Friday, September 19, 2025

మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వడం జరిగిందని వరంగల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజుల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి మేడారం మహాజాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు లభించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోపకరంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు,

సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించామని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మాస్టర్ ప్లాన్‌పై గురువారం నాడు సమీక్షించారు. గద్దెలను అభివృద్ది డిజైన్, సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం డిజైన్, ప్రహారీగోడ నిర్మాణానికి అవసరమైన రాతి డిజైన్ గద్దెల అభివృద్ది తర్వాత అదనంగా ఎంత విస్తీర్ణం పెరుగుతుంది వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ది పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారుచేసిన కన్సల్టెన్సీని ఆదేశించారు.

అందరి అభిప్రాయాలతోనే గద్దెల డిజైన్ తయారు
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు స్వయంగా మేడారం వెళ్లి అక్కడి పూజారులు, స్ధానిక ప్రజల అందరి అభిప్రాయాలను తీసుకొని గద్దెల డిజైన్ తయారు చేశారని అన్నారు. గతంలో భక్తులకు క్యూలైన్ల వలన పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగా లభించేదికాదని అన్నారు. మహాజాతర సమయంలో ఇది భక్తులకు ఇబ్బందికరంగా ఉండేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు భక్తుల సౌకర్యార్ధం గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి గాంచిందని, ఇది గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పడుతుందని అన్నారు. తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా సమ్మక్క సారలమ్మలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారని తెలిపారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఒకేసారి పది వేల మంది భక్తులకు తల్లుల దర్శన భాగ్యం
మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు ఏడు వేల మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉందని అయితే విస్తరణ పనులు పూర్తయ్యాక, ఆ సామర్థ్యం పది వేల మందికి పైగా పెరగనుందని అన్నారు. ప్రాంగణం వెడల్పు, పొడవు పెరిగి మరింత విశాలంగా మారుతుందని, దీనివల్ల పెద్ద ఎత్తున వచ్చే భక్తులు సులభంగా, వేగంగా, క్రమపద్ధతిలో దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని సీతక్క స్పష్టం చేశారు. భక్తులు ఒకే దారిలో, సాఫీగా తల్లులను దర్శించుకునే వీలు ఉంటుందని అన్నారు. మేడారం ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆదివాసి ఆధ్యాత్మిక భావన కలిగేలా సంప్రదాయ ఆర్చ్‌లు నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ రాతి పిల్లర్లు, వాటిపై ఆదివాసీ కళాత్మక ఆకృతులతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దనున్నారని తెలిపారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఈ రాతి కట్టడాలు శాశ్వత చిహ్నాలుగా నిలిచిపోతాయని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతిపాది త అభివృద్ధి పనుల పట్ల సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ లోపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News