Sunday, April 28, 2024

జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం… ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట ఇలా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , టూరిజం శాఖా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందజేసే ఆర్థిక సహాయానికై ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన హైదరాబాద్ బేగంపేటలోని హరితప్లాజా హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ అండగా ఉంటుందని అన్నారు .

కష్ట కాలంలో కుటుంబానికి కావాల్సింది ఒక పలకరింపు అని, మీకు మేము ఉన్నామనే భరోసా దాన్ని అకాడమీ ఇవ్వడం చాలా గొప్ప సహాయం అని పేర్కొన్నారు. అచ్చంపేట జర్నలిస్టు చికిత్స కోసం ప్రభుత్వం సిఎంఆర్‌ఎఫ్ క్రింద 40 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనారోగ్యం పాలైన జర్నలిస్టు కుటుంబాలకు హాస్పిటల్స్ లో చికిత్స చేసుకోవడానికి, తరవాత సిఎంఆర్‌ఎఫ్ సహాయం కావాలంటే ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అకాడమీకి అందచేస్తే తన పేషీ ద్వారా ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తామని, అలాగే ఇందుకు ఎల్‌ఓసి రావడానికి కూడా పూర్తి సహకారం అందిస్తానని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి జర్నలిస్తుల కుటుంబాల కోసం అకాడమీ చేసిన గుర్తింపు కార్డును ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ అకాడమీ సందర్శించి ఐదు గంటలు నిశితంగా చర్చించి, కార్యక్రమాలు ఎలా ఉండాలో, దిశా నిర్దేశం చేశారని, ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని సూచించారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం ద్వారా సిఎం ఆ వెంటనే రూ. 10 కోట్లు విడుదల చేశారన్నారు.గత ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వం 42 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మీడియా అకాడమీ ఈ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. దీనిలో భాగంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి లక్ష రూపాయలు, మూడు వేల రూపాయలు నెలవారి పెన్షన్ అందజేస్తున్నామని, వారి కుటుంబంలో ఎల్‌కెజీ నుండి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలకు ట్యూషన్ ఫీజు కోసం ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని అన్నారు. అనారోగ్య లేదా ప్రమాదం బారిన పడి పని చేసుకోలేని నిస్సాహాయ జర్నలిస్టులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు.

కరోనా కాలంలో జర్నలిస్టులకు అండగా నిలిచి ఆ వ్యాధితో చనిపోయిన 70 మంది జర్నలిస్టులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల సహాయం అకాడమీ అందజేసింది. కరోనా మహమ్మారి వ్యాధిగ్రస్తులైన జర్నలిస్టుల చికిత్సకు, వారి నిత్యవసర వస్తువులకు అకాడమీ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలు అందించిందన్నారు. మీడియా అకాడమీ బుధవారం మొత్తం 104 జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నదని, ఇవ్వాళ లబ్ధి పొందిన వారితో కలిసి అకాడమీ 600లకు పైగా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేసిందని, దీనికోసం ఇప్పటివరకు అకాడమీ 19 కోట్ల రూపాయలు సహాయం అందించిందని అల్లం నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల కోసం చేసే కార్యక్రమాలని అనుకున్నానని, ఈరోజు మీడియా అకాడమీ ద్వారా ప్రభుత్వం చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కార్యక్రమం ఇంత ఎఫెక్టివ్ గా ఉంటుందన్న విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలిసిందని అన్నారు.

ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. జర్నలిస్టు సంక్షేమం మేనేజ్మెంట్ బాధ్యత అని, కానీ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధి ద్వారా సుస్థిరంగా నిలదొక్కుకునే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. జర్నలిస్టు కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం క్రింద 3.5 కోట్లు, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా 2.5 కోట్లు సహాయం అందించిందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరో 10 నుంచి 15 కోట్లు కేటాయించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వందన సమర్పణ టియుడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతీ సాగర్ చేయగా..సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు, కిషోర్ బాబు, మీడియా అకాడమీ సెక్రటరీ, వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం జర్నలిస్టు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News