Saturday, May 17, 2025

ముంబైకి ఎదురుందా?

- Advertisement -
- Advertisement -

నేడు రాజస్థాన్‌తో పోరు
జైపూర్: వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ గురువారం జరిగే పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ముంబై వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి దూకుడు మీద ఉంది. రాజస్థాన్‌పై కూడా ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ముంబై ఆరో విజయంపై కన్నేసింది. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం అందుకున్న రాజస్థాన్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గుజరాత్ జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా అందరి కళ్లు వైభవ్‌పైనే నిలిచాయి. మరో యువ సంచలనం యశస్వ జైస్వాల్‌తో కలిసి శుభారంభం అందించాలనే లక్షంతో సూర్యవంశీ ఉన్నాడు. గుజరాత్‌పై గెలుపు రాజస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

రోహిత్ జోరు సాగాలి..

అద్భుత బ్యాటింగ్‌తో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ కీలక ఇన్నింగ్స్‌లతో ముంబైకి అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని మెరుగైన బ్యాటింగ్‌ను జట్టు ఆశిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే ముంబైకి ఎదురే ఉండదు. రికెల్టన్ కూడా రోహిత్‌కు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వీరు మరోసారి జట్టుకు శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నారు. విల్ జాక్స్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకుంటున్నాడు. ఈసారి కూడా అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే జట్టు కోరుకుంటుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా జోరుమీదున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్య చెలరేగితే ముంబైకి మరోసారి భారీ స్కోరు ఖాయం. తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య, నమన్ ధిర్ తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. సూర్యవంశీ, యశస్విలు మరోసారి శుభారంభం అందించేందుకు సిద్ధమయ్యారు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా జోరుమీదున్నాడు. హెట్‌మెయిర్, హసరంగ, ధ్రువ్ జురెల్, ఆర్చర్‌లతో రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News