Saturday, July 27, 2024

విత్తనాలడిగితే రైతులపై లాఠీఛార్జ్ చేస్తారా..?

- Advertisement -
- Advertisement -

ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం..?
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ నేతల అగ్రహం

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులు విత్తనాలు అడిగితే వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్‌ను కెటిఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కర్షకులపై దాడికి తెగబడ్డ ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలు పక్కన బెట్టి సిఎం రేవంత్ రైతుల గురించి పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు.

ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అని విమర్శించారు. రాష్ట్రంలో రైతన్నల సమస్యల పైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. రైతన్నలపై లాఠీఛార్జ్ చేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలపై ప్రభుత్వ దాడులు బిఆర్‌ఎస్ ఉపేక్షించదని హెచ్చరించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం, ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని వ్యాఖ్యానించారు. అన్నదాతలకు తాము అండగా ఉంటామని, అవసరమైతే పార్టీ తరపున విస్తృతమైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కెటిఆర్ అన్నారు.

కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? : హరీశ్‌రావు

రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణమని, అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదని విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. రైతన్నలపై లాఠీలు ఝుళిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

కాంగ్రెస్ తెచ్చిన మార్పు లాఠీఛార్జేనా..? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ తెచ్చిన మార్పు లాఠీఛార్జేనా..? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విత్తనాలు ఇస్తారన్న నమ్మకం రైతుల్లో ఎలా కలిగిస్తారని, విత్తనాలు ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News