Sunday, September 15, 2024

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లతో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

విద్యాసంస్థల సెలవు కలెక్టర్టకే నిర్ణయాధికారం
పదిరోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి
23,24తేదిల్లో రెవెన్యూ ముసాయిదాపై వర్క్‌షాప్‌లు
జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదురుకోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నూతన రెవెన్యూ చట్టం -2024 ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి , జిల్లా కలెక్టర్లతో మంగళవారం నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రిగారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గురించి మంత్రిగారు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్లు ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతి కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టం 2024 పై ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను వచ్చే పదిరోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల పెండింగ్ అధికంగా ఉందని ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. లక్షాలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్ క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్ లతో పాటు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.

మొత్తం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్‌కి సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వని పక్షంలో ఇప్పుడు తీసుకుని ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో వంద ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఇందులో ఎదురయ్యే మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను సూచించారు. గత ప్రభుత్వంలో 2020 లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News