Saturday, June 3, 2023

ఏక్‌నాథ్ అవసరం తీరిపోయిందా!

- Advertisement -
- Advertisement -

బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 288 స్థానాల్లో 240, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కేవలం 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ బవాన్‌కులే ఇటీవల ప్రకటించడం గమనిస్తే షిండేతో ఇక తమ అవసరం తీరిపోయిందనే సంకేతం ఇచ్చినట్లయింది. దానితో ‘బిజెపి గురించి ముందే చెప్పాం.. తొందరపడి ఇప్పుడు ప్రయోజనం ఏమిటి’ అన్నట్టు ఉద్ధవ్ థాకరే వర్గం సానుభూతి చూపుతుంది.

నేడు దేశంలో ప్రధానమైన జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మాత్రమే. అయితే ఆ రెండిటి పట్ల ప్రాంతీయ పార్టీలు అపనమ్మకంతో చూస్తున్నాయి. అవసరానికి వాడుకొని, వారి ద్వారా తమ బలం పెంచుకొని, తర్వాత తమను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారని అనుభవాల ద్వారా తెలుసుకున్నారు. అందుకనే బిజెపి, కాంగ్రెస్ లేని జాతీయ కూటమి అవసరమని మమతా బెనర్జీ, కెసిఆర్ నుండి పలువురు నేతలు తరచూ చెబుతుంటారు. పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ వస్తే ఇక ప్రాంతీయ పార్టీలతో అవసరం లేన్నట్లే వ్యవహరిస్తుంటారు.

చివరకు సైద్ధాంతికంగా సన్నిహితమైన పార్టీల పట్ల కూడా అటువంటి అవకాశవాద ధోరణులు ప్రదర్శిస్తుంటారు. దశాబ్దాల పాటు ఉమ్మడిగా రాజకీయాలు చేసిన అకాలీదళ్, శివసేన వంటి పార్టీలతో బిజెపి సంబంధాలు ఎటువంటి అవమానకర పరిస్థితులలో తెగిపోయాయో చూశాము. బిజెపి ఎన్నికలలో తమను తీవ్రంగా ఎదుర్కొని, ఘోరంగా ఓటమిని చూపిన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో తెర వెనుక సంబంధాలకు ప్రయత్నం చేస్తారు గాని సైద్ధాంతిక బాంధవ్యం గల అకాలీదళ్, శివసేన వంటి నేతల పట్ల కనీసం సానుభూతిగా వ్యవహరించడం కనిపించదు.

తమ షరతులకు తలొగ్గి, తాము ప్రభుత్వం ఏర్పాటుకు కలసి రాకపోవడమే కాకుండా, తమ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి అధికారం చేపట్టి రెండేళ్లకు పైగా కొనసాగిన ఉద్ధవ్ థాకరేను సహించలేకపోయారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఒక వంక ప్రయోగిస్తూ, మరోవంక ఏక్‌నాథ్ షిండే వంటి వారిని లోబరచుకొని, రాజ్‌భవన్‌ను దుర్వినియోగపరచి ఆ ప్రభుత్వాన్ని కూలదోయడం చూశాము. బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 288 స్థానాల్లో 240, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కేవలం 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ బవాన్‌కులే ఇటీవల ప్రకటించడం గమనిస్తే షిండేతో ఇక తమ అవసరం తీరిపోయిందనే సంకేతం ఇచ్చినట్లయింది. దానితో ‘బిజెపి గురించి ముందే చెప్పాం.. తొందరపడి ఇప్పుడు ప్రయోజనం ఏమిటి’ అన్నట్టు ఉద్ధవ్ థాకరే వర్గం సానుభూతి చూపుతుంది. కొంతమంది షిండే వర్గం ఎమ్మెల్యేల నుండి నిరసనలు ఎదురుకావడంతో బవాన్‌కులే తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని అంటూ మాట మార్చినప్పటికీ బిజెపి అసలు ఉద్దేశాన్ని ఆయన బైటపెట్టారనడంలో సందేహం లేదు.
మహారాష్ట్రలో బాల్ థాకరేతో బాంధవ్యం కారణంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోగలిగిన బిజెపి నరేంద్ర మోడీ దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతగా ఆవిర్భవించడంతో ఇక శివసేనతో తమకు అవసరం లేదనుకొనే పరిస్థితికి వచ్చింది. అయితే ఉద్ధవ్ థాకరే సాంప్రదాయ రాజకీయ నాయకుడు కాకపోవడంతో దారిలోకి తెచ్చుకోవడం కష్టమైంది.

అందుకనే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంపై చర్చలు విఫలమయ్యాయి. అంతకు ముందు ఎప్పుడూ అమలు పరుస్తున్న శివసేనకు 171, బిజెపికి 117 సీట్ల ఫార్ములాకు ఒప్పుకొని బిజెపి ఒంటరిగా పోటీ చేసింది. అయితే మోడీ ప్రభంజనంలో కూడా సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేకపోవడంతో మళ్ళీ శివసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.అయితే, 2019 నాటికి ఉద్ధవ్ బిజెపి గేమ్ ప్లాన్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తనకు బలం సమకూరే వరకు స్నేహం నటిస్తూ తర్వాత మిత్రుడిని పేకముక్కల మాదిరిగా విసిరి పడవేస్తుందని భావించారు. బీహార్‌లో నితీష్ కుమార్ సహితం బిజెపి ఎత్తుగడలను గ్రహించే ముందుగా మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు దేశంలో రెండంకెల ఎంపిలు గల రాజకీయ పార్టీ ఏదీ కూడా ఎన్‌డియేలో లేకపోవడం గమనార్హం. బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన షిండేకు ఇప్పుడు బిజెపి ధోరణి అనుభవంలోకి వచ్చింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్న చరిష్మాలో సగం కూడా షిండేకు లేదు.

ఉద్ధవ్‌కు తండ్రి మాదిరిగా విశేషమైన ప్రజాకర్షణ లేకపోయినప్పటికీ ఆకుటుంబం నుండి రావడం, స్వతంత్ర వ్యక్తిత్వం ప్రదర్శించడం ద్వారా ప్రజల సానుభూతి మాత్రం పొందగలిగారు.కానీ షిండేకు ప్రజల నుంచి సానుభూతి పొందే అవకాశాలే లేవు. పైగా పార్టీని ఛిన్నాభిన్నం చేసినందుకు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న శివసేన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. షిండే మరో ప్రమాదం కూడా ఎదుర్కొంటున్నారు. సాంప్రదాయకంగా గుజరాతీ ప్రజలు, మరాఠా ప్రజల మధ్య ఆధిపత్య సమస్యలు నెలకొన్నాయి. మోడీ,- అమిత్ షా పాలనలో గుజరాతీల ప్రాబల్యం పెరుగుతూ ఉండటం, గతంలో మహారాష్ట్రకు ప్రతిపాదించిన పలు భారీ ప్రాజెక్టులు సహితం ఇప్పుడు గుజరాత్‌కు తరలిపోతూ ఉండడంతో మహారాష్ట్రీయుల సాంప్రదాయ ఆగ్రహాన్ని అధిగమించాల్సిన అదనపు సవాల్‌ను షిండే ఎదుర్కోవలసి వస్తున్నది. ముఖ్యమంత్రిగా థాకరే అనేక విషయాలలో గుజరాతీయుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడుతూ మహారాష్ట్ర సెంటిమెంట్ ప్రోగుచేయగలిగారు.

శివసేనకు చెందిన ఎమ్యెల్యేలు, ఎంపిలను దాదాపుగా షిండే తనవైపుకు తెచ్చుకోగలిగినా వారెవ్వరినీ సొంతంగా గెలిపించ గల సామర్థ్యం ఆయనకు లేదు. అందుకోసం తిరిగి బిజెపిపై, మోడీ ప్రజాకర్షణపై ఆధారపడవలసి వస్తుంది. దానితో షిండే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరోవంక, ఉద్ధవ్ థాకరే పార్టీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని గతంలో శివసేన గెలిచినా అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. బిజెపి ఉద్దేశం కేవలం ముఖ్యమంత్రి పదవి పొందటమే కాదని, మొత్తం శివసేనను రాజకీయంగా సమాధి చేయడం ద్వారా ఆ బలం మొత్తాన్ని బిజెపికి మార్చుకోవాలని, తద్వారా మహారాష్ట్రలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని ఇప్పుడు అందరికీ స్పష్టం అవుతుంది. తాము కనీసం 140 స్థానాల్లో పోటీ చేస్తామని షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఈ మధ్య ప్రకటించారు.

2014లో ఉద్ధవ్ డిమాండ్ చేసింది అదే. కానీ బిజెపి 125కి మించి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు కేవలం 40 నుండి 45 సీట్లు మాత్రమే బిజెపి ఇవ్వాలనుకొంటే, మరో 100 సీట్లను అదనంగా డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు బిజెపి ఏమాత్రం సుముఖంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి శివసేనతో ఆధిపత్యం కోసం ఉద్ధవ్ షిండేల మధ్య కొంత కాలంగా జరుగుతున్న పోరు ఇక ముగిసినట్లే భావించవచ్చు. షిండే వర్గం ఇప్పుడు తమ రాజకీయ అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రాలో ఎదురుకాగల ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో బిజెపి సహితం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్రతో పాటు బీహార్ వంటి మరికొన్ని రాష్ట్రాలలో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం ఉండడంతో ఆ సీట్లను ముఖ్యంగా దక్షిణాదిన పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.తెలంగాణ, ఒడిశా, తమిళనాడులలో ఆ భర్తీని నింపుకొనే విధంగా వ్యూహ రచన చేస్తున్నది.

అయితే, మహారాష్ట్రాలో ఎదురవుతున్న సమస్యలే దక్షిణాదిన కూడా బిజెపికి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది ప్రజల మనోభావాలు గ్రహించే ప్రయత్నం చేయకుండా ఉత్తరాదిన విజయవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను ఇక్కడ అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బిజెపి సీట్ల పరంగా ముందు కు వెళ్లలేకపోవడానికి సహితం స్థానిక ప్రజల సెంటిమెంట్‌లను పరిగణనలోకి తీసుకోలేకపోవడమే. త్రిపురలో ‘జీరో’ స్థాయి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేశాం, ఎపిలో ఎందుకు చేయలేము? వంటి ప్రశ్నలు వారి రాజకీయ అజ్ఞానాన్ని మాత్రమే వెల్లడి చేస్తుంది. ప్రజలతో కలసిపోగల నాయకత్వం లేకుండా కేవలం భావోద్వేగాలతో రాజకీయంగా పురోగమించాలనే ప్రయత్నాలు ఎల్లప్పుడూ రాజకీయంగా ఫలవంతం కావని గ్రహించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News