Tuesday, April 23, 2024

మోడీ సర్కార్‌పై ఖర్గే మండిపాటు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డి ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ పార్టీపై భారీ జరిమానాలను విధించిందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలలో ప్రతి రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు ఉండాలని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశింంచినప్పటికీ ఎన్నికల బాండ్ల ద్వారా వేల కోట్లను విరాళాల రూపంలో పుచ్చుకున్న బిజెపి వాటి వివరాలను మాత్రం వెల్లడించడానికి సిద్ధంగా లేదని ఖర్గే విమర్శించారు. తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఐటి శాఖ ద్వారా స్తంభింపచేసి భారీ జరిమానాలను విధించిందని ఆయన ఆరోపించారు. ప్రజలు విరాళంగా ఇచ్చిన తమ పార్టీ నిధులను బిజెపి ప్రభుత్వం స్తంభింపచేసిందని, ప్రస్తుతం ఖర్చు చేయడానికి తమ వద్ద నిధులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ దొంగతనం, తమ తుప్పుడు పనులు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి జూలై వరకు సమయం కోరుతున్నారని ఆయన బిజెపిపై ఆరోపణలు గుప్పించారు.

గుజరాత్‌లో ఒక క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోడీ తన పేరునే పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఎవరైనా మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థం వారి పేర్లను పెడతారని, కాని ఒక మనిషి బతికున్నపుడే తన పేర్లను వేటికీ పెట్టుకోడని ఖర్గే వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలలో తాను ఓడిపోయిన కలబురగి(గుల్బర్గా) నియోజకవర్గం ప్రజలు రానున్న ఎన్నికలలో తమ తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారని, రానున్న ఎన్నికలలో కలబురగి(గుల్బర్గా)లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఉమేష్ జాదవ్ చేతిలో 95,452 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో ఖర్గేకు ఇదే తొలి ఓటమి. జాతీయ స్థాయిలో పార్టీని నడుపుతూ ప్రతిపక్ష ఇండియా కూటమిని సమన్యయపరుస్తున్న ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆయనకు బదులుగా ఆయన అల్లుడు, ప్రముఖ విద్యా సంస్థల యజమాని, వ్యాపారవేత్త రాధాకృష్ణ దొడ్డమణి కలబురగి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.

బిజెపి నేతలను మోసగాళ్లుగా అభివర్ణించిన ఖర్గే మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అంబేద్కర్ చెప్పారని, రాజ్యాంగమే లేకపోతే దేశంలో స్వేచ్ఛ, ఐక్యత ఎక్కడ ఉంటాయని ఆయన ప్రశ్నించారు. మళ్లీ దేశం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని, ఇక మళ్లీ దేశం కోలుకునే పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు. బిజెపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని, ప్రజలంతా దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ బిజెపి ఎంపి అనంతకుమార్ చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అల్లాటప్పాగా రాలేదని, దాని వెనుక ఎంతో మంది త్యాగాలు ఉన్నాయని ఖర్గే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News