Monday, April 29, 2024

న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ (95) కన్ను మూశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నారిమన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడు దశాబ్దాల క్రితం బాంబే హైకోర్టులో తన వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులు కావడంతో ఢిల్లీకి తన మకాం మార్చారు.1972లో కేంద్రప్రభుత్వం ఆయనను అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. అయితే 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన కుమారుల్లో ఒకరైన రోహింటన్ నారిమన్‌సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011నుంచి 2013 వరకు ఆయన కూడా సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. 1991నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఫాలీ నారిమన్ అధ్యక్షుడిగా పని చేశారు.1991లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.1999నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు. న్యాయరంగానికి ‘భీష్మ పితామహుడి’గా పిలవబడే నారిమన్ మృతితో ఒక తరం ముగిసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, మాజీ సిజెఐ ఎన్‌వి రమణ, కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వంటి న్యాయనిపుణులు సంతాపం ప్రకటించారు.

ప్రధాని మోడీ సంతాపం
‘ ఫాలీ నారిమన్‌జీ న్యాయనిపుణుడు, మేధావుల్లో ఒకరు. సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన కుటుంబం గురించే నా ఆలోచన అంతా..’ ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. నారిమన్ మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు కూడా తమ సంతాపం తెలియజేశారు.

జయలలిత తరఫున వాదన
బ్రిటీష్ బర్మా రంగూన్‌లో 1929లో జన్మించిన నారిమన్12 ఏళ్ల వయసులో బర్మాపై జపాన్ దాడితో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది.సిమ్లా, లక్నోలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం మేరకు సివిల్స్ ఎగ్జామ్స్ వైపుఅడుగులు వేసిన ఆయన.. చివరికి ఆర్థిక స్థోమత సహకరించక పోవడంతో న్యాయవాద వృత్తి వైపుమళ్లారు.అంతర్జాతీయ మధ్యవర్తింపుపై గుర్తింపు పొందిన న్యాయనిపుణుడు ఫాలీ నారిమన్. భారత రాజ్యాంగ చట్ట రూపకల్పనలోను నారిమన్ కీలకపాత్ర పోషించారు. తన కెరీర్‌లో ఆయన ఎన్నో చారిత్రాత్మక కేసుల్లో వాదించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే న్యాయ రంగంలో మైలురాయిగా నిలిచిన కేశవానంద భారతి కేసులో ప్రముఖ న్యాయవాది నానాభాయ్ పాల్కీవాలాకు అసిస్టెంట్‌గా పని చేశారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన ఆయనఆది పొరబాటని ఆ తర్వాత ఇంటర్వూల్లో పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్, ఎస్పీ గుప్తా, టిఎపాయ్ ఫౌండేషన్ వంటి పలు కేసుల్లో వాదించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ కేసులోనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరఫున వాదించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. నారిమన్ ప్రముఖ న్యాయవాదే కాక రచయిత కూడా. ‘బిఫోర్ ది మెమరీ ఫేడ్స్’, ‘ది స్టేట్ ఆఫ్ ది నేషన్’, ‘ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్’, ‘గాడ్ సేవ్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్’లాంటి పుస్తకాలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News