Tuesday, May 7, 2024

రేషన్ కార్డుల కెవైసి ప్రక్రియ.. పునఃసమీక్షించాలి

- Advertisement -
- Advertisement -

కేంద్రాన్ని కోరిన మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రేషన్ కార్డుల కెవైసి ప్రక్రియపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లేఖ రాశారు. ప్రవాస తెలంగాణీయుల ప్రయోజనాలు కాపాడడానికి నిబంధనలను పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రేషన్ కార్డుదారుల ప్రయోజనాలు ముఖ్యమంత్రి కెసిఆర్ కాపాడుతున్నారని, తెలంగాణ పౌరులెవరూ ఆందోళనలకు గురికావద్దు అని మంత్రి గంగుల సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంత్రి గంగుల కమలాకర్ లేఖ రాశారు.. ఆహారభద్రతా కార్డుల్లో నూతనంగా కెవైసి నిబంధనలు అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనకర పరిస్థితులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దేశం మొత్తం పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు గల వైవిధ్యం విభిన్నమైనదని, దశాబ్దాల కాంగ్రెస్ పాలనా వైఫల్యాల వల్ల సరైన ఉపాధి లేక ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్, ఇతర దేశాలతో పాటు దేశంలోని ముంబై, భీవండి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వేలాది మంది వలస పోయి బతికే దౌర్బాగ్య పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ దుస్థితిని రూపుమాపడానికే సిఎం కెసిఆర్ సారథ్యంలో సుధీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని, సాధించిన తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే సాగునీరు, తాగునీరు, పరిశ్రమల ఏర్పాటు తదితర కీలక రంగాల్లో గణనీయమైన వృద్దిని సాధించి మౌళిక వసతులు సహా అన్ని రంగాల్లో దేశానికి మార్గనిర్ధేశకత్వం వహిస్తున్నామన్నారు.

ఈ కృషితో ప్రస్తుతం వలసలను అరికట్టడంతో పాటు గతంలో వలసపోయిన తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి స్వరాష్ట్రం రావడానికి ప్రోత్సాహిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతం కానీ సమస్యలను కేవలం తొమ్మిదేళ్ల స్వల్ప సమయంలో పూర్తిగా రూపుమాపడం ఎంతటి కష్టసాధ్యమో పాలకులుగా మీకు తెలియనిది కాదు అని మంత్రి లేఖలో పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ పౌరులు ఇంకా తెలంగాణ ఆవల జీవనభృతిని కొనసాగిస్తున్నారని, ప్రస్తు కేంద్ర ప్రభుత్వం కెవైసి నిబంధనల వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ తదితర ప్రాంతాల ప్రజలు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర చోట్లా, దక్షిణ తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల ప్రజలు ముంబై తదితర చోట్ల పెద్ద సంఖ్యలో బతుకును వెల్లదీస్తున్నారన్నారు. వీరి ప్రయోజనాలు కాపాడడానికి సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, ప్రజల ప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వాల అంతిమ ప్రయోజనమైనందున ప్రవాస తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి మానవీయ దృక్పథంతో కేంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా పున:సమీక్షించాల్సిన అవసరముందని తమరికి ఈ లేఖ ద్వారా గుర్తు చేస్తున్నానని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ప్రస్తుత కెవైసి నిబంధనల వల్ల దూరప్రాంతాల నుండి రాలేక ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజానీకం ప్రయోజనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుతుందని ఈ లేఖ ద్వారా భరోసానిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అదేరీతిలో ప్రజలకు భరోసా కల్పించాల్సిందిగా కోరుతూ ఆహార భధ్రతా కార్డుల కెవైసి నిబంధనలపై పున:సమీక్షించాల్సిందిగా కోరుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News