Saturday, April 20, 2024

దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ అయ్యిందని, దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యావసనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ఎల్పీ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే ఒప్పుకుందని మంత్రి గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడరని చలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవి అన్నీ అబద్దాలే అని ఆయన పేర్కొన్నారు. దొంగనోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్లు ఆర్బీఐ చెప్పిందని మంత్రి తెలిపారు.

బిజెపి అధికారంలోకి రాకముందు ప్రజలు వాడే నగదు తక్కువ అని, ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయ్యిందని, 2014కు ముందు దేశ జిడిపిలో 11 శాతం నగదు ఉండేదని, ప్రస్తుత దేశ జిడిపిలో 13 శాతానికి పైగా నగదు చలామణిలో ఉందని, పెద్ద నోట్ల వాడకం పరిమితం కాలేదని, రెట్టింపు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో నల్లధనం, అవినీతి పెరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు. బిజెపి పాలనలో మాదకద్రవ్యాల రవాణా, టెర్రరిజం పెరిగిపోయిందని ఆయన వాపోయారు. కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటీ కూడా నెరవేరలేదన్నారు.

ప్రధాని చెప్పిన 5 ట్రిలియన్ ఎకానమీ ఒక జోక్ అని, పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలైన్లో నిలబడి 108 మంది చనిపోయారని, పెద్ద నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో వంద లక్షల కోట్లు అప్పు చేసి, దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోందని, బిజెపి అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News