Sunday, April 2, 2023

వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం

- Advertisement -
- Advertisement -

13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి
అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు

 

మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో ఫిబ్రవరి 5వ తేది సువర్నాధ్యాయంగా నిలిచిపోనుంది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున కేసిఆర్ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన స్థలాల్లో బిసి ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. 13 బిసి సంఘాలు ఉప్పల్ భగాయత్‌లో సాముహికంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస గౌడ్, మల్లారెడ్డిలు పాల్గొన్నారు. ప్రతి కుల సంఘం భవనం శిలాఫలకం వద్దకు స్వయంగా వెళ్ళిన మంత్రులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నవధాన్యాలతో భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన బిసి కుల సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన బిసిలు ప్రజల నుద్దేశించి బహిరంగ సభా వేదికగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 75 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బిసి వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. గతంలో దండంపెట్టినా గుంట జాగా ఇవ్వలేదని, ఇప్పుడు అడగకుండానే రాజధాని నడిబొడ్డన కాకాపేఊట, ఉప్పల్ బగాయత్‌లో వేల కోట్ల వకిలువ చేసే 87.3 ఎకరాలు, రూ.95 కోట్లు ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. ఉప్పల్ బగాయత్‌లో 13 కుల సంఘాలకు, 18.3 ఎకరాలలో దాదాపు 17 కోట్లతో నిర్మించే భవనాలకు భూమి పూజ చేశామన్నారు. ఉప్పల్ బగాయత్‌లో మొత్తం 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించారన్నారు. దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు. తమ సంస్కృతి తెలిసేలా కమ్యూనిటీ హాళ్ళు, పిల్లలు చదువుకోడానికి లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లు తదితర సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. రోడ్లు, తాగునీరు, కరెంటు వంటి సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.

కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, గురుకులాలు ఇలా ప్రతి దాంట్లో బిసిల వాటా సగర్వంగా తీసుకుంటున్నామన్నారు. బిసి గురుకులాలను 19 నుండి 310కు పెంచడం జరిగిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు చేయూత దొరికిందన్నారు. తెలంగాణ రావడంతోనే మన జీవితాల్లో పెద్ద మార్పు జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తలసాని చెప్పారు. కాంగ్రెస్ దోపిడి చేస్తుందని, బిజెపి మతం మత్తులో ముంచుతుందని కేవలం బిఆర్‌ఎస్ మాత్రమే అభివృద్ధి తెస్తుందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పూలే అడుగుజాడల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. బిసిల ఆత్మగౌరవ భవనాలు సమూహంగా ఎదిగే అవకాశాన్ని బిసిలకు ఇచ్చేందుకు దోహద పడుతాయన్నారు.

ఎంఎల్‌సి మధుసూధనా చారి మాట్లాడుతూ విశ్వబ్రహ్మణులను గుర్తించి 5 ఎకరాలతో పాటు 5 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్‌లో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం బిసి కులాలకు వేదికగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్ భగాయత్‌లో శంకుస్థాపన చేసుకున్న 13 సంఘాలలో గంగపుత్ర 3 ఎకరాలు, 3 కోట్లు, నీలి 10 గుంటలు, 25 లక్షలు, లక్కమరికాపు 20 గుంటలు, తెలంగాణ మరాఠా మండల్ 2 ఎకరాలు, పూసల 1 ఎకరం, కోటి రూపాయలు, కుమ్మరి శాలివాహన 3 ఎకరాలు, 3 కోట్లు, విశ్వబ్రహ్మణ5 ఎకరాలు, 5 కోట్లు, నక్కాస్ 1 ఎకరం, కోటి రూపాయలు, బొందిలి 1 ఎకరం, కోటి రూపాయలు, కాచి 20 గుంటలు, 50 లక్షలు, వాల్మీకి బోయ 1 ఎకరం, కోటి రూపాయలు, భూంజ్వ 10 గుంటలు, 25 లక్షలు, జాండ్ర 10 గుంటలు, 25 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ముఠా గోపాల్, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సాహిత్య అకాడమి చైర్మన్ గౌరీ శంకర్, బిసి కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిషోర్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు, రెవెన్యూ, అర్ అండ్ బి శాఖల అధికారులు, బిసి కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News