, వ్యాపారాలనో నడిపిస్తూ వుంటే వాటిని కూడా వెలి వేయాలని మాత్రమే తాను అన్నానని ఏ మతాన్ని పేర్కొనలేదని పర్వేశ్ వర్మ ఇచ్చిన వివరణలో ఆయన తెలివి తేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని ఆయన దురుద్దేశాన్ని మాత్రం అవి కప్పిపెట్టలేకపోతున్నాయి. ఇంకొక ప్రసంగ కర్త జగద్గురువు యోగేశ్వర్ ఆచార్య మాట్లాడుతూ అటువంటి వ్యక్తులు మన ఆలయాల వైపు వేలెత్తి చూపితే ఆ వేలును కాదు ఆ చెయ్యినే తీసేయండి. అవసరమైతే గొంతు కోసేయండి, ఏమి అవుతుంది? ఒకరిద్దరిని ఉరి తీయవచ్చు. మనందరం దీని మీద దృష్టి పెట్టాలి. వారిని పట్టుకొని చంపాలి అని అన్నారని వార్తలు చెబుతున్నాయి. వ్యక్తులు చేసే నేరాలను వారి మతస్థులందరికీ ఆపాదించి వారి దుకాణాలను, రెస్టారెంట్లను బహిష్కరించాలని పిలుపివ్వడం అమానుషం. విడదీయడం తేలిక కావచ్చుగాని కలిపి వుంచడం సులువు కాదు. కలిసి ఒక జాతిగా బతుకుతున్న భిన్న మతాలు, సంస్కృతులకు చెందిన వారి మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని సాధించుకునే కుట్రకు శాశ్వతంగా తెరపడాలి. ఈ దేశ ప్రజాస్వామిక సెక్యులర్ లక్షణాన్ని కాపాడి తీరుతానన్న సుప్రీంకోర్టు ప్రకటన విద్వేష రాజకీయాలు నడుపుతున్న వారికి తీవ్ర హెచ్చరిక.

Supreme Court Concern on Hate Speech

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News