Saturday, April 20, 2024

నేటినుంచే మేడారం

- Advertisement -
- Advertisement -

Medaram Jatara is set to begin today

నేడు సారలమ్మ ఆగమనం, గద్దె వద్దకు జంపన్న, మేడారం దారిలో పగిడిద్దరాజు, కొత్తూరు నుంచి మేడారం వరకు ట్రాఫిక్ జామ్, సిఎం కెసిఆర్ బస కోసం ప్రత్యేక కంటైనర్

మన తెలంగాణ/గంగారం : ఆసియా ఖండంలో అతిపెద్ద మహా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర బుధవారం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా సమ్మక్కసారలమ్మలు గద్దెలపై కొలువుతీరనున్నారు. పగిడిద్దరాజు వచ్చాక.. కోయ పూజారులు జరిపే ఎదుర్కొళ్ల అనంతరం కన్నెపల్లి నుంచి వచ్చే సారలమ్మ ఉదయం 9.30 గంటల సమయంలో గద్దెపైకి చేరుకుంటారు. దీంతో మహా జాతర ప్రారంభమవుతుంది. కాగా, గురువారం ఉదయం 10.30గంటల సమయంలో చిలకలగుట్ట నుంచి సమక్కను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ సందర్భంగా కోయ పూజారుల పూజల అనంతరం మంత్రి సతవతి రాధోడ్, కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా, జంపన్నను మంగళవారం పూజారులు ప్రభుత్వ ఏర్పాట్ల నడుమ భారీ బందోబస్తుతో గద్దెపైకి తీసుకువచ్చారు.

రెండేళ్లకోసారి జరిగే వన జాతరలో సమ్మక్క, సారక్కలను గద్దెలపై చేర్చే విషయంలో కోయ పూజారులతో ప్రధాన భూమిక. వన దేవతలైన వీరిని చెంతకు చేర్చే ప్రతినిధులుగా కోయ పూజారులు భక్తజనానికి ఆశీస్సులు అందిస్తారు. సమ్మక్క రాక జాతరలో ముఖ్యమైన ఘట్టం. పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. కాగా, సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. సారలమ్మ ప్రధాన పూజారిగా కాక సారయ్య. కన్నెపల్లి పూజా మందిరం నుంచి పసుపు, కుంకుమలను వెదురుబుట్టలో గద్దెపైకి తీసుకువసారు. జంపన్నవాగు ఒడ్డున ఉండే గద్దెపైకి జంపన్నకు ప్రతిరూపమైన పడిగెను కన్నెపల్లి నుంచి పాయం సురేష్, నార్లాపూర్‌లో ఉండే నాగులమ్మ రూపాన్ని తలపతి ఊకే చంద్రయ్య, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పూజారులు పెనుక బుచ్చిరాజులు, ఏటూరి నాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులను పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు తీసుకువస్తారు. కాగా, సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండకు చేరుకున్నాడు.

ఇక్కడ పగిడిద్దరాజును పెండ్లి కొడుకుగా పడిగె ఆకారంలో వెదురు కర్రకు అలంకరించారు. దీంతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల నడుమ కోయ పూజారులు పెళ్లికొడుకుగా తయారుచేసి అనంతరం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి.. కాలినడన పగిడిద్దరాజును పెనక వంశీయులతో కలిసి మేడారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు, మహిళలు స్వాగతం పలికారు.

కాగా, పగిడిద్దరాజుతోపాటు కోయ పూజారులు సాయంత్రానికి లక్ష్మీపురం(కర్లపల్లి)నకు చేరుకున్నారు. బుధవారం ఉదయానికి మేడారానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా.. పూజారులు గోవిందరాజును సైతం అందంగా బుస్తాబు చేసి సారలమ్మతోపాటు బుధవారం గద్దలపైకి తీసుకువస్తారు. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో తెలుగు రాష్ట్రాల నుంచే కాక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒరిస్సాలోని గిరిజన ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సమ్మక్కసారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా.. జాతరలో భాగంగా అమ్మవార్లు వన ప్రవేశం అనంతరం, అరెం వంశీయులు పగిడిద్దరాజును గుండాలకు తీసుకువచ్చి గర్భగుడిలో ఉంచుతారు. జాతర ముగిసిన 16 రోజుల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డంలో జాతర నిర్వహిస్తారు.

తరలివస్తున్న భక్తజనం

బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జాతర ప్రారంభం కావడంతో భక్తజనం రద్దీ విపరీతంగా పెరిగింది. వనారణ్యం కాస్తా జనారణ్యంగా మారి మేడారం దర్శనిమిస్తోంది. వేలాదిగా పిల్లా పాపలతో భక్తులు ముందు రోజే ఈ ప్రాంతానికి చేరుకుని సమీపంలో గుడారాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. మరికొంతమంది జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మలను దర్శించుకుని తరిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీళ్లు, మజ్జిగను అందిస్తున్నారు. కరోనా భయం తగ్గడంతో భక్తలు రాకపోకలు బాగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.

పెద్ద ఎత్తున ప్రైవేట్ వాహనాలు.. ట్రాఫిక్ జామ్

భక్తులు ప్రైవేట్ వాహనాలలో మేడారానికి పెద్దఎత్తున వస్తుండడంతో కొత్తూరు గ్రామం నుంచి మేడారం వరకు ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ వాహనాలను మేడారంలో ప్రవేశించకుండా నార్లాపూర్‌లో ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే నిలిపివేస్తున్నారు. నేడు సారలమ్మ రాక సందర్భంగా పెద్దమొత్తంలో భక్తుల రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పూనుగొండ్ల జాతరను అడిషనల్ డిఎస్పీ నాగచైతన్య, సిఐ వినయ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొని పగిడిద్దరాజును మేడారానికి పంపే తంతులో ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా తగిన బందోబస్తున్న ఏర్పాటు చేశారు.

సిఎం బసకు కంటైనర్‌లో ఏర్పాట్లు

మేడారం సమ్మక్క- సారక్క జాతరకు ఈనెల 18న ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబసమేతంగా రానున్నారు. ముఖ్యమంత్రి విడిది చేసేందుకు ప్రత్యేకంగా కంటైనర్‌లో బస ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కోసమే ఈ కంటైనర్‌లో సకల సౌకర్యాలు ఉండేవిధంగా హైదరాబాద్‌లోనే తయారు చేసి జాతరకు తరలించారు. గద్దెలను ఆనుకొని ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కనే దాన్ని ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News