Monday, April 29, 2024

గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

- Advertisement -
- Advertisement -

గెరిల్లా యుద్ధ వ్యూహకర్తగా దిట్ట
జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు సంతాప సభలు
59 ఏళ్లు పాటు అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు కార్యకలాపాలు

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. . మే 31వ తేదీన మధ్యా హ్నం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేశారు. కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీ. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఆయన ఉద్యమంలోకి వెళ్లారు. ఈ మేరకు సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టులకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. కటకం సుదర్శన్ చాలా కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో పాటు డయాబెటిస్, బిపి సమస్యలతో సతమతమవుతున్నారని తెలుస్తోంది. గత బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండె పోటుకు గురై ఆయన మరణించినట్లు ప్రకటించారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించినట్లు సమాచారం.

అనంతరం విప్లవ సంప్రదాయాలతో కటకం సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ వెల్లడించారు. జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో 69 ఏళ్ల క్రితం జన్మించారు కటకం సుదర్శన్.. యుక్త వయస్సులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో కటకం సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా సుదర్శన్ పని చేశారు. అదే సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కీలక పాత్ర పోషించారు. 1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయస్టు పార్టీ ఆర్గనై జర్ గా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

1980 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం సుదర్శన్ ప్రాతినిధ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషన్ జోనల్ కార్యదర్శిగా సుదర్శన్ పని చేశారు. 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 వరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి కటకం సుదర్శన్ తప్పుకున్నారు. మావోయిస్టు భావాలానికి ప్రభావితం అయ్యాక దాదాపు 59 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. ఉత్తర తెలంగాణ-ఛత్తీస్ గఢ్ మధ్య విస్తరించిన దండకారణ్యాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని కార్యకలాపాలను సాగించారు. కటకం సుదర్శన్ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ 2018లో మృతి చెందారు. ఆయన భార్య సాధన ఇది వరకే పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. సాధన కూడా మావోయిస్టు ఉద్యమం నుంచి వచ్చిన వారే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావో యిస్టు కార్యదర్శిగా పని చేశారు. కటకం సుదర్శన్ తో పాటు సాధన కూడా సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో పని చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిశారు.

మెరుపుదాడుల నిర్వహణలో సుదర్శన్ దిట్ట

మెరుపు దాడుల నిర్వహణలో సుదర్శన్ దిట్ట. సుదర్శన్ మృతి మావోయిస్టు పార్టీకి తీరనిలోటు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 2011లో దంతెవాడ మారణకాండలో కటకం సుదర్శన్ మాస్టర్ మైండ్ గా భద్రతా దళాలు అనుమానించాయి. దంతె వాడలో మావోలు జరిపిన దాడిలో 70 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు. గెరిల్లా యుద్ధ వ్యూహకర్తగా కటకం సుదర్శన్ ప్రసిద్ది.

మంచిర్యాల జిల్లాకు చెందిన కటకం సుదర్శన్ 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరారు. పీపుల్స్ వార్ లో చేరడానికి ముందు కటకం సుదర్శన్ వరంగల్ పాలిటెక్నిక్ విద్యనభ్యసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పాటు ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలోని ఆదీవాసీలు నివసించే ప్రాంతం వరకు మావోయిస్టు ఉద్యమ విస్తరణలో సుదర్శన్ పాత్ర కీలకమైంది. ఎన్నోసార్లు పోలీసుల ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దర్భాఘాటిలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో 27 మంది మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారి కటకం సుదర్శనే.ఆయనపై కోటి రూపాయల రివార్డ్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News