Thursday, April 25, 2024

జాంబవ సామాజిక తాత్విక చిత్రపటం మాదిగ కొలుపు

- Advertisement -
- Advertisement -

Madiga history in telugu

స్వాతంత్య్రానికి పూర్వము ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల ’మాలపల్లి’ మొదటి దళిత నవలగా వచ్చింది. పేరుకు మాలపల్లి గానీ వస్తువంతా బ్రా హ్మణ పర్యావరణము, ఆచార వ్యవహారాలు, సంస్కృతి చుట్టూ తిరిగిందనే విమర్శలున్నాయి. అట్లనే దండోరా ఉద్యమ కాలంలో (1998) పి. నరస య్య ’మాదిగ పల్లె’ నవలను వెలువరించాడు. ‘మాదిగ పల్లె’ పేరుతో మా లల దృష్టికోణంగా నవల రాయబడిందనీ, కథానాయకుడు మాల, మాల వస్తుకథనం మాలల కుటుంబజీవితమ్, వారి వీరత్వాలు సాహసాలు తప్ప ఈ నవల్లో మాదిగల సంస్కృతి నాయకత్వాలు పోరాటపటిమలు, జీవన సంఘర్షణలు కనిపించవు అనే వ్యతిరేకతలు నిరసనలు వచ్చినయ్. మాది గ పదంతో దళితేతర రచయిత రాసిన మొదటి నవల ‘మాదిగ కొలుపు‘.
పులికొండ సుబ్బాచారి ’మాదిగ కొలుపు’ నవలా రచన కొంత ప్రత్యేకమని చెప్పాలి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాత్త్విక చింతన కలిగిన రచయితగా బహుజన దృక్పథాల పట్ల సానుకూల వైఖరిగా అతని రచనా వ్యాసంగాలు కనిపిస్తుంటాయి. ఈ నవల పూర్తిగా మాదిగ సమాజము, మాదిగ సేవలు, మాననీయత, సంఘర్షణలు, అంటరానితనం, వూరు అధిపత్య కులాలు చేసే గారడీలు, లైంగికదోపిడీ, పేదరికమ్, చుట్టూతా తిరుగుతుంది. దళితేతర రచయితగా మాదిగ జీవితానుభవం లేకున్నా శాస్త్రీయ పరిశీలనగా ఆకళింపు చేసుకొని రాసిన గొప్ప మాదిగ నవల ’మాదిగ కొలుపు’. వూరి ముఖ చిత్రం మాదిగల సామాజిక వివక్షతల ముఖచిత్రం యీ నవల.
దళితేతరులు, మాదిగేతరులు, రాసిన ‘మాలపల్లి’, ‘మాదిగపల్లి’ వంటి అనేకరచనలతో బాధితుల పక్షాన సరియైన న్యాయం జరగనుందువల్లనే బాధితుల జీవనంలోని లోతులు యితరులు సృష్టించలేదు. ఎవరి జీవిత సమస్యలు వాళ్ళే రాసుకోవాలి యితరులు రాయడం వల్ల సాహిత్య సామాజిక ప్రయోజనాలు నెరవేరవు అనే చర్చలు వచ్చినయ్. కానీబాధితుల పక్షాన ప్రగతిశీల రచయితలు రచయిత్రులు బాధిత కులాల సామాజిక ప్రయోజనం కోసం రాయాల్సిన అవసరం ఉంది. బాధిత కులాలు తమ సామాజికాంశాలు, సమస్యలు, జీవితానుభవాలు విస్తృతంగా రాసుకోవాలి. కుల వ్యవస్థలో సాహిత్యాలు వెళ్ళని మట్టి పొరలు అనేకం ఉన్నాయి. ఆ జీవితాలన్నీ సాహిత్య గౌరవాలు పొందాల్సి ఉంది. నవల చదువుతుంటే రచయిత వడ్రంగిగా మాదిగింటికి పోయి దర్వాజ నిల్సుండబెట్టినట్టుగా ’మాదిగ కొలుపు’ను అమర్చినట్లున్నది.
దండోర ఉద్యమం మాదిగ పదాన్ని ఆత్మగౌరవ చిహ్నంగా మార్చింది. ఉద్యమానికంటే ముందు మాదిగేతరులు మాదిగ పదంతో తెచ్చిన సాహిత్యం ఒకటి అరానే. చలం ’మాదిగమ్మాయి’ పేరుతో రాసిన కథలో మాదిగ శబ్దం మచ్చుకు కూడా కానరాదు. అంటరాని కులాలలో పంపక న్యాయాలు సమానంగా జరగాలనే సామాజిక న్యాయం కోసం వచ్చిన మాదిగ దండోరా ఉద్యమం (1994) తర్వాతనే మాదిగ చైతన్యంతో పాట, కవిత్వము, కథ, నవలగా బలమైన మాదిగ సాహిత్యమ్ వస్తున్నది.
మాదిగ కొలుపు నవలా వస్తువు కాలమానం 1960-69ల నాటిదైనా యీనాటి చైతన్యాల అల్లికగా రచయిత ఒడుపుగా దృశ్యీకరించారు. లడ్డుమీద జీడిపప్పు లాగా ఆకర్షణగా ఒక పేరు పెట్టి అధిపత్య కులాల జీవన సంస్కృతి, వారి కుటుంబాలు పర్యావరణంగా విస్తరించే రచన కాకుండా, ఈ రచయిత నిజాయితీగా ’మాదిగ కొలుపు’ నవల లో మాదిగ పర్యావరణము, జీవితాలు, సంఘర్షణలు, మాదిగ మహిళలు వారి ప్రశ్నలు, గొప్పతనాలు, వూరి అధిపత్యకులాల మోసాలు ఎలా వ్యవస్థీకరించి చేస్తారో సుబ్బాచారి చిత్రీకరించారు.
మాదిగ దండోరా ఉద్యమ చైతన్యంతో ఎస్సీలు కాని వారు కూడా మాదిగ పదాన్ని సాహిత్యీకరించడం ఇప్పుడిప్పడే మొదలైందనడానికి తార్కాణమ్ పులికొండ సుబ్బాచారి ’మాదిగ కొలుపు’. యీ నవల ఖమ్మం, మధిర, మర్లపోలు ఆవరణగా ప్రధానంగా మర్లపోలు గ్రామం భూమికగా నడుస్తుంది. కథానాయకుడు వేల్పుల హనుమంతు అంకమ్మ కొలుపుల కోసం వేసే డప్పు చాటింపుతో మొదలౌతుంది. హనుమంతు మర్లపోలు గ్రామానికి పెద్దమాదిగ. నీతి నిక్కచ్చితనమున్న మాదిగ. కానీ వూరి వాల్లు ఎవరూ (ఒక్క ఆచారి వాల్లు తప్ప) హనుమంతు అని పేరు పెట్టి పిలవరు. అనింగాడు, అనవాయ్, గూడెమ్ వాల్లు అనవన్న అని పిలుస్తుంటారు. వూరికి డప్పులు కొట్టి చెప్పులు చేసే హనుమంతు, కొలిమి తిత్తులు, రైతు అంకెనమొలకు, వార్లు, తొండాలు, తాళ్ళు తలుగులు చేసి, వూరి కొలుపులలో ఒక్కవేటుకు దున్నను నరికే పెద్దమాదిగ, వూరంతా పొలాలలో పొలి చల్లే పెద్దమాదిగ హనుమంతు కులం, కుటుంబం చుట్టూ తిరిగిన కథనమ్ మాదిగ కొలుపు. పెద్దమాదిగ వేల్పుల హనుమంతు సర్పంచిగా ఎదగడమ్ వూరి కుల కుట్రరాజకీయాల్లో పెద్దకొడుకు కాటయ్య హత్యకు గురైన విషాదాలు, కొలుపులో దున్న ఒక్క వేటుకు తెగలేదని వూరి ఆసామి కొట్టే దెబ్బలు, తిట్లు అవమానాలు, గొడ్డు గోదా చస్తే కొమ్ములోళ్ళు మంత్రాలు వేసిండ్రని ఆసాములు వారిని కట్టేసి కొట్టే దుర్మార్గాలు, వీటన్నింటిని హనుమంతు ఆత్మగౌరవంతో ఎదుర్కొన్న సవాళ్ళు, వూరి ఆడ, మగ ఆసామలు గూడెం మాదిగ ఆడ, మగ వాల్ల మీద చేసే లైంగిక దాష్టీకాలు, దాడులు, వేధింపులు, వాటి పర్యవసానహత్యలు, మాదిగలకు సారా అలవాటు చేసి వారి కుంట, సెంటు భూముల్ని అప్పుల కింద సెల్లేసుకునే ఆసాముల భూకబ్జాలు, సర్పంచి హనుమంతు, పటేలు ఆసాములతో సరిసమానంగా చాపమీద కూర్చొని జాంబపురాణం చూసే మార్పులు, హనుమంతు చిన్న కొడుకు కోటేశ్వరరావు వూరి లోని కొద్దిమంది సహకారంతో ఉన్నత చదువులు చదువుకొని డిప్యూటీ కలెక్టర్ స్థాయికి (ఎదగడం), అదే వూరి ఆసాముల కులం బిడ్డ, అభ్యుదయ వాది అన్నపూర్ణను రిజిస్టర్ వివాహం చేసుకొని గూడేనికి వచ్చి మాదిగ సంప్రదాయబద్ధంగా పెండ్లి చేసుకోవడం, వూరికి కలెక్టర్ ఎస్పీలు వచ్చి సన్మానించడం, కాటయ్యను చంపిన హంతకులకు జిల్లా కోర్టులో శిక్షపడడం, వూరి ఆసాములు యీ యేడు జరిగింది ‘అంకమ్మ కొలుపు’ లాగా లేదు ‘మాదిగ కొలుపు’లాగా వుందని భగభగ వుడుక్కుంటుంటే… ‘మీ పెద్దకులాలు మాకు చేసిన అన్నాయానికి యింకో పది తరాలు మాదిగలకు కొలుపు చేసినా మీ పాపాలు పోవండీ’ సమాధానము యీ నవలకు ఆయువుపట్టు.
కులపురాణాలు, ఆశ్రిత కులవ్యవస్థ, ఆదిజాంబవ మహాపురాణం పై పరిశోధన చేసిన రచయితగా, ‘మాదిగ కొలుపులులోని కథానాయుకుడు హనుమంతు చేతిలో మాదిగ కొలుపులోని కథానాయకుడు హనుమంతు ఆదిజాంబవుని అంశగా కొనసాగింపుగా రేఖామాత్ర పటం గడ్తాడు. ఆదిజాంబవుడు సమాజ సబ్బండ వృత్తులకోసం అభివృద్ధికోసం తన కొడుకును (డక్కలి) త్యాగం చేసి కొడుకు అవయవాల్ని ఆతారెలుగా (పనిముట్లుగా) చేసి ముందుగా విశ్వకర్మలకు ఇచ్చి సమాజానికి ఆదర్శంగా నిలిచిన వీరుడనీ కొడుకు ఎదుర్రొమ్మును, దాకలికోసం, చేతులు పట్టుకారులుగా వూపిరితిత్తుల్ని కొలిమి తిత్తులుగా చేసిన గొప్ప సామాజిక సాహసవంతుడని ఆదిజాంబవ పురాణమ్ చెబుతుంది. (యిది నిజమా, నమ్మాలా అని యీసడించేవారు, హిందూ పురాణాల్ని నిజమని నమ్మితే జాంబపురాణాన్ని కూడా నమ్మాలంటాడు రచయిత). యిట్లాంటి త్యాగగుణం, గొప్పగుణం, ఆదర్శగుణం, ఆత్మగౌరవాలు, సాహసాలు కొనసాగుతున్నాయని మాదిగ్గూడెమ్, మాదిగ పెద్ద హనుమంతు, కాటయ్య, ఎర్రోడు, కోటేశ్వరరావులలో కనిపిస్తయ్. ఆదిజాంబవుడు సమస్త వృత్తుల కోసం ప్రతిఫలం ఆశించకుండా త్యాగీకరించినట్లు హనుమంతు కూడా వూరికోసం
డప్పుకొడతాడు, చెప్పులు చేస్తాడు వూరి వారికి వృత్తిపనులు అన్నీ చేస్తాడు. (ఇది వ్యాపార పరంగా జరగదు. వెట్టిగానే, మాదిక్కు దీన్ని తేగమ్ లేక త్యాగం అంటరు). యింకా హనుమంతు కాటయ్య వూరి ఆసాముల దౌర్జన్యాలను ఎదిరించినందుకు, మంచికోసం నిలబడినందుకు వూరి పెద్దల చేత హత్య చేయబడతాడు. యిది లీలగా జాంబవుడి కథనే స్ఫురణకు తెస్తుంది. ఈ నవల్లో మాదిగ వాళ్ళని అవమానంగా పిలవడాన్ని వూరి చిన్నపిల్లలు కూడా మాదిగ పెద్దవాళ్ళని రారా పోరా, యేమే, యేందే అనడమ్మీద చాలా నిర్దిష్టంగా చాలా సందర్భాలలో వ్యతిరేకతలు తెలియజేయం జరిగింది. హనుమంతు పేరును అనింగా, అవవాయ్, కాటయ్యను కాటిగా, కాటాయ్, నారాయణను నారిగా, కోటేశ్వరరావును కోటిగాడు, పేరమ్మను పేరీ అనడాన్ని తప్పుబట్టి అదే తప్పురు చేయడం అక్కడక్కడా కనిపిస్తుంటుంది. గ్రామాలు కులవ్యవస్థను ప్రత్యక్షమైన వ్యవస్థీకృతంగా అమలు జరుగుతాయంటే యిక్కడ మనుషులకు కులంపేర్లతో కూడిన పేర్లుంటయి. విపరీతమైన హెచ్చుతగ్గులు, మానవగౌరవాలు, అగౌరవాలు, అమానుషత్వాలు కులాన్ని బట్టే వుంటాయి. అట్లా అంటరాని కులాల్ని గౌరవమైన పేర్లతో పిలవకుండా వారిని న్యూనతకు గురిచేస్తారు.
అమ్మోరి కొలుపులంటే దున్నపోతును బలియ్యాల్సిందే, గొర్లను గావు యియ్యాల్సిందే. దున్నను బలిష్టుడైన మాదిగ చేత నరికించి, గొర్లను బైండ్లవాల్ల చేత గావు బట్టిస్తరు. అతని చేతనే అన్నంలో దున్న రక్తం కలిపించి ఆసాములు తమ పొలాల్లో పొలిమేరల్లో పొలి చల్లితే గానీ కొలుపులు సంపూర్ణంగావు వారి నమ్మకంలో. కానీ ఇది కేవలం నమ్మకంగా తీసిపారెయ్యడానికి లేదు. పేరుకు దున్న రక్తమే అయినా అది మాదిగ బలాఢ్యుని సింబలైజ్ చేసిన అధిపత్య హిందూ సంతృప్తులు. దున్నబలితో చావుతో వూరు పొలాలు సుభిక్షంగా, సుసంపన్నంగా కులాలు మొక్కబోకుండా, చెక్కు చెదరకుండా వర్థిల్లుతుంటాయనే ఆలోచన అధిపత్యకులాలు అంటరాని వాళ్ళను చంపే సాంస్కృతిక కుట్ర. మాదిగను చంపడంలో వూరి ఆడమగకు తేడా కనపడదు. యిది యిద్దరూ కలిసి చేస్తున్న సాంస్కృతిక హననమ్. బలి పొలి తతంగమంతా హనుమంతుచే జరిపించబడింది.
యీ అంశాన్ని నవల్లో పెద్దమ్మకతగా కొమ్ములతనితో రేఖామాత్రంగా చెప్పినా, అమ్మోరి పురాగాథలు రోజువారీ గాథలుగా జరుగుతూనే ఉన్నాయనేది వాస్తవమ్. మాదిగ కొలుపు నవలలో కూడా వూరి ఆసామి దొరసాండ్లు గూడెమ్ మగవాండ్లని లైంగికంగా లోబర్చుకోవడం మోజు తీరినంక వారి బతుకులను బుగ్గిపాలు చేయడం పెద్దఓబులయ్య భార్య సుశీల మాదిగ నారాయణల ఘటన తెలుపుతుంది. వూరి ఆసామి పెదఓబులేసు భార్య సుశీల, తమ యింటి పాలేరు కొత్తగా పెళ్ళయిన మాదిగ యువకుడు నారిగాడని పిలిచే నారాయణ మీద మనసుపడి లొంగదీసుకొని అతన్ని తీసుకొనివూరిడిసి పోతది. తర్వాత సుశీల నాలుగు నెలలకు భర్త దగ్గరికి వచ్చి సజావుగా కాపురం చేస్కుంటది. నారాయణ మాత్రం హత్యచేయబడతాడు. అతని భార్య కుటుంబం అన్యాయమై పోతారు. యీనాడు జరుగుతున్న కులహత్యలకు పునాదుల పురాగాథలు అమ్మోరి నవరాత్రులలో కొలుపులలో దున్నను నరకడంగా ఉన్నాయనే లింకు అర్థం అయినంక నిద్రపోలేని అలజడికి నెట్టబడిన పఠనానుభవం కలిగించిన రచన యిది.

ప్రముఖ దళిత కవయిత్రి
జూపాక సుభద్ర
సమీక్షా వ్యాసంలోని కొంత భాగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News