Friday, April 19, 2024

ఢిల్లీ అల్లర్ల న్యాయ పోరాటం వృథా!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో మూడేళ్ళ క్రితం జరిగిన హింసాత్మక అల్లర్లలో కళ్ళముందే తన ఆస్తులను ధ్వంసం చేస్తూ, కాల్చి బూడిద చేసిన దారుణ సంఘటనకు మౌనసాక్షిగా నిసార్ అహ్మద్ నిలబడిపోయాడు. న్యాయ స్థానంలో నేరస్థులను గుర్తించడానికి నిలబడిన ఈ బాధితుడికి న్యాయపోరాటం కూడా ఒక పీడకలగా మారింది. ఇది ఒక్క నిసార్ అహ్మద్ మాత్ర మే కాదు, అనేక మంది పరిస్థితి కూడా ఇదే. అది 2020 ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయం. తానుంటున్న ఈశాన్య ఢిల్లీలోని భగీరతి విహార్ సమీపాన ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని నిసార్ అహ్మద్ గమనించాడు.

కిటికీలోంచి చూస్తుంటే ‘జైశ్రీరావ్‌’, ‘జాగో హిందూ జాగో’ (హిందువులారా మేల్కొనండి) అంటూ నినాదాలు చేస్తూ ఒక సమూహం దూసుకొస్తోంది. వారి లో చాలా మంది అతనికి తెలుసు, కొందరి పేర్లు కూడా తెలుసు. వారంతా స్థానికులు. స్థానికంగా ఉండే హిందూ ముస్లింలు సోదరభావంతో మెలుగుతారని నమ్మే 47 ఏళ్ళ నిసార్ అహ్మద్ ఒక ఆశాజీవి. ఆ నినాదాలు పెరగడంతో అహ్మద్ భార్య తన కుమార్తె ఇమా, గర్భవతి అయిన తన కోడలు సుమయా కలిసి తమ సమీప బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. అహ్మద్ చిన్న కుమారుడు సుహైల్ వారిని బంధువుల ఇంటిలో దింపేసి తిరిగి వచ్చాడు. యమునా కాలువ వంతెనపైన ఆగిన ఆ ప్రదర్శనను సుహైల్, అహ్మద్ అనుసరించారు.

‘ఆ వంతెనపైన రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ గుంపు సాయంత్రానికల్లా విధ్వంసానికి పూనుకుంది. వెంటనే వెనక్కి పరిగెత్తుకు వచ్చేశాం. మా గార్మెంట్ షాప్ మూసి ఉందా లేదా అని పరిశీలించాం. భవనానికి ఉన్న ప్రధాన ద్వారాన్ని లోపలి నుంచి మూసివేసి, మిద్దెపైకి వెళ్ళిపోయాం’ అని వివరించాడు అహ్మద్. నూటయాభై నుంచి రెండు వందల మంది ఉన్న ఆ గుంపు వెడల్పైన యమునా కాలువ పక్కనే ఉన్న భగీరతి విహార్ వద్దకు వచ్చారు. ‘చీకటి పడగానే దారుణమైన హింసాకేళి మొదలైంది. వీధుల్లో వెళ్ళే వారిని ఆపేసి, వారెవరో గుర్తించి, దోచుకుని వారిలో కొందరిని చంపేశారు. వారి మృతదేహాలను కాలువలోకి విసిరేశారు’ అన్నాడు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. ఈ హింసలో మొత్తం 53 మంది మరణించగా, యమున ప్రాంతంలో కాలువల నుంచి ఎనిమిది శవాలను వెలికి తీశారు. భగీరతి విహార్ సమీపంలోని కాలువ నుంచి రెండు శవాలను వెలికితీశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23న మొదలైన ఈ హింసాత్మక సంఘనలు నాలుగు రోజులు కొనసాగాయి. ఈ సంఘటనల్లో 200 మంది గాయపడగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారత దేశంలోని కోట్లాది మంది ముస్లింలను అనుమానించే పరిస్థితి ఏర్పడుతోందని, ఈ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టారు. మతవిశ్వాసాలతో సంబంధం లేకుండా అంద రూ సమానమనే రాజ్యాంగ సూత్రంలో భారతీయ జనతాపార్టీ జోక్యం చేసుకుంటోందని మైనారిటీల ఆరోపణ. తోటి ముస్లింలతో కలిసి ఆరాత్రి నిద్రలేకుండా గడిపిన అహ్మద్ చేసేదేమీ లేక జరిగిపోయిందేదో జరిగిపోయింది అనుకున్నాడు. మర్నాడు అంతకంటే దారుణంగా హింస చెలరేగుతోంది. ఆ అల్లరి మూక మర్నాటి ఉదయం 67 గంటల మధ్య మళ్ళీ వచ్చి విధ్వంసానికి పాల్పడింది. తన ఇంటి కింద ఏదో కలకలం చెలరేగుతోందనుకున్నాడు. కిటికీలోంచి చూస్తే కొందరు పక్కింటి వారి తలుపులు పగలకొడుతున్నారు. వారి ఇంటిని దోచేసుకుని, ఫర్నిచర్ అంతా రోడ్లో పడేసి తగులపెట్టారు. సీలింగ్ ఫ్యాన్‌ను కూడా వదలలేదు. అహ్మద్‌కు అర్థమైపోయింది ముస్లింల ఇళ్ళపైనే దాడులు చేస్తున్నారని, తరువాత తన ఇంటిపైనే పడతారని భయంతో వెనక్కి కూర్చునేసి కిటికీలోంచి ఆ గుంపుకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రాళ్ళు, ఇనుప రాడ్లతో సమాధానం చెప్పారు.

ఒక గుంపు అహ్మద్ షాపు షట్టర్‌ను పగులకొట్టారు. అందులోని నగదు దోచేసుకుని, మూడు మోటారు సైకిళ్ళను, బట్టలను తగులబెట్టారు. అహ్మద్ భార్య, కుమారుడు మిద్దె పైకెక్కి జరుగుతున్నదంతా నిస్సహాయంగా చూస్తుండిపోయారు. ఆ మూక మొదటి అంతస్థులోకి వెళ్ళి ట్రంకు పెట్టెలో ఉన్న అహ్మద్ కోడలి బంగారు నగలను దోచుకుని, ఫర్నిచర్‌నంతా రోడ్డుపైన వేసి తగులబెట్టింది. ఇదంతా జరుగుతున్నప్పుడే అహ్మద్ తన భార్యను పక్కమిద్దెపైకి దూకించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె దూకలేకపోతోంది. హిందువు అయిన ఆ ఇంటి యజమాని వెంటనే ఒక నిచ్చెన తీసుకొచ్చి ఆమె తేలికగా తన పైకప్పుపైకి దిగేలా సాయం చేశాడు. తరువాత తండ్రి, కొడుకు కూడా వారిని అనుసరించారు. అలా మరి కొన్ని మిద్దెల పైనుంచి దాటుకుని తమకు సమీప మిత్రులైన ఒక హిందూ కుంటుంబం ఇంట్లో తలదాచుకున్నారు.

‘మా గురించి ఎవరికీ తెలియకుండా ఉండడానికి తమ ఇంట్లోని లోపలి గదిలోకి మమ్మల్ని తీసుకెళ్ళి తాళం వేశారు. దాంతో మేం ఊపిరి పీల్చుకుని పెద్దగా ఏడ్చేశాం. వెంటనే టీ ఇచ్చి, మా భద్రతకు ఏం కావాలో అన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి అల్లరి మూక ఆగడాలు తగ్గాయి.అంతా నిశ్శబ్దం. కిటికీలోంచి చూశాను. కొందరు పోలీసులు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నారు’ అంటూ అహ్మద్ వివరించాడు. ఆ సమయంలో వారు బైటికి వచ్చారు. పోలీసులు వెళ్ళిపోయారు. ఒక గుంపు వారిని చుట్టుముట్టింది. అహ్మద్ వారికి చేతులు జోడించి వేడుకొన్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఏళ్ళతరబడి అహ్మద్‌కు తెలిసిన ఒక మనిషి ఆ గుంపు ముందుకొచ్చి వారికొక హెచ్చరిక చేశాడు. వారిలో ఎవరైన వీరికి అపకారం తలపెట్టినట్టయితే ఇక్కడే తాను ఆత్మాహుతి చేసుకుంటాను అని హెచ్చరించాడు. జరుగుతున్నదంతా గమనిస్తున్న హిందువులకు ఈ సంఘటన ఒక ధైర్యాన్నిచ్చింది. స్థానికులు అల్లరి గుంపు నుంచి బాధితులకు ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారు. వారి భద్రత మధ్య భగీరతి విహార్ నుంచి ముస్లింలు ఎక్కువగా నివసించే ముస్తఫాబాద్ ప్రాంతానికి అహ్మద్ కుటుంబం తలదాచుకోవడానికి తరలివెళ్ళింది.

ఆలస్యంగా పరిష్కారం
ఈ సంఘటన జరిగిన వారం తరువాత ఫిర్యాదు చేయడానికి అహ్మద్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఆస్తి నష్టానికి కూడా పరిహారం ప్రకటించింది. అయితే ఎవరైతే పోలీసు ఫిర్యాదు చేశారో వారే ఈ పరిహారానికి అర్హులని కూడా మెలిక పెట్టింది. అహ్మద్ రెండు పేజీల ఫిర్యాదులో తాను నష్టపోయిన ఆస్తి వివరాలతో పాటు ఆ గుంపులో తాను గుర్తుపట్టగలిగిన వారి పేర్లను కూడా పేర్కొన్నాడు. నిందితుల పేర్లు మినహాయించి ఒక్క పేజీలో ఫిర్యాదు రాసిమ్మని పోలీసులు కోరారు.

కానీ, అందుకు అహ్మద్ ఒప్పుకోలేదు. నిందితుల పేర్లు తరువాత జోడిస్తామని పోలీసులు చెప్పారు. ‘నేను పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నాను. నా వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి నాకు డబ్బు కావాలి. ఎవరి ప్రమేయం లేకుండానే ఈ హింస జరిగిందని నేను భావించాలన్నది వారి భావన.నిందితుల పేర్లను తరువాత జోడిస్తారన్న నమ్మకం ఏమిటి?’ అని అహ్మద్ ప్రశ్నించాడు. దాంతో అహ్మద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిందితుల పేర్లతో కూడిన అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఐదు రోజుల్లోగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ ఆదేశించడంతో ఆ ఆదేశాలపై ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.

వేరే మార్గం లేదు. పోలీసులు అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ను కలిపి ఆస్ మొహ్మద్ అనే వ్యక్తి ఫిర్యాదు పైన గోకల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లర్లు జరిగాయని సెక్షన్ 147, మారణాయుధాలతో దాడులు జరిగాయని సెక్షన్ 148 కింద, నివాస భవనాల్లో దొంగతనం జరిగిందని సెక్షన్ 380 కింద, 50 రూపాయల నష్టపరిచారని సెక్షన్ 427 కింద, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే అదే పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా కేసులలో అహ్మద్‌ను బాధితుడుగా కాకుండా సాక్షిగా మాత్రమే పోలీసులు తీసుకోవడం! ఫిబ్రవరి 24న జరిగిన హింసలో ఒక మతానికి చెందిన వారు గాయపడ్డారు, హత్యకు గురైన సంఘటనలో అహ్మద్ సాక్షిగా ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఆ రాత్రం తా అల్లర్లు, దోపిడీ, విధ్వంసం, పోకిరీ పనులు జరిగాయని, ముస్లింలుగా భావించిన వారిని కొట్టి చంపి భగీరతి విహార్ మురుగు కాల్వలోకి విసిరేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు 2020 నుంచి విచారణ జరుగుతుండగా, నగరంలోని వివిధ న్యాయస్థానాలలో రిజిస్టరైన కేసులకు అహ్మద్‌ను సాక్షిగా అతని అభిప్రాయాన్ని నమోదు చేయడానికి సమన్లు పంపుతున్నారు. చాలా సార్లు అహ్మద్ కోర్టుల దగ్గర వేచి ఉండడమే సరిపోతోంది. చిన్న పొరపాటని వాయిదా వేస్తూ వచ్చారు. ఇద్దరు న్యాయమూర్తులు మారారు. వారిలో ఒకరైన అదనపు సెషన్స్ జడ్జి వినోద్ యాదవ్ పోలీసుల బద్దకం పైన, అసమర్ధత పైన అనేక సార్లు మందలించారు. న్యాయమూర్తులకు పని భారం వల్ల ఒక కేసును తేల్చడానికి ఏళ్ళు పడుతోంది. అహ్మద్ మాత్రం నేరస్థులకు శిక్షపడేందుకు ఎంత కాలమైనా వేచి చూడాలన్న దీక్షతో ఉన్నాడు.

“నాకు సమన్లు ఎప్పుడొచ్చినా, కోర్టుకు హాజరువుతూనే ఉన్నాను. ఏదో ఒక రోజు న్యాయం జరగక పోదు” అని అహ్మద్ అంటాడు. తనకు పదిహేను లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని, కానీ, కేవలం రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిందని అహ్మద్ అంటున్నాడు. రుణాలు తీసుకుని తన వ్యాపారాన్ని పునరుద్ధరించాలని పాటు పడుతున్నాడు. మతం, జాతీయ వాదం అనే విషపూరిత పళ్ళ రసాలు తాగుతున్న ఆ పరిసరాలలోని కొత్త తరం దోచుకోవడానికి, చంపడానికి కూడా తగిన వారు. కనుక భగీరతి విహార్ వద్ద తన ఇంటిని అమ్మేసి ముస్తఫాబాద్ దగ్గర కొనాలనుకుంటున్నాడు.

రాఘవశర్మ, 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News