Monday, April 29, 2024

ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. చిమన్పల్లిలో నిర్మించతలపెట్టిన పీహెచ్ సి భవనానికి భూమిపూజ చేశారు. హెలికాప్టర్ ద్వారా దర్పల్లి కి చేరుకున్న మంత్రి హరీష్ రావుకు హెలిప్యాడ్ వద్ద జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జహీరాబాద్ ఎం.పీ బీ.బీ.పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలుకగా, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ సభ వేదికను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత వైద్యుల కొరత వెంటాడేదని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమై ప్రజలకు భరోసా లభించిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నియోజకవర్గ కేంద్రాకు, అన్ని మండలాల్లో వంద పడకల ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని, ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య 30% నుండి 70 శాతానికి పెరిగిందన్నారు.

ఇందులో భాగంగానే ధర్పల్లిలో 33 కోట్లతో నూతనంగా వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశామని, ఏడాది కాలం లోపు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇదే ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా కొనసాగిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని, బిడ్డ జన్మించాక కెసిఆర్ కిట్ ఇస్తున్నామని, నయాపైసా ఖర్చు లేకుండా ఇంటి వరకు ప్రత్యేక వాహనాల్లో బాలింతలను పంపించడం జరుగుతోందన్నారు. సర్కారీ దవాఖానాల బలోపేతంతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని అన్నారు.

ఒకవైపు వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తూనే, పేదలకు కూడా వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 35 మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఫలితంగా పది వేల వైద్య విద్య సీట్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఆటో రిక్షా కార్మికులు, హమాలీల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసిస్తుండలం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి వాహనాలు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గృహలక్ష్మి పథకంలోనూ మహిళలకే మంజూరీలు ఇస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా మరెక్కడ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని, బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్నామని అన్నారు.

మిషన్ భగీరథతో ప్రతి పల్లెలో తాగునీటి గోస దూరమైందని, కళ్యాణ లక్ష్మి ద్వారా 12 లక్షల 70 వేల మందికి ఇప్పటివరకు 11 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ఆసరా పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల కోసం రెసిడెన్షియల్ కళాశాలలు, రైతుబంధు, రైతు బీమా, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, తండాలకు జీపీ హోదా కల్పించడం, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం, సాగు రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడం వంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పడుతున్నాయని అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, ఐటి ఉద్యోగాల కల్పన, వైద్యరంగం, ధాన్యం ఉత్పత్తి వంటి అనేక అంశాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా మారిందని హర్షం వెలిబుచ్చారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News