Sunday, April 28, 2024

కలిసి నడుద్దాం

- Advertisement -
- Advertisement -

Let's protect federal system from BJP

బిజెపి కబళింపు నుంచి ఫెడరల్ వ్యవస్థను కాపాడుకుందాం

తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడా, వారితో కలిసి
ఫెడరల్ వ్యవస్థ రక్షణకు కృషిచేస్తాం మమతా బెనర్జీ ప్రకటన

కేంద్రంలోని పాలకుల కబళింపు నుంచి దేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి తాను, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కలిసి కృషిచేస్తామని వారితో తాను మాట్లాడానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం నాడు ప్రకటించారు.

కోల్‌కతా: బిజెపికి వ్యతిరేకంగా ఐక్య సంఘటనను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం నాడు ఒక ప్రకటన చేస్తూ దేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో కలిసి కృషిచేస్తామని చెప్పారు. వారితో తాను మాట్లాడానని వెల్లడించారు. మమతా బెనర్జీ గత వారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘యోగి’ కాడని భోగి మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశ విశాల హితాన్ని కోరి యూపీ ఎన్నికల్లో పాల్గొనరాదని తమ పార్టీ నిర్ణయించినట్లు వెల్లడించారు. అఖిలేష్ యాదవ్ ఏ ఒక్క సీటులోనూ దెబ్బతినరాదని కోరి తాను టిఎంసి తరఫున ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేదన్నారు. యుపి ఎన్నికల మొదటి దశలో అఖిలేష్ పార్టీ 37-57 స్థానాలు గెలుచుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఒక వార్తా ఛానెల్‌కు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలను సజీవదహనం చేస్తున్నారని, రైతుల హత్యలు జరిగిపోతున్నాయని ఆమె విమర్శించారు.

ఇండియా బాగుండాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌ను కాపాడుకోవాలన్నారు. మార్చి 3న వారణాసి ఎన్నికల సభలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీతో కూడా సత్సంబంధాలు లేవని అన్నారు. భావాలు గలవారమని చెప్పుకునే ప్రతిఒక్కరూ తమవంటి వారినందరినీ ఒకచోటుకు చేర్చాలని అభిప్రాయపడ్డారు. కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్, సిపిఎంలను కోరారని, వారు తన మాట వినకపోతే చెప్పగలిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ తన దారిలో తాను వెళ్లవచ్చు. మేము మా దారిలో వెళ్తామని నొక్కి చెప్పారు. విద్వేషం అత్యాచారాల బీజాల నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన సమయం ఇదేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి అధ్యక్ష తరహా పాలనను దాపురింపజేసే పరిస్థితిలో ఇండియా ఉందన్నారు. తన పార్టీ గోవాలో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో ఫిబ్రవరి 12న జరిగిన నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లలో తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించినందుకు అక్కడి ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News