Wednesday, May 15, 2024

బతుకు పట్టాలు తప్పిన ఓ కూలీ కుటుంబం

- Advertisement -
- Advertisement -

బరూయిపూర్ : ఒడిషా రైలు ప్రమాదం రైల్వే చరిత్రలో కీలక విషాద మైలురాయి అయింది. ఇదే దశలో కొన్ని కుటుంబాలలో చెరిగిపోలేని చేదు ఘట్టాలను సృష్టించింది. పట్టాలు తప్పిన రైళ్లు చివరికి పలు కుటుంబాలను పట్టాలు తప్పేలా చేసింది. పశ్చిమ బెంగాల్ 24 పరగణా జిల్లాకు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు సోదరులు ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయ్యారు. తమ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ముగ్గురు సోదరులు మృతి చెందారని బసంతి ఉత్తర్‌లోని ఛరనికలి గ్రామాంలో ఉండే కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కుటుంబానికి చెందిన సోదరులు హరన్ గయెన్ (40), నిశికాంత్ గయెన్ (32), దివాకర్ గయెన్ (32) అప్పుడప్పుడు తమిళనాడులో ఉపాధి పనులకు వెళ్లి వస్తుంటారు. అయితే ఘోర ప్రమాదపు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో వీరి ప్రయాణం వీరికి తుది ప్రయాణం అయింది. వీరు మృత్యువాత పడ్డారు.

ఇటీవలే గ్రామానికి వచ్చి తిరిగి తమిళనాడుకు రైలులో వెళ్లుతుండగా జరిగిన ప్రమాదం వీరిపైనే ఆధారపడి ఉండే వీరి కుటుంబాన్ని ఇప్పుడు రోడ్డు పాలుచేసింది. రైతు కూలీలుగా వీరు పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా నిలిచారు. వీరు మృతి చెందారనే వార్త తెలియగానే గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. వీరి భార్యలు ఇక తమ బతుకులు అగాథం అనే తలంపు రాగానే కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరు ముగ్గురు తమ మగవారు చనిపోయ్యారని తెలియగానే కుప్పకూలారు. చాలా సేపటివరకూ తేరుకోలేకపొయ్యారు. ఇరుగుపొరుగు వచ్చి వీరిని సముదాయిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోవాలని చెపుతున్నారు. చనిపోయిన సోదరులలో హరన్ భార్య అనాజిత మానసిక రోగి, ఇప్పుడు ఆమె వ్యాధికి చికిత్స చేయించే వారు ఎవరనేది ప్రశ్న అయింది. ఆయనకు పెళ్లయిన ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు ఇటీవలే ఓ హోటల్‌లో పనికి కుదిరారు.

మరో సోదరుడు నిషికాంత్‌కు భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. దివాకర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మా వాళ్లు చనిపొయ్యారని, తమ పరిస్థితి దిక్కుతోచని విధంగా మారిందని హరన్ కుమారుడు అవిజిత్ తెలిపారు. 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది ఇటీవలి రైలు ప్రమాదంలో చనిపొయ్యారు. శుక్రవారం సాయంత్రం తరువాత జరిగిన రైలు ప్రమాదం పలు రాష్ట్రాలకు చెందిన వివిధ స్థాయిల జీవనస్థితిగతుల కుటుంబాల్లో కలకాలం నిలిచే చీకటి మిగిల్చింది. ఈ జిల్లాకే చెందిన 44 మంది జాడ తెలియడం లేదు. కొందరు సురక్షితంగా తమ జిల్లాకు చేరుకున్నారు. కాని రాని వారు, చనిపోయిన వారి కుటుంబాలకు కాలం కాలకూట విషపు దెబ్బను మిగిల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News