Friday, April 26, 2024

దళారులకు కాసులు కురిపిస్తున్న సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

LPG Cylinder black market in Hyderabad

నగరంలో జోరుగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ దందా
చిరు వ్యాపారులకు గుట్టుగా డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాలు
స్దానిక ఏజెన్సీల సహాయంతో రెచ్చిపోతున్న దగాకోరులు
రూ. 1500లకు దర్జాగా అమ్మకాలు చేస్తున్న పరిస్థితులు

హైదరాబాద్: నగరంలో డొమెస్టిక్ సిలిండర్లు దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. గత మూడు నెలల నుంచి కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో గృహా వినియోగదారుల వినియోగించే సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌కు దర్జాగా తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని కూడళ్లలో నిర్వహించే టిఫిన్, టీ సెంటర్ నిర్వహకులు, చిరు హోటళ్లులకు గుట్టు చప్పుడుగా సరఫరా చేస్తున్నారు. గృహ అవసరాలకు సిలిండర్లు బుకింగ్ చేస్తే ఆలస్యంగా ఇస్తూ గ్యాస్ స్టాక్ తగ్గిందని వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిబ్బంది తప్పుడు సమాధానం చెబుతూ దళారులతో చేతులు కలిపి అక్రమ సంపాదన కూడబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ 14.5 కెజీల సిలిండర్ ధర రూ. 952 ఉండగా, రవాణ చార్జీతో కలిసి రూ. 980 ఇస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో రూ. 1500 వరకు విక్రయాలు చేస్తున్నారు.

మరికొందరు వ్యాపారులు ఎల్పీజీ డీలర్లతో కుమ్మకై అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అదే కాకుండా వాహనాల్లో ఉండే సిలిండర్ల సైతం రీపిల్లింగ్ చేస్తున్నట్లు, గ్యాస్ ధరల పెంపు అక్రమార్కులకు వరంగా మారిందని స్దానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ నగరంలో 135 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, వీటిలో 28. 25లక్షల కనెక్షన్లులు ఉండగా, నిత్యం 1.10లక్షల వరకు సరఫరా చేస్తున్నారు. అక్రమ దందా ఎక్కువగా హాయత్‌నగర్, కాటేదాన్, మల్లాపూర్,నాచారం, ఉప్పల్, మలక్‌పేట,బండ్లగూడ, వనస్దలిపురం వంటి ఏరియాలో పౌరసరఫరాల అధికారుల తనిఖీల్లో బయటపడగా అక్రమ రీపిల్లింగ్ చేసే పలువురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జూలై నుంచి 160 ప్రాంతాల్లో దాడులు చేసి 61 మందిపై కేసులు నమోదు చేసి సుమారుగా 150 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

స్దానిక ప్రజలు గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా నియంత్రించాల్సిన పౌరసరఫరాల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. గృహ యాజమానులకు సరఫరా చేసే సిలిండర్లకు రూ.60నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రవాణా ఖర్చులు పెరిగాయని,దీంతో తాము కూడా అధికంగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్రమంగా వంటగ్యాస్ సిలిండర్లను బహిరంగా విక్రయాలు చేసే ముఠాలపై నియంత్రించాలని, అదే విధంగా గ్యాస్ డీలర్లు పంపిణీపై అధికారులు తనిఖీలు చేయాలని నగర ప్రజలు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News