Saturday, May 4, 2024

ఢిల్లీ బానిసలకు ఆత్మగౌరవానికి పోటీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. తెలంగాణ అభివృద్ధి ప్రధాత సిఎం కెసిఆర్ సంచలన నాయకుడు అని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. బుధవారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదనంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్రాంతి గంగిరెద్దులు వస్తున్నాయని ప్రజలు జాగ్రత్త పడాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎగబడి నిన్న మొన్నటి నుంచి ప్రజల వద్దకు వస్తున్నారని ఒకసారి అధికారం ఇవ్వాలంటూ అడుగుతున్నారని 50 ఏళ్లు అధికారంలో ఉండి రైతులకు కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దౌర్బాగులని మండిపడ్డారు. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేతగాని కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఇవ్వమంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ నేతల తీరుపై ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు గుడ్డిగుర్రాల పళ్లు తోమరా అని విమర్శించారు.

కలిసి ఒకచోట నలుగురు కూర్చొలేని కాంగ్రెస్ నేతలు అధికారం కోసం పాకులాండడం సిగ్గు చేటన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణవాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని అన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తిన రేవంత్‌రెడ్డి రైఫిల్ రెడ్డి అని మండిపడ్డారు. సంచులు మోసే నాయకుడు రేవంత్‌రెడ్డి అని ఓట్ల కోసం డబ్బుల సంచులు మోసి అడ్డంగా దొరికి చిప్పకూడు తిన్న నాయకుడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అని అన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. మోడీ, బోడీ జన్‌ధన్ ఖాతాల పేరిట ప్రజలను మోసం చేశాడని, ఓట్ల కోసం ఖాతాలలో 15 లక్షలు వేస్తానని చెప్పి ఎవరికైనా వేశాడ అని ప్రశ్నించారు. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇస్తామని చెప్పిన ఆయన 9 ఏళ్ళ కాలంలో 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.

మన్మోహన్‌సింగ్ ప్రధాని ఉండగా సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే ఆడ బిడ్డలు ఏమి వండుకొని తింటారని ప్రశ్నించి సిలిండర్‌కు మొక్కి ఓట్లు అడిగిన నరేంద్ర మోడీ ఇప్పుడు సిలిండర్ ధర 1200 రూపాయలు చేశారని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధర 70 నుంచి 115 రూపాయలకు పెంచారని, దేశంలో అన్ని ధరలు పెరిగిపోయాయని బిజెపి నేతలు కనిపిస్తే గుండు కొట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపి అర్వింద్ కుసంస్కారి అని కెసిఆర్ లాంటి పెద్ద మనిషిని పట్టుకొని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్వింద్ తండ్రి డి. శ్రీనివాస్‌పై తాము విమర్శలు చేయలేమా అని పెద్దలకు గౌరవించే, సంప్రదాయ సంస్కృతి తమకు ఉందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. బిజెపి ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీగా పని చేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలలో ఎంపి అర్వింద్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. వందల కోట్ల అభివృద్ది కనిపించడం లేదని ఎంపి అర్వింద్‌పై విమర్శలు చేశారు.

మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? మతం మంటలు రేపే బిజెపి కావాలా..? మూడు పంటల కెసిఆర్ కావాలా అని ప్రజలు తేల్చుకోవాలన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని, మణిపూర్‌లో ఏం జరుగుతుందో గమనించాలన్నారు. కుంభకోణాల కాంగ్రెస్ కావాలా కెసిఆర్ కావాలా అని అన్నారు. బిఆర్‌ఎస్‌కు బాస్ తెలంగాణలో ఉన్నారని బిజెపి, కాంగ్రెస్‌లకు ఢిల్లీ పెద్దలు బాస్ అని ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో ప్రజలే చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికలలో ఢిల్లీకి బానిసలైన కాంగ్రెస్, బిజెపి, తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన బిఆర్‌ఎస్‌కు మధ్య పోరు జరుగుతుందని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కవులకు, సాహితీవేత్తలకు అడ్డా అని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరధి నడయాడిన నేల అని జిల్లాలో కళాభారతి కేంద్రం ఏర్పాటుకు కెసిఆర్ వంద కోట్ల నిధులు ఇచ్చారన్నారు. జిల్లా కేంద్రంలో 50 కోట్లతో ఐటి హబ్ నిర్మాణం చేపట్టి 1400 మందికి ఉద్యోగవకాశాలు కల్పించామన్నారు.

యువత నైపుణ్యాన్ని పెంపొందించుకొని తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలన్నారు. 11 కోట్లతో న్యాక్ భవనాన్ని ఏర్పాటు చేసి 120 మందికి ఉపాధి కల్పించామన్నారు. 7 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, 22 కోట్లతో ఖిల్లా రాఘునాధ చెరువు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు, అర్సపల్లిలో 15కోట్ల 50 లక్షలతో వైకుంఠధామ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, 20 కోట్లతో మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్‌లు, 20 కోట్లతో రైల్వే ఓవర్ బిడ్జ్రిలు, రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లను నిజామాబాద్ నగరంలో నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో జిల్లా ప్రజలు ఎమ్మెల్యేలందరిని కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, మేయర్ దండు నీతూకిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మార గంగారెడ్డి, ఆకుల లలిత, ఎమ్మెల్సీ రాజేశ్వర్, గంగాధర్ గౌడ్, బిగాల మహేష్‌గుప్తా, కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News