Saturday, July 27, 2024

పదిలం.. పెళ్లి పుస్తకం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: వేదమంత్రోచ్చారణల మధ్య, పెద్దల ఆశీర్వాదాలతో జరిగే వివాహ వేడుక వెనుక ఎన్నోధర్మసూక్ష్మాలు ఇమిడి ఉంటాయి. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా… అంటూ వధువు మెడలో వరుడు కట్టే మంగళసూత్రానికీ ఒక పవిత్రత ఉంది. పాణిగ్రహణం, కన్యాదానం, సప్తపది వంటి వివిధ ఘట్టాలకు మన వివాహ వ్యవస్థ ఎన్నో పరమార్థాలు చెబుతుంది. ఏడడుగుల బంధం ఏడేడు జన్మల బంధంగా మారాలన్న ఉద్దేశంతో నిర్వహించే వివాహ క్రతువును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఆమాటకొస్తే ప్రతి మతంలోనూ వివాహానికి ప్రాముఖ్యత ఉంటుంది. దైవసన్నిధిలో వధూవరులను ఒకటిగా చేసి, వారిద్దరూ కలకాలం సుఖ సంతోషాలతో సంసార జీవనం కొనసాగించాలంటూ పెద్దలందరూ మనసారా ఆకాంక్షించడం కద్దు. అయితే మారుతున్న కాలంతోపాటే వివాహ వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి.

పెళ్లి వెనకాల ఉన్న పరమార్థం తెరమరుగై, ఆర్భాటానికి చిహ్నంగా, అట్టహాసానికి ప్రతీకగా వివాహం ఒక తంతుగా మారుతోంది. భార్యాభర్తలు కలసిమెలసి సంసార జీవనం కొనసాగించాలనీ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శవంతమైన దాంపత్య జీవనం గడపాలని హితవు చెప్పేవారు తక్కువైపోయారు. ఫలితంగా నూరేళ్లు కలసి కాపురం చేయవలసిన జంటల మధ్య సఖ్యత కరవై, పట్టుమని పదినెలలైనా గడవకముందే విడాకుల కోసం కోర్టులకు ఎక్కుతున్న దాఖలాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వరకట్నం వేధింపుల కేసులో తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఎన్నదగినవి, తూచ తప్పకుండా ఆచరించదగినవి. భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కోర్టుకు ఎక్కిన పంజాబ్‌కు చెందిన ఓ మహిళకు చిన్నపాటి దాంపత్య సమస్యల కారణంగా అలిగి విడాకులు తీసుకోవడం వల్ల నష్టపోయేది తమ పిల్లలేనన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలు కోవాలని, పరస్పర గౌరవం, సహనం, సర్దుబాట్లతో వివాహ బంధం పునాదులను పటిష్టం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. పనిలోపనిగా, ఓ గృహిణి ఫిర్యాదు చేయగానే గృహ హింస చట్టం కింద యాంత్రికం గా కేసు కట్టడం తగదంటూ పోలీసులకూ చీవాట్లు పెట్టింది.

అంతేకాదు, త్వరలో అమలులోకి వచ్చే భారతీయ న్యాయ సంహితలోని 85, 86 సెక్షన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటిని సంస్కరించవలసిన ఆవశ్యకతను ప్రభుత్వానికి విడమరచి చెప్పింది. ఈ రెండు సెక్షన్లూ ప్రస్తుతం అమలులో ఉన్న ఐపిసిలోని 498ఎ సెక్షన్‌ను పోలి ఉన్నవేనని స్పష్టం చేసిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం, గృహహింస చట్టాన్ని ఆసరా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నవారి ఆటలు కట్టించేందుకు వీటిలో మార్పులు చేర్పులూ చేయాలని సూచించింది. నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే సమాజంలో మంచీ చెడూ రెండూ ఒకదానిపక్కనే ఒకటి ఉంటాయి. మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన గృహహింస చట్టమూ ఇటువంటిదే. ఈ చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని భర్తలపైనా, అత్తమామలపైనా కేసులు బనాయిస్తున్న మహిళామణులు లేకపోలేదు.

తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసిన కేసు కూడా ఈ బాపతుదే. ఓ మహిళ వచ్చి ఫిర్యాదు చేయగానే, ముందూ వెనకా చూడకుండా భర్తపైనా, వీలైతే ఆమె అత్తామామలపైనా కేసు పెట్టి, కోర్టుకు ఈడుస్తున్న పోలీసులు కేసులోని నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ సదరు మహిళ భర్త కోరితే పంజాబ్ హర్యానా కోర్టు ససేమిరా అనడంతోనే ఆ అమాయకుడు సుప్రీం కోర్టు గడప తొక్కవలసి వచ్చింది. దీనిని బట్టి చూస్తే, కోర్టులు సైతం ఇలాంటి కేసులను నిశితంగా పరిశీలించవలసిన ఆవశ్యకత కనబడుతోంది. సదరు మహిళ చేసిన ఆరోపణలు సాదాసీదాగా ఉన్నాయని, భర్త క్రూరత్వాన్ని నిరూపించే ఆధారాలను ఒక్కటి కూడా చూపించలేకపోయిందంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కింది కోర్టుకు కనువిప్పు కావాలి.

అన్నింటికీమించి, సుప్రీం కోర్టు తీర్పు… జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాల ప్రామాణికతను ప్రశ్నిస్తోంది. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయ సంహితలో ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర హోం మంత్రి పలు సందర్భాల్లో చెప్పినా, లోటుపాట్లు ఉన్నాయనడానికి తాజా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు నిదర్శనం. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు ఐపిసి చట్టాల పేర్లు మార్చి, చిన్నాచితకా మార్పులు చేసి హడావిడిగా అమలు చేసి జబ్బలు చరచుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. చట్టాల్లోని లొసుగులను పరిహరించి, పటిష్ఠంగా అమలు పరిచినప్పుడే ప్రజలకు శ్రీరామరక్ష!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News